ఆంధ్ర సాహిత్య లోకానికి అరుణోదయం
యుగకర్త గురజాడ మఓదయం
కొత్తపాతల మేలు కలయికగా
క్రొమ్మెరుంగులు చిమ్ముతూ
నవయుగ వైతాళికుడిగా
జాతిని నడిపిస్తూ
మానవత్వపు పరిమళాలు
వెదజల్లావు
దేశమంటే మట్టి కాదు
మనుషులే నంటూ
సొంత లాభము కొంత మానుకొని
పొరుగు వాడికి తోడు పడమన్నావు
జాతి బంధములన్న గొలుసులు
జారిపోయి
మతాలన్నీ మాసిపోయి
ఙ్ఞాన మొక్కటి నిలచి
వెలగాలని
వర్ణభేదాలు కల్లలై
యెల్లలోకము ఒక్క ఇల్లుగా
చేసుకొని
జీవించాలని కోరావు
తెలుగు కవితను
ముత్యాల సరాలతో అలంకరించి
కొయ్య బొమ్మలే మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా యని
నిలదీశావు
ప్రజల భాషనే
కవిత్వ భాష గా"దిద్దు బాటు"చేసి
కష్ట సుఖాల సారమెరిగి
మంచియన్నది మాలయైతే
మాల నేనౌతా నని
సమాజ శ్రేయస్సే"దీక్షా విధి"గా
భావించిన
సర్వ మానవ హితుడా!
తెలుగు సాహితీ జగత్తులో
శతాబ్ద కాలంగా
వెలుగులీనుతున్న
ఓ కవి భాస్కరుడా!
నీ కిదే నా నివాళి.