అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతా; ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నిలుస్తారు. వేదకాలంలో స్త్రీ పురుష భేదం అంతగాకనిపించదు. రాణి రుద్రమ ,దుర్గావతి, చాంద్ బీబీ,పల్నాటి నాగమ్మవంటి స్త్రీ మూర్తులు రాజకీయంగా సమాజాన్ని ప్రభావితం చేసారు.భూమి తల్లి,గోమాత,గంగామాత, భారతమాత అన్నింటిలో మాతృమూర్తిని పూజించుకొనే విశిష్ట లక్షణం మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. భారతీయ స్త్రీ ప్రపంచ స్త్రీలందరికీ ఆదర్సవాదిగా నిలుస్తుంది.రాజకీయవేత్తలుగా, శాసనకర్తలుగా,శాస్త్రవేత్తలుగా,విమానచోదకులుగా,అంతరిక్షంలో వ్యోమగాములుగా,న్యాయవాదులుగా,వైద్యులుగా ఇది అది యేమన అన్ని రంగములలో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు.
ఇది ఒక కోణం .విద్యాధికులైనా ,వుద్యోగులైనా స్త్రీ వివక్షకు గురి అవుతూనే వున్నది. నేటికీ బస్సు చార్జీ డబ్బులు మాత్రమే ఇచ్చి వుద్యోగానికి పంపే ప్రబుధులు ఎందరో.వుద్యోగం చేస్తున్నా ఆర్ధిక స్వేచ్చ లేని స్త్రీల దైన్య స్థితి ఇది. భార్య తనకన్నా చదువులో ,వుద్యోగంలో, తక్కువగా వుంటేనే భర్త అహం సంతృప్తి చెందుతుంది .మిన్నగా వుంటే హర్షించే భర్తల శాతం చాలా తక్కువ.నాగరికతలోఎంత ముందడుగు వేస్తున్నామనుకున్నా ఇప్పటికీ వరకట్నపు చావులు, అత్తా ఆడబిడ్డ ల వేధింపులు రోజూ ఏదోఒక మూల జరుగు తూనే వున్నాయి. స్త్రీల ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు నిత్యం జరిగే తంతులు.వుద్యోగం చేసేస్త్రీలని చులకనగా చూడటం ,నీచం గా మాట్లాడటం జరుగుతూనే వుంటుంది. ఇప్పుడు ఆధునిక వేధింపు ఏమిటంటే యాసిడ్ దాడులు. తన మాట వినకపోయినా, ప్రేమించకపోయినా యాసిడ్ పోసేయటమే. ఆ అమ్మాయికి ఇష్టా యిష్టాలు వుంటాయని ఆలోచించ రెందుకో. ఆకాశంలో సగం అని చెప్పుకోవడమే గాని రాజకీయాలలోగాని ,ప్రాధాన్యతా రంగాలలోగాని స్త్రీల శాతం ఎంత వున్నది? అతి కొద్ది మంది మాత్రమే వున్నత పదవులలో వుంటున్నారు .అన్నిటిలోవివక్ష కొనసాగుతూనేవుంటున్నది. ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా మౌలిక మైన మార్పులు రానప్పుడు స్త్రీల పరిస్థితి ఇంత కంటే మెరుగుగా ఎలా వుండగలదు.