Sunday, November 7, 2010

కార్తీక మాస ప్రాధాన్యత

కార్తీక మాస ప్రాధాన్యత
దీపావళి మరునాటి నుండి అనగాకార్తీకమాస శుధ్ధపాడ్యమి నుండి కార్తీకమాసం ప్రారంభమౌతుంది.శివ,విష్ణు భక్తులిద్దరికీ ఈమాసం పవిత్రమైనదే.విష్నుసహస్ర నామార్చన ,శివలింగార్చనలు ప్రధానంగా చేస్తారు.హరిహరాదులకు భేదం లేదని చెప్పటమే దాని ఉద్దేశ్యము.మహావిష్ణువుకి తులసిదళములతో ,శివునకుబిల్వపత్రాలతో సహస్రార్చన చేసిన జన్మరాహిత్యము కలుగునని నమ్మకము.
సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం కాబట్టి గంగామాత నీరు ఉన్న ప్రతిచోట కొలువై ఉంటుంది.ప్రతినీటిబొట్టు పవిత్రమైనదే.సూర్యోదయానికి ముందే స్నానమాచరిస్తూ ఈశ్లోకాన్ని చదవాలి .
"గంగే చయమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదాసింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు."-
అని పఠిస్తే స్నానఫలం దక్కుతుంది.నదీ స్నానం శ్రేష్ఠం.కార్తీక సొమవారము ,పౌర్ణమి రోజులలో నదీస్నానము చేసిన అత్యంత ఫలితమునిచ్చును.
కార్తీక సోమవారములు శివునికి ప్రీతికరమైన రోజులు .సూర్యొదయానికి ముందే స్నానము చేసి భగవంతుని పూజించి ఉదయమంతా ఉపవాసముండి సాయంత్రం శివాలయం లోగాని, విష్ణువాలయములో గాని తులసి చెట్టుముందు ఆవు నేతితో దీపం వెలిగించి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేసిన మోక్ష ప్రాప్తి కలుగును.
ఈ మాసములో చేసినచేసే ఏ దానమైనా ఫలితాన్నిస్తుంది. దీపాదానము, కన్యాదానము మరింత ఫలాన్ని అందిస్తుంది. బియ్యపుపిండి గోధుమపిండితో ప్రమిదను చేసి వత్తిని పెట్టి ఆవు నేతితో వెలిగించి ఆదీపమును యోగ్యునకు దానమిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదవాలి.
"సర్వఙ్నాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం
దీపదానం ప్రదా స్యామి శాంతిరస్తు సదామమ."""
కార్తీకమాసమంతా పూజ చేయలేని వారు మొదటి రోజయిన శుధ్ధ పాడ్యమి మధ్య రోజయిన పౌర్ణమి,చివరి రోజు చతుర్ధశినాడు సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానము చేసి శికేశవులను అర్చించిన మాసమంతా భగవంతుని ఆరాధించిన ఫలము దక్కును. కార్తీకపురాణ పఠనము,శ్రవణముకూడా సర్వ పాపహరణమే. కార్తీక శుధ్ధ ద్వాదశీ దినమున దీపదర్శనము వలన సంపూర్ణాయువు,బుధ్ధిబలము ధ్ధైర్యము కలిగి మోక్షము లభిస్తుంది.
వనభోజనాల ప్రత్యేకత చెప్పనక్కరలేదు.చిన్నా పెధ్ధా ధనికబీదా తారతమ్యము లేకుండా సామూహికంగావనంలో ఉసిరిచెట్టు కిందసాలగ్రామ రూపంలోఉన్న శ్రీమహావిష్ణువును తులసిదళాలతో పూజించి భగవన్నామ స్మరణ చేసి బంధుమిత్ర సహితంగా భోజనం చేసిన పుణ్యలోకప్రాప్తి లభించును.ఐహికాముషికికానందాన్ని కలుగజేయును.భయముతోనో మొక్కుబడిగానో చేసే పూజ వ్యర్ధము. నిశ్చల భక్తితో సంపూర్ణ విశ్వాసముతో చేసిన చక్కని ఫలమును పొందవచ్చును
సర్వే జనా సుఖినో బవంతు.

No comments:

Post a Comment