Monday, December 14, 2015

సంకీర్తన


    
      గీత గొవింద కారుడిగా ప్రశస్తి పొందినవాడు జయదేవుడు.ఆయన కుటుంబ సంబంధ పదాలతో దశావతారాన్ని పోలుస్తూ చెప్పిన తెలుగు సంకీర్తనం లోని  సరస ప్రయోగ చాతుర్యం,మాధుర్యం,లయ మనసుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి.
         మా పాప మా వల్లు మత్స్యావతారం
         కూర్చున్న తాతల్లు కూర్మావతారం
         వరసైన బావల్లు వరహావతారం
         నట్టింట నాయత్త నరసిమ్హావతారం
         వాసి గల బొట్టెల్లు వామనావతారం
         పరమ గురుదేవ పరశురామావతారం
         రంజించు మామయ్య రామావతారం
         బంటైన బంధువులు బలరామావతారం
         బుధ్ధి తో మా చిట్టి బుధ్ధావతారం
         కలివిడితో మా యన్న కల్క్యావతారం
         వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి
         చిట్టి నా కన్న శ్రీ కృష్ణావతారం.
           

Sunday, December 13, 2015

బీట్ రూట్ రసం



   బీట్ రూట్------------------చిన్నది1
   టమోటాలు---------------2
   ఉల్లి----------------------------1
   అల్లం-----------------------చిన్న ముక్క
   వెల్లుల్లి----------------------2 రెబ్బలు
   ఉప్పు---రుచికి సరిపోను
   రసం పొడి--------------1స్పూను
   నూనె--------------------1స్పూను
   కరివేపాకు,కొతిమీర,తిరగమోత దినుసులు
   పులుపు చాల దనుకొనే వారు ఒక రెబ్బ చింత పండు వేసుకోవచ్చు.
             ముందుగా బీట్ రూట్ చెక్కు తీసి అది ,టమోటా ముక్కలుగా తరిగి ,అల్లము ,వెల్లుల్లి కూడా వేసి మెత్తగా ఉడికించి మిక్సీ లో వేసి పేష్టు చేసుకోవాలి.తరువాత స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగినాక తిరగమోత దినుసులు ,కరివేపాకు,సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేగినాక ముందుగా చేసిపెట్టుకున్న పేష్టు వేసి పలచగా అయ్యేలా నీరు పోయాలి.అది కళాపెళా కాగుతుండగా రసం పొడి ఉప్పు వేసి బాగా కాగినాక కొతిమీర వేసి దించుకోవాలి.వెరైటీ కోరుకునేవారు ఈ రసం ప్రయత్నించండి.

Sunday, November 29, 2015

గురజాడ


     
      ఆంధ్ర సాహిత్య లోకానికి అరుణోదయం
      యుగకర్త గురజాడ మఓదయం
      కొత్తపాతల మేలు కలయికగా
      క్రొమ్మెరుంగులు చిమ్ముతూ
      నవయుగ వైతాళికుడిగా
      జాతిని నడిపిస్తూ
      మానవత్వపు పరిమళాలు
      వెదజల్లావు
      దేశమంటే మట్టి కాదు 
      మనుషులే నంటూ
      సొంత లాభము కొంత మానుకొని
      పొరుగు వాడికి తోడు పడమన్నావు
      జాతి బంధములన్న గొలుసులు
      జారిపోయి
      మతాలన్నీ మాసిపోయి
      ఙ్ఞాన మొక్కటి నిలచి 
      వెలగాలని
       వర్ణభేదాలు కల్లలై
      యెల్లలోకము ఒక్క ఇల్లుగా
      చేసుకొని
      జీవించాలని కోరావు
      తెలుగు కవితను
       ముత్యాల సరాలతో అలంకరించి
       కొయ్య బొమ్మలే మెచ్చు కళ్ళకు
       కోమలులు సౌరెక్కునా యని
      నిలదీశావు
      ప్రజల భాషనే
      కవిత్వ భాష గా"దిద్దు బాటు"చేసి
      కష్ట సుఖాల సారమెరిగి
      మంచియన్నది మాలయైతే
     మాల నేనౌతా నని
     సమాజ శ్రేయస్సే"దీక్షా విధి"గా
     భావించిన
     సర్వ మానవ హితుడా!
    తెలుగు సాహితీ జగత్తులో
    శతాబ్ద కాలంగా
    వెలుగులీనుతున్న
    ఓ కవి భాస్కరుడా!
   నీ కిదే నా నివాళి.

Tuesday, November 24, 2015

అలసంద గారెలు


     అలసందలు-------------1/4కెజి
    పచ్చి మిర్చి---------6
    అల్లం---------------------కొంచెం
    ఝీర----------------------1స్పూను
    ఉల్లి పాయ---------------1
    ఉప్పు-------రుచికి సరిపోను
   నూనె------డీప్ ఫ్రై కి సరిపోను
                అలసందలు 5,6 గంటలు నానబెట్టి,అల్లం,పచ్చిమిర్చి వేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి.అందులో జీర,ఉల్లి పాయ సన్నగా తరిగి వేసుకోవాలి.అన్నీ కలిపి చిన్న గారెలుగా చేసి నూనె లో డీప్ ఫ్రై చేయాలి.వేడి,వేడి గారెలు రెడీ!
   
   

ఆశ


   నేను ఒంటరి జీవిని
   ప్రేమ కోసం వెతుకుతూ ప్రార్ధిస్తున్నాను
   నన్ను ప్రేమించి
   నా కోసం జీవించే వారు
   ఒకరు కావాలని
   వేడుకుంటూనే ఉన్నాను
   నన్ను ఆనందం గా,సుఖం గా ఉంచాలని
   కష్టాల సుడిగుండాలలో నడుస్తుంటే
   జీవన పద్మ వ్యూహం లో
   నన్ను ఒంటరిగా వదలకూడదని
   కోరుకుంటూనే ఉన్నాను.
   కాలం కరిగిపోతూనే ఉంది
   నేను ఎందు కోసం వెదుకుతున్నానో
   దేనికోసం జాగ్రత్త పడుతున్నానో
   ఎప్పుడూ మరచిపోలేదు.
   చివరకు
   అదృష్టం నా తలుపు తట్టింది
   నా ప్రయాణం లో
   ఒక అపురూప వ్యక్తి తారస పడ్డాడు
    అతనే ఆత్మ,భాగస్వామి,స్నేహితుడు
    అతని ప్రేమకు లోతులు లేవు
    ఓర్పుకు ఎల్లలు లేవు
    అందుకే
   ఏదో జరిగి పోతుందనే భయం తో
   జీవించ వద్దు
   ఆలస్యంగా నైనా
   భగవంతుడు నీకు కావాల్సింది ఇస్తాడు
   వేచి ఉండటమే నీ పని.
   

Friday, November 20, 2015

తెలుగు


      అనురాగం పండించి,
      ఆత్మీయత కలబోసి
      ఇంగిత ఙ్ఞానం కలిగి
     ఈసు ఇసుమంత లేక
     ఉజ్జ్వలం గా వెలుగుతూ
     ఊకువ గా నిలచి
     ఎలతోట విరిసిన
     ఏలుబడి భాష
     ఐచ్చికము గా నేర్వ కుతూహల బడు
     ఒప్పు భాషలందెల్ల ఉత్తమంబుగా
     ఓజోమయమై అలరారు భాష
     ఔచిత్యము నెరిగి
     అందలము నెక్కించ
     తడబాటు పొందెద వేలా
     ఓ తెలుగు వాడా!
  
  ఊకువ=ఆధారం.
     

     

Tuesday, November 3, 2015

ఫలూద



   ఫాలు----------1కప్పు
   సేమ్యా------1/4కప్పు
   రోజ్ సిరప్------3టబుల్ స్పూన్లు
   సబ్జా గింజలు---1టబుల్ స్పూను
   వెనిల్లా ఇచె క్రీం---1-2స్కూప్స్
       సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తీసి పక్కన బెట్టాలి.పాలలో సేమ్యా వేసి ఉడికించి చల్లార నివ్వాలి.
      ఒక గ్లాసు తీసుకొని ముందుగా రోజ్ సిరప్ వేసి పైన నానిన సబ్జా గింజలు ఆ పైన ఉడికించిన సేమ్యా పైన వెనిల్లా ఇచె క్రీం వేసి నట్స్ చెర్రీస్ తో అలంకరించాలి.లేయర్స్గా వేయడం లోనే మన ప్రతిభ కనిపిస్తుంది.నోరూరించే ఫలూదా రెడీ.