Saturday, June 30, 2012

బర్డ్స్ ఫీడింగ్




 నేను అమెరికా లోని మాతమ్ముడి గారింటికి ఒక వారం ఉండటానికి వెళ్ళాను.వాళ్ళదిసొంత ఇల్లు.చుట్టూ అందమైన తోట.చార్లెట్ లో ఎక్కడ చూసినా చెట్లే.వాటిని చెట్లు అనకూడదు,వృక్షాలు అనాలి.అడవిని తలపిస్తుంది. వారిల్లు కూడా అలాగే ఉన్నది.అందులో నన్ను బాగా ఆకర్షించినది బర్డ్స్ ఫీడింగ్.



           తోటలో ఒక ఇనుప స్తంభానికి రెండు గాజు కుప్పీలు వాటికి మధ్య మధ్య చిన్న హోల్స్ ఉన్నాయి.వాటినిండా ధాన్యపు గింజలు పోసి స్తంభానికి వేలాడ తీసారు.ఉదయం నుంచిరాత్రి వరకు రకరకాల పక్షులు వచ్చి వాటిని తింటూ సందడి చేస్తుంటాయి.మాకు రోజూ అదే కాలక్షేపము.దానికి ఒక సూర్య కాంతిని  చార్జ్ చేసుకునే దీపము కూడా ఉన్నదండోయ్. ఆంధ్రదేశం లో కనుమరుగు అయిన పిచ్చుకలు ఇక్కడ కొల్లలుగా కనిపించాయి.వడ్రంగి పిట్టలు,కోయిలలు ఇంకా పేరు తెలియని ఎన్నో పక్షులు కనువిందు చేయటమేకాక వాటి కిలకిలా రావాలు మనస్సును ఆనంద డోలికల్లో ఊగించాయి.

          అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది హమ్మింగ్ బర్డ్.అది చాలా చిన్న పక్షి .కాని అమిత వేగంతో ఎగురుతుంది.అది రెక్కలను విపరీతమైన వేగం తో కదిలిస్తుంది.ఆరెక్కలుచేసే చప్పుడు వల్లే ఆపేరు వచ్చివుంటుంది.దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.ఆపక్షిని ఆకర్షించే నీలం పూలు పూసేమొక్కను పెట్టారు.ఒక ప్రత్యేకమైన గిన్నెలో ఒక పంచదార మూడు వంతులు నీరు కలిపిన ద్రావకాన్ని ఆగిన్నెలో పోసి పెడతారు.వాటిని నాలుగు రోజులకు ఒకసారి మారుస్తుంటారట. మనస్సుకు స్వాంతన కలుగచేసే ఆరోగ్యకరమైన వాతావరణం అక్కడ చోటుచేసుకున్నది.అది అందరితో పంచుకోవాలనే ఇందులో రాయడం జరిగింది. కొన్ని ఫొటోలు ఇక్కడ పెట్టాను మీరూ వీక్షించి ఆనందిస్తారని భావిస్తాను.

Wednesday, June 20, 2012

స్వామినారాయణ మందిరం


                                                

    ఆధ్యాత్మిక,మానసిక,భౌతిక ప్రశాంతతను చేకూర్చే మందిరాలు ప్రపంచవ్యాప్తంగా అనేకంకలవు.అలాంటి మందిరమే అట్లాంటాలోనిలారెన్స్ విల్లేహైవే ప్రక్కన రాక్ బ్రిడ్జె రోడ్డులో 29ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన "స్వామినారాయణ మందిరము".

        ప్రముఖ స్వామిమహరాజ్ ఆధ్వర్యంలో ఆగష్టు26,2007కి నిర్మించబడినది.టర్కిష్ లైంస్టోన్ ,ఇటాలియన్ మార్బుల్,ఇండియన్ పింక్ శాండ్ స్టోన్లను భారతదేశం లోని కళాకారులు వివిధ రూపాలలో చెక్కి దాదాపు 34000 పైగా ఆకృతులను అమెరికా తరలించారు.బాగా ఎత్తు మీద నిర్మించబడిన ఈ మందిరము అద్భుతమైన శిల్ప సంపదతోను,రాతి తోరణాలతోను చూపరులను మంత్రముగ్దులను చేస్తుంది.ఉదయం 9 నుండి 10.30,11.15 నుండి12.00,సాయంత్రం 4నుండి6.00 వరకు సందర్శకులకు మందిరం లోపలికి ప్రవేశం ఉంటుంది.ప్రసాదాలు, కొబ్బరికాయలు ఇతర పూజలు వంటి హడావిడి అక్కడ కనిపించదు. పూజారి హారతి ఇస్తారు.భక్తులు నిశ్శబ్దాన్ని పాటిస్తారు.ఎదురుగా పంచలోహాలతో చేసిన భగవాన్ స్వామి నారాయణ విగ్రహము ఉంటుంది.ప్రక్కన రాధాకృష్ణుల విగ్రహాలు   కొంచెము ఇవతలగా విఘ్నేశ్వరుడు ,సీతారాములు,శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్టించబడినాయి.ప్రశిష్యుల విగ్రహాలు కూడా కలవు.


          శ్రీస్వామి నారాయణ 1781లో ఉత్తర భారతదేశం లోని ఒకగ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు.అప్పుడు హిందూమతం దురాచారాలతోను,మూఢనమ్మకాలతోను,సమస్యలతోను అతలాకుతలం అవుతున్నది.వాటిని చూసి చలించిన ఘనశ్యాం మహరాజ్ (బాల్యంలోని పేరు)11 సంవత్సరాలకే ఇల్లు వదిలి ఏ విధమైన అనుచరులు ,కాలికి పాదరక్షలు లేకుండానే హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు 8000 మైళ్ళు ఒంటరిగా ప్రయాణించి మనిషి జీవితానికి నైతిక,ఆధ్యాత్మిక విలువలు ఎంత ముఖ్యమో ప్రచారం చేశాడు.ఆయన భోధనలు "వచనామృతం" అనే గ్రంధం లో ప్రచురించ బడ్డాయి.21సంవత్సరాల వయస్సులో "స్వామినారాయణ"సంప్రదాయాన్ని ప్రారంభించాడు.సంఘ సంస్కరణలు,పేదవారికి సహాయపడుట,మూఢాచారాలకు,దురలవాట్లుకు,హింసకు వ్యతిరేకంగా పోరాడటం ముఖ్య సిధాంతాలు.వీటి పట్ల ఆకర్షితులై స్వచ్చందంగా 2000 మంది అనుచరులు ఆయన శిష్యులుగా చేరారు. గుజరాత్లో 6 మందిరాలు నిర్మించబడ్డాయి.అందులో "అక్షర ధాం" ప్రఖ్యాతి గాంచినది.చిన్న వయస్సులోనే అనగా 49 సంవత్సరాలకే తనువు చాలించారు.ఆయన శిష్యులలో ముఖ్యుడైన గుణాతీతానంద స్వామి స్వామినారాయణ మత ప్రచార బాధ్యతను వహించారు.
గుణాతీతానంద స్వామి:-(1785-1867)
     వేదాలు,ఉపనిషత్తులు,ఇతిహాసాలు అనేక మత గ్రంధాలను ఆకళింపు చేసుకున్నారు.స్వామినారాయణ మతాన్ని ప్రచారం చెసిన మొదటి గురువుగా ప్రసిధ్ధికెక్కారు.
 భగత్జీ మహరాజ్:-(1829-1897)
  గుణాతీతానంద స్వామి శిష్యుడు.ఈయన రెండవ గురువు.
శశ్త్రాజీ మహరాజ్:-(1865-1951)
    మూడవ గురువు.మహా ఙ్ని.హిందూమతాభిమాని.5 మందిరాలు నిర్మించాడు.గుణాతీతానంద స్వామి(అక్షర),భగవాన్ స్వామినారాయణ(పురుషోత్తం)పేరుతో 1907లో భగవాన్ అక్షర పురుషోత్తమ స్వామి నారాయణసంస్థ ను(బి ఎ పి ఎస్) స్థాపించారు.
ప్రముఖ స్వామి మహరాజ్:-(1921-   )
         ప్రస్తుత గురువు.ఈయన ఆధ్వర్యంలో BAPS శాఖోపశాఖాలుగా విస్తరించినది.ప్రేమ,శాంతి,విశ్వాసము,మానవ సేవ ముఖ్య సిధాంతాలుగా ప్రపంచ వ్యాప్తంగా 3300 కేంద్రాలలో ఎ సంస్థ పనిచేస్తుంది.ఆధ్యాత్మిక,మానవతావిలువలు పెంచటమేకాక కళా,సాహిత్య,సంగీత రంగాల కేంద్రంగా కూడా ఈ సంస్థ పనిచేస్తున్నది.

ఇతరుల ఆనందంలోనే మన ఆనందాన్ని వెతుక్కోవాలనే వీరి బోధన అందరికీ అనుసరణీఈయమైనది.
    "సర్వే జనా సుఖినో భవంతు"