శబ్దము అంటే మాట,చప్పుడు,ధ్వని,బిరుదు,నామము మున్నగు అర్ధాలున్నాయి.ఇప్పుడు మనం చప్పుడు(ధ్వని) గురించి తెలుసుకుందాము.
మానవ జీవితం లో శబ్దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది.జననం నుంచి మరణం దాకా చప్పుడు లేనిదే ఏ పనీ జరగదు.పుట్టిన శిశువు ఏడవడం తోనే జీవన పోసుకుంటాడు.ఒకవేళ ఏడవకపోతే వీపు మీద చరచి మరీ ఏడిపిస్తాము.అతడి అచ్చట్లు ముచ్చట్లు అన్నీ శబ్దం తోనే ముడిపడి ఉన్నాయి.దేవుడికి కూడా బాజాలు కావాల్సిందే.అప్పుడే కరుణిస్తాడు.నిశ్శబ్దాన్ని ఎక్కువ సేపు భరించ లేము.చేదించాలనుకుంటాము.
మానవుడు శబ్దాల ద్వారా బంధాలను ఏర్పరుచుకుంటాడు.మనం పలికే ధ్వని లోనే మన భావం వ్యక్తమౌతుంది.పదాన్ని మనం పలికే తీరులో ప్రేమ, లాలన,అధికారం,అహంకారం,ద్వేషం అన్ని భావాలు వ్యక్తమౌతాయి.జంతువులు,పక్షులు కూడా ధ్వనులు చేస్తాయి.ఒక్కో జంతువుది,ఒక్కో పక్షిది ఒకో రకమైన ధ్వని.అవి కూడా ఆకలిని వివిధ ఉద్వేగాలను వేరు వేరు ధ్వనుల ద్వారా వ్యక్తీకరిస్తాయి.అందరికీ ఆ ధ్వనుల భావం తెలియక పోయినా వాటిని సాకే వారికి అర్ధమౌతాయి.
వాహనాలు చేసే ధ్వనులు కూడా విభిన్నం గా ఉండి అవి చేసే చప్పుడిని బట్టి అవి ఏ వాహనమో తెలియజేస్తాయి.ప్రతి చప్పుడికి ఒక భాష ఉంటుంది.
కురుక్షేత్రం లో కౌరవ,పాండవ యుధ్ధానికి నాంది శబ్దం.వారు తాము యుధ్ధానికి సన్నధం గా ఉన్నామని చెప్పటానికి శబ్దాన్ని ఉపయోగించారు. వ్యాసుడు ఒకో శబ్దానికి ఒక్కో ప్రత్యేకతను చెప్పడు.భీష్ముని శంఖారావం ఆ చుట్టుపక్కల భయంకరం గా వినిపిస్తుంది. ఇది ముందు జరిగితే అయోమయ స్థితిని తెలుపుతుంది.కృష్ణుడు పాంచజన్యాన్ని పూరిస్తాడు.ఆ ధ్వని దుర్యోధనుని పతనాన్ని ధ్వనింప జేస్తుంది.అర్జునుడు దేవదత్తం,ధర్మరాజు అనంత విజయం,భీముడి పౌండ్రం,నకులుడు సుఘోష,సహదేవుని మణి పుష్పకం ఇలా పాండవులు విడి విడి గా తమ శంఖాలను పూరిస్తారు.ఒక్కొక్క ధ్వని ఒక్కో విధంగా దుర్యోధనుని గుండెను భీతావహం చేస్తుంది.కౌరవ పక్ష ధ్వనులు తాటాకు చప్పుళ్ళుగాను పాండవ పక్ష ధ్వనులు స్పష్టమైన అవగాహనతో ఉంటాయి.కేవలం చప్పుళ్ళ తేడాతో జీవిత సారాన్ని ఇమిడ్చి శబ్దానికి గల అద్వితీయ శక్తిని విపులీకరించాడు వ్యాసుడు.
కర్ణపేయమైన ధ్వని ఏదైనా మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ శుభసూచకం గా ఉంటుంది.కర్ణ కఠోరమైన చప్పుడు భీతావహ వాతావరణాన్ని కలిగిస్తుంది.ఇదీ శబ్ద ఘోష.
No comments:
Post a Comment