ఉండవల్లికి అమరావతికి మధ్యలో ఉంటుంది.మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3గంటలు అయినది.కొండ మీద గుడి తీసిలేదు.కింద ఉన్న గుడి కూడా మూసి ఉన్నవి కాని గ్రామస్తులు మమ్మల్ని చూసి పూజారి గారిని పిలుచుకు వచ్చారు.ఆయన గుడి ప్రాశస్త్యాన్ని చక్కగా చెప్పారు.పూర్తిగా గుర్తు లేదు. కాని ప్రాచీనమైన ఆలయమని 2000 సంవత్సరాల క్రితమే కట్టబడినదని చెప్పారు.కొండపైన విగ్రహం చిన్నగా ఉంటుందని అన్నారు.గ్రామం చక్కటి సిమెంట్ రోడ్లతో ప్రశాంతంగా ఉన్నది.ఇది కూడా రాజధాని పరిధి లోకి వస్తుంది.
Sunday, September 27, 2015
Saturday, September 26, 2015
వింత అలవాట్లు
మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో వారి చేష్టలు అన్ని రకాలుగా ఉంటాయి.ఊతపదాలతో కొందరు వివిధ చేష్టలతో మరికొందరు వింతగా కనిపిస్తారు.
కొంతమంది చేతులూపుతూ మాట్లాడతారు.మర్కొందరు తలలూపుతూ,కళ్ళెగరిస్తూ,కళ్ళుమూసుకొని,గోళ్ళుకొరుకుతూ,గడ్డం రాసుకుంటూ మాట్లాడతారు.ఎదుటివారి వంక చూడకుండా తలదించుకొని తప్పుచేసినవారిలాగా మాట్లాడే వారు మరి కొందరు.మిగతావాటితో సర్దుకుపోవచ్చు గాని చేతులూపేవారితో ఇబ్బందే!ఆ ఊపులో చేయొచ్చి ఎక్కడ తగులుతుందో తెలియదు.పక్కనగాని,ఎదుటగాని ఏవైనా వస్తువులుంటే అవి స్థానభ్రంశం చెందడమో,రూపం కోల్పోవడమో జరుగుతుంది.మరీ బిగదీసుకుపోయి పాఠం అప్పజెప్పినట్లు మాట్లాడినా బాగోదు.ఇంకా కొంతమంది అవసరమున్నా లేకపోయినా మీద చేయివేసి,వీపునిమురుతూనో,మనమీద పడిపోయో మాట్లాడతారు.వారికి మనమీద ప్రేమ పొంగి పోతున్నట్లు అనుకోవాలన్న మాట.ఏదైనా తగు మోతాదులో ఉంటేనే అందం ఆనందం.
నవ్వు కూడా అంతే.జోక్ వేసినా నవ్వని వారు కొందరైతే,నవ్వు వచ్చే విషయం అక్కడ లేకపోయినా పక్కవారు ఉలిక్కిపడేట్టు పెద్దగా నవ్వేవారు మరి కొందరు.కొందరు చిరునవ్వుతో ఆహ్లాదకరం గా మాట్లాదతారు.డబ్బాలో గులకరాళ్ళు పోసి మోగించినట్లు భీకరం గా నవ్వే వారు మరికొందరు.అందరూ నవ్వుతుంటే మూతిబిగించుకుంటారు కొందరు.అందరూ నవ్వటం ఆపేసినాక నవ్వడం మొదలుపెడతారు మరికొందరు.అప్పటికిగాని ట్యూబ్ లైట్ వెలగదు మరి.
ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా కొందరు అవతలివారికి కనిపించదని తెలిసీ హావ భావాల్తో మాట్లాడుతుంటారు.సంతోషమో,కోపమో,విసుగో మన స్వరం తో ఎదుటివారికి తెలిసిపోతుంది.అవతల అధికారి మాట్లాడుతున్నారనుకోండి ఇవతల కూర్చున్న వారు అసంకల్పిత ప్రతీకార చర్యలా లేచి నుంచుంటారు.ఏదైనా సైజు చెప్పాలంటే చేతులు బార్లా సాచి మరీ చెబుతుంటారు.
