Tuesday, July 28, 2015

నివాళి


       ఒక గొప్ప శస్త్రవేత్త,రచయిత,వక్త ,దార్సనికుడు,వైణికుడు నేల రాలిపోయాడు. లేదు ఒక తార గగనమెక్కె.అనారోగ్యం లేదు తాను ఇబ్బంది పడలేదు,ఇతరులను ఇబ్బంది పెట్ట లేదు అనాయాస మరణాన్ని పొందాడు.అదీ తనకిష్టమైన బొధన కావిస్తూ వందలాది విద్యర్ధుల సమక్షం లో.ఎంత పుణ్యం.
      ప్రశాంత ద్వీపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఓ బాటసారీ నీ కివే మా అశ్రు నివాళులు.

Monday, July 27, 2015

సామ కిచిడి


     సామలు-------------------1/2కె.జి
     నీరు-------------------------1లీటరు
     పెసర పప్పు-------------1/4కె.జి
     ఆకుకూరలు---------------తోటకూర,పాలకూర(రెండు చిన్న కట్టలు)
     ఉల్లి పెధ్ధది------------1
    పచ్చి మిర్చి-----------4
    నూనె-----------------------10గ్రాములు
    ఆవాలు,మినపపప్పు,శనగపప్పు,జీర------ఒక్కొక్కటి స్పూను
    కరివేపాకు------------2రెబ్బలు
   ఉప్పు------------------రుచికి సరిపోను
                      సామలు,పెసరపప్పు కడిగి పెట్టుకొని ,ఉల్లి,పచ్చిమిర్చి,ఆకు కూరలు
సన్నగా తరిగి పెట్టుకోవాలి.బాణిలి ష్టౌ మీద పెట్టి నూనె వేసి కాగినాక తాలింపు దినుసులు ,కరివేపాకు,పచ్చి మిర్చి, ఆకుకూరలు,పెసరపప్పు వేసి వేగినాక కొలిచి పెట్టుకున్న నీళ్ళు పోయాలి.తగినంత ఉప్పు వేసి నీళ్ళు మరుగుతుండగా సామలు వెయ్యాలి.బాగా ఉడికినాక కలిపి దించుకోవాలి.సుమారు 15,20 ని||లు పడుతుంది
           ఇది చాలా బలవర్ధమైన ఆహారం.
    

Saturday, July 25, 2015

కొర్ర దోసె


     కొర్ర బియ్యం---------------2 కప్పులు
     మినపపప్పు--------------1 కప్పు
    శనగపప్పు--------------2 టీ స్పూనులు
    మెంతులు----------------------1/2 స్పూను
    ఉప్పు--తగినంత
    నూనె----దోసె కాల్చటానికి తగినంత
             పైన చెప్పిన దినుసులు అన్నీ  విడివిడి గా 4,5గంటలు నానబెట్టాలి.నానిన తరువాత శుభ్రం గా కడిగి  ముందుగా కొర్రలు ,మెంతులు మెత్తగా రుబ్బుకోవాలి.మినపపప్పు,శనగపప్పు కలిపి మెత్తగా రుబ్బాలి.ఈ రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి రత్రంతా ఉంచితే పులుస్తుంది.ఉదయం రుచికి సరిపోను ఉప్పు కలిపి నీరు చేర్చి దోసెల పిండిలా జారుగా చేసుకొని పెనం మీద ఒక గరిటె పోసుకొని ఒక స్పూను నూనె వేసుకొని రెండు పక్కలా కాల్చు కోవాలి.
         మాంస కృత్తులు,ఇనుము,పీచు పదార్ధం ఉండటం వలన ఎదుగుదలకు,జీర్ణ క్రియకు దోహద పడటమేగాక శక్తిని, చురుకుదనాన్ని పెంపొందిస్తుంది.

Friday, July 24, 2015

శబ్దము


        శబ్దము అంటే మాట,చప్పుడు,ధ్వని,బిరుదు,నామము మున్నగు అర్ధాలున్నాయి.ఇప్పుడు మనం చప్పుడు(ధ్వని) గురించి తెలుసుకుందాము.
         మానవ జీవితం లో శబ్దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది.జననం నుంచి మరణం దాకా చప్పుడు లేనిదే ఏ పనీ జరగదు.పుట్టిన శిశువు ఏడవడం తోనే జీవన పోసుకుంటాడు.ఒకవేళ ఏడవకపోతే వీపు మీద చరచి మరీ ఏడిపిస్తాము.అతడి అచ్చట్లు ముచ్చట్లు అన్నీ శబ్దం తోనే ముడిపడి ఉన్నాయి.దేవుడికి కూడా బాజాలు కావాల్సిందే.అప్పుడే కరుణిస్తాడు.నిశ్శబ్దాన్ని  ఎక్కువ సేపు భరించ లేము.చేదించాలనుకుంటాము.
       మానవుడు శబ్దాల ద్వారా బంధాలను ఏర్పరుచుకుంటాడు.మనం పలికే ధ్వని లోనే మన భావం వ్యక్తమౌతుంది.పదాన్ని మనం పలికే తీరులో ప్రేమ, లాలన,అధికారం,అహంకారం,ద్వేషం అన్ని భావాలు వ్యక్తమౌతాయి.జంతువులు,పక్షులు కూడా ధ్వనులు చేస్తాయి.ఒక్కో జంతువుది,ఒక్కో పక్షిది ఒకో రకమైన ధ్వని.అవి కూడా ఆకలిని వివిధ ఉద్వేగాలను వేరు వేరు ధ్వనుల ద్వారా వ్యక్తీకరిస్తాయి.అందరికీ ఆ ధ్వనుల భావం తెలియక పోయినా వాటిని సాకే వారికి అర్ధమౌతాయి.
       వాహనాలు చేసే ధ్వనులు కూడా విభిన్నం గా ఉండి అవి చేసే చప్పుడిని బట్టి అవి ఏ వాహనమో తెలియజేస్తాయి.ప్రతి చప్పుడికి ఒక భాష ఉంటుంది.
        కురుక్షేత్రం లో కౌరవ,పాండవ యుధ్ధానికి నాంది శబ్దం.వారు తాము యుధ్ధానికి సన్నధం గా ఉన్నామని చెప్పటానికి శబ్దాన్ని ఉపయోగించారు. వ్యాసుడు ఒకో శబ్దానికి ఒక్కో ప్రత్యేకతను చెప్పడు.భీష్ముని శంఖారావం  ఆ చుట్టుపక్కల భయంకరం గా వినిపిస్తుంది. ఇది ముందు జరిగితే అయోమయ స్థితిని తెలుపుతుంది.కృష్ణుడు పాంచజన్యాన్ని పూరిస్తాడు.ఆ ధ్వని దుర్యోధనుని పతనాన్ని ధ్వనింప జేస్తుంది.అర్జునుడు  దేవదత్తం,ధర్మరాజు అనంత విజయం,భీముడి పౌండ్రం,నకులుడు సుఘోష,సహదేవుని మణి పుష్పకం ఇలా పాండవులు విడి విడి గా తమ శంఖాలను పూరిస్తారు.ఒక్కొక్క ధ్వని ఒక్కో విధంగా దుర్యోధనుని గుండెను భీతావహం చేస్తుంది.కౌరవ పక్ష ధ్వనులు తాటాకు చప్పుళ్ళుగాను పాండవ పక్ష ధ్వనులు స్పష్టమైన అవగాహనతో ఉంటాయి.కేవలం చప్పుళ్ళ తేడాతో జీవిత సారాన్ని ఇమిడ్చి శబ్దానికి గల అద్వితీయ శక్తిని విపులీకరించాడు వ్యాసుడు.
          కర్ణపేయమైన ధ్వని ఏదైనా మనసుకి  ఆహ్లాదాన్ని కలిగిస్తూ శుభసూచకం గా ఉంటుంది.కర్ణ కఠోరమైన చప్పుడు భీతావహ వాతావరణాన్ని కలిగిస్తుంది.ఇదీ శబ్ద ఘోష.

Wednesday, July 15, 2015

ఘొరం


        వేదం లా ఘోషించే గోదావరి
        నేడు రోదనల హాహాకారాల రాదారి
        పుణ్యాన్ని గుత్తగా పొందాలని
        కొండంత ఆశతో, ఆనందోత్సాహాలతో
        అరుదెంచి
        అడుగులు తడబడి తొక్కిటబడి
        వేయి కాళ్ళు ఒక్కటై వేసిన
        అడుగులు మిగిల్చింది
        అవ్వను పోగిట్టుకున్న మనవడిని
        సతులను కోల్పోయిన పతులను
        రుణాను బంధాలు తెగి
        నిశ్చేష్టులై నిలచిన అభాగ్యులను
        పుణ్యలోకాలకు తరలిపోయారు వారు
        పుష్కర స్నానం పుణ్యమా?పాపమా?
        పోయినోళ్ళందరూ పుణ్యాత్ములే
        వాళ్ళను కోల్పోయిన అభాగ్యులు వీళ్ళు
        మాధ్యమాల నిండా ఇవే దృశ్యాలు
        హృదయాలను కలచివేసేటట్లు
        కొన్ని వేదంతో,కొన్ని సానుభూతితో
        దూఃఖంతో కొన్ని,రాజకీయంతో మరికొన్ని
        సమస్యను పరిష్కరించేవి ఎన్ని?
        ఎవరిదీ పాపం?
        తిలా పాపం తలా పిడికిడన్నట్లు
       ముందు చూపు లేని ప్రభుత్వానిదా?
       సమన్వయం లేని అధికారులదా?
       అవగాహన లేని ప్రజలదా?
       పాపం ఎవరిదైనా!
       ఆత్మీయులను గోదారికి అర్పించి
       హృదయం
       తూట్లు తూట్లుగా తునిగి పోతుంటే
       మరలిపోయేవారు తమ వేదనల చిచ్చు
       మరచిపోగలరా జీవనపర్యంతం
       పుణ్యానికి పోతే పాపమెదురైనట్లు
       ఎంత ఘోరం!
       అకాల మృత్యుబారిన పడిన వారి ఆత్మకు
      శాంతి కలగాలని ప్రార్ధించడం తప్ప
      మనమేమి చేయగలం?

Tuesday, July 14, 2015

మాతృభాషాబోధన


             ఒక తండ్రి తన కొడుకుని పరభాషా మాధ్యమం లో చదివించి నప్పుడు పడిన ఆవేదనను,మాతృభాష లో చదివించి నప్పుడు పొందిన ఆనందాన్ని ఇలా చెప్పాడు "పిల్లలు బడికి వెళ్ళినప్పుడు కొత్తప్రదేశానికి వెళ్ళి నట్లుగా ఉంటుంది.వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ,వాళ్ళ తోటలను,వాళ్ళ రోజు వారి జీవన విధానాన్ని వదిలి వెళ్తారు.తరగతి గదిలో కూర్చుని వాళ్ళ రోజూవారి జీవనానికి సంబంధం లేని కొత్త విషయాలను నేర్చుకుంటారు.కొత్త విషయాలను మాత్రమే నేర్చుకున్నందున సొంత విషయాలను తిరస్కరిస్తారు.గణుసు గడ్డలను తవ్వడానికి ఇష్టపడరు.మురికి పని అంటారు.నీళ్ళు తోడటం లో అమ్మకు సహాయం చేయరు.ఈ పనులను వారు చులకనగా చూస్తారు.పిల్లలలో చాలా మార్పు వచ్చింది.వాళ్ళు తల్లిదండ్రులకు విధేయం గా ఉండరు.రాస్కెల్స్ గా తయారవుతారు.వాళ్ళు బడికి వెళ్ళి మా పధ్ధతులను వదిలేసినందుకు ఈ విధంగా  జరుగుతుంది.ఇప్పుడు నా పిల్లవాడు టొక్ ప్లిస్ బడిలో ఉన్నాడు.తన ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు.ఇప్పుడు బడిలోనూ మా జీవన విధానాన్ని,మా పధ్ధతులను నేర్చుకుంటున్నాడు.ఇప్పుడు టొక్ ప్లిస్లో ఏది కావాలి నా రాయగలడు.తను చూసేవి మాత్రమే కాదు.తను ఆలోచించేవి కూడా! తన ప్రాంతాన్ని గురించి రాస్తాడు.తోటకి వెళ్ళడం గురించి,వాళ్ళ అమ్మ కు నీళ్ళు తోడటం లో సహాయ పడటం గురించి ,గణుసు గడ్డలు తవ్వడం గురించి రాస్తాడు.వీటి గురించి రాసినప్పుడు ఇవి అతనికి ముఖ్యమైనవిగా తోస్తాయి.బయటి విషయాలను గురించి చదవడం ,రాయడం మాత్రమే కాకుండా చదవడం,రాయడం ద్వారా మా జీవన విధానాన్ని గురించి గర్వపడడం నేర్చుకుంటున్నాడు.అతను పెద్దయ్యాక మమ్మల్ని తిరస్కరించడు.మన పిల్లలకు చదవను,రాయను బోధించడం ముఖ్యమే,కాని మన గురించి,వాళ్ళ గురించి గర్వపడటాన్ని బోధించడం ఇంకా ముఖ్యం."
             పాఠశాలలో మాతృభాషా బోధన ఉన్నప్పుడే రెండవ భాషను తేలికగా నేర్చుకో గలుగుతారు.ఉన్నత చదువులు చదివి ఎంతో కొంత ఙానం కలిగిన పట్టణ ప్రజలకే సరైన అవగాహన లేనప్పుడు  ఇంక పల్లె ప్రజలు మోజు పడటం లో తప్పేమున్నది.మాతృ. భాషా మాధ్యమం ద్వారా బోధించ కుండా పిల్లల్లోని సృజనాత్మకతను,తెలివితేటల్ని వికసించ కుండా చేస్తున్నాము.మన సంస్కృతి, సంప్రదాయాలకు కూడా దూరమై పోతున్నారు.సంతోషం లోనైనా,విచారం లోనైనా మనం " అమ్మా"అనే అంటాము.మాతృ భాష బాగా వచ్చిన వాళ్ళకు ఇతర భాషలు సులువు గా వస్తాయని అధ్యయనాలే చెబుతున్నాయి.కాబట్టి మన భాషను,నేర్చుకొని  నేను "తెలుగు వాడినని" అని గర్వంగా చాటుదాం.
           

Saturday, July 4, 2015

సహకారం


            రామయ్య అనే రైతు మొక్కజొన్న పంట పండించే వాడు.ప్రతి సంవత్సరం వ్యవసాయ ప్రదర్శనలో పాల్గొంటూ ప్రశంసలను, అనేక బహుమతులు పొందేవాడు.అతనితో పాటు చుట్టు పక్కల రైతులు కూడా అలాంటి  మొక్కజొన్ననే ప్రదర్శనకు తీసుకు రావడం గమనించిన ఒక విలేఖరి రామయ్యను "మీ పొరుగులతో రైతులతో ఈ విత్తనాన్ని ఎల పంచుకో గలిగారు"అని అడిగాడు.
       "గాలి పుప్పొడిని  పక్వమౌతున్న మొక్కజొన్న నుండి గ్రహించి అన్ని పొలాల మీదా జల్లుతుంది.చుట్టు పక్కల నాసిరకం  మొక్కజొన్న నాటితే నా పంట కూడా నాసిరకంగా తయారు అవుతుంది.నా పంట నాణ్యతగా ఉండాలంటే పక్క వారి పంట కూడా మంచి గా ఉండాలి.అందుకే సహాయం చేస్తున్నా."అని చెప్పాడు.
        రామయ్య పంట ద్వారా అద్భుతమైన  మానవ సంబంధాలను ఆవిష్కరించాడు.ఇరుగుపొరుగు సహకారం గా ప్రశాంతం గా ఉంటేనే మనము ప్రశాంతం గా ఉండగలం.విజయం సాధించ డానికి పట్టుదల,కృషి వ్యక్తిగతమైనప్పటికి  ఇతరుల సహకారం లేనిదే పొందలేము.
        సేంద్రీయ ఆహార పదార్ధాలకు నేడు ఆదరణ పెరుగుతోంది.రసాయన ఎరువులు వాడిన భూములు సాధారణ స్థితికి రావాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది.మనము ఒక్కరమే వేస్తే ఫలితముండదు.చుట్టూ రసాయన ఎరువుల పంటలు ఉండటం వలన గాలి కి  ఆ రసాయనాలు మన పంటకూ అంటు కుంటాయి.పక్క పొలం నుంచి వచ్చే నీరు కూడా పంటను కలుషితం చేస్తుంది.కాబట్టి  అందరి సహకారం తోనే సేంద్రీయ పంటలు పండించడం సాధ్యమౌతుంది.పైన రామయ్య కధలో చెప్పింది కూడా అదే."కలసి ఉంటే కలదు సుఖం,""సర్వే జన సుఖినో భవంతు" అనే భావనలు మన నరనరాల్లో జీర్ణించుకు పోయాయి.