ఊతపదాల విషయానికి వస్తే ఇవి మనుషులకు మంచిగానో,వ్యంగ్యం గానో గుర్తింపును తెస్తాయి.అలాగా,అవునా,మరే,పోతే,నిజం చెప్పొద్దూ,ఐసీ,ఓకే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో.ఒక పదాన్ని అదే పనిగా వాడితే వారికి ఆ పేరు స్థిరపడిపోతుంది.ఒకాయన ఎప్పుడూ సింగినాదం జీలకర్ర అంటూ ఉంటాడు.ఆయనకు సింగినాదం పేరు స్థిరపడిపోయింది.మరొకాయన అన్నిటికీ ఏడ్చిందిలే,ఏడ్చాడులే అంటూ ఏడ్పుగొట్టాయనగా మిగిలిపోయాడు.ఊతపదాలు వాడటం లో ఉపాధ్యాయులది ప్రత్యేక స్థానం.తరగతి గదులలో వారు తెలిసిందా?వింటున్నారా?అండర్స్టాండ్,అసలూ ఇలా వాడుతూనే ఉంటారు.పిల్లలు వారికి పెట్టే పేర్లకు హద్దే లేదు.మన ముఖ్య మంత్రి గారు కూడా మనవిజేసుకుంటున్నాను,తెలియజేసుకుంటున్నాను అనే పదాలు తరచూ వాడుతుంటారు.
అతి ఏదైనా వింతగాను ఒకోసారి ఎబ్బెట్టుగాను అనిపిస్తుంది.మోతాదు మించకుండా ఉంటే మనకీ పక్కవారికి ఎదుటివారికి ఎంతో హాయి.
Friday, September 25, 2015
హాస్యం
హాసము అంటే నవ్వు.హాసాన్ని కలిగించేది కనుక హాస్యం.స్మితం,హసితం,విహసితం,ఉపహసితం,అపహసితం,అతి హసితం అని ఆరు రకాలు.ఇందులో మొదటి రెండు మాత్రమే ఉత్తమమైనవని,తక్కినవి ఉత్తరోత్తర పరిహరణీయమని ధనుంజయుని అలంకార గ్రంధం లో చెప్పబడింది.
హాస్యం ఇతరుల మనసులను నొప్పించేది,అవహేళన చేసేది,నీచ హేయ సంబంధమైనది ఉత్తమ హాస్యం అనిపించుకోదు.కాలుజారి పడితే నవ్వడమో,ఇతరుల వేష భాషలను అవహేళన చేయడమో హాస్యం కాదు.మనం ఎవరినైతే ఆటపట్టిస్తామో వారు కూడా మనసు విప్పి నవ్వ గలిగేదే నిజమైన హాస్యం.సరసోక్తి,చలోక్తి,నర్మోక్తి,వక్రోక్తి వంటి యుక్తుల ఆధారం గా అర్ధవంతమైన హాస్యాన్ని పండించ వచ్చు.ప్రపంచం లో నవ్వ గలిగే జీవి మానవుడు ఒక్కడే.హాస్యాన్ని ఆస్వాదించలేని మనిషి జీవితం దుర్భరం.అందులో మనసుకి వికాసం కలిగించే జీవ శక్తి ఉన్నది.మానసిక ఒత్తిడి తగ్గి మనుగడ సుఖప్రద మవుతుందని శాస్త్ర్వేత్తల అభిప్రాయం.అందులో మర్మం తెలుసు కాబట్టే ఊరూరా'లాఫింగ్ క్లబ్బులు 'వెలుస్తున్నాయి.ఫ్రెంచ్ వారు,ఆంగ్లేయులూ,అమెరికన్లు కూడా వారి సాహిత్యం లో హాస్యానికి పెద్ద పీట వేసారు.జెరూం,క్రేఫోర్డ్,డికెన్స్,మార్కుత్వైన్,లీకాక్ వంటి హాస్య రచయతులు కనిపిస్తారు.
తెలుగు లో 20వ శతాబ్దం ప్రారంభం నుంచి మాత్రమే ఆరోగ్యప్రదమైన హాస్యం కనిపిస్తుంది.ఆరంభం లో కందుకూరి ప్రహసనాలు,చిలకమర్తి గణపతి,పానుగంటి కంఠాభరణం,గురజాడ కన్యాశుల్కం కనిపిస్తాయి.తరువాత మొక్కపాటి బారిష్టరు పార్వతీశం,కాంతం కధలతో మునిమాణిక్యం,మొలియరె ప్రభావం తో భమిడిపాటి కామేశ్వర రావు,బుడుగు ద్వారా ముళ్ళపూడి వెంకట రమణ పాత్ర గత,భాషా గత శబ్దగత,భావాశ్రయమైన హాస్యాన్ని అందించి తెలుగు హాస్యానికి మూల స్తంభాలుగా నిలిచారు.భానుమతి అత్తగారి కధలూ ఈ కోవకే చెందుతాయి.తరువాత తన గీతల ద్వారా బాపు ని,జంధ్యాల గారి హాస్య సంభాషణలు మన నిత్య జీవితాలలో భాగాలైనాయి.ఇప్పటికీ ఎంతోమంది తమ హాస్య రచనల ద్వారా మనకు ఆరోగ్యాన్ని పంచుతూనే ఉన్నారు.
ఒకసారి మునిమాణిక్యం గారి మేనకోడలు చిట్టెమ్మ గారు ఆయనను చూడటానికి బందరు వచ్చింది.బందరు లో గడిదలు ఎక్కువగా ఉండటాన్ని గమనించిన ఆమె 'ఈ ఊరి నిండా గాడిదలేనే 'అని మేలమాడింది.ఆయన ఏమానా తక్కువ తిన్నారా 'అవును వాటిని చూడటానికి అప్పుడప్పుడూ పొరుగూరి గాడిదలు కూడా వస్తూ ఉంటాయీ----ఇదీ హాస్య మంటే.
ఆలాగే మునిమాణిక్యం గారి ప్రేమలేఖ చూడండి.
ప్రియమైన కాంతానికి,
శుభాశీస్సులతో వ్రాయు లేఖాన్శములు.ఉభయ కుశలోపరి.నువ్వు వ్రాయించిన జాబు అందినది.సంగతులు తెలిసినవి.ఎదురింటి మీనాక్షికి మళ్ళీ ఆడపిల్లే.ఈ విషయం నీకు సంతోషం కలిగించ గలదని తెలుపడమైనది.మీ జానకమ్మ పీన్నిగారింట్లొ అంతా కులాసాగానే ఉన్నారు.కనకమహాలక్ష్మి నీ కోసం ఎదురుచూస్తున్నది.వారి పెద్దమ్మాయికి సీమంతం చేస్తారట.నువ్వు చెప్పిన ప్రకారం పనిమనిషి దగ్గరున్న దబర గిన్నె తెప్పించాను.పాత కాగితాలవాడు అమ్మ గారు ఎప్పుడు వస్తారని వాకను చేస్తున్నాడు.నువ్వు మడిగా కాక విడిగా చిన్న జాడీలో తీసిన ఆవకాయ అయిపోయింది.నువ్వు వెళ్ళినప్పటి నుంచి అదే కదా ఆధరువు.మరి పెద్ద జాడీ లోంచీ తీసుకోమంటావా?ఏ సంగతీ జవాబు వ్రాయించ గలవు.---------ఇల సాగుతుంది.ఆ తరం ప్రేమ లేఖ.
గణపతి 'తులసీ దళాలతో చారు,చుక్కులు చుక్కులుగా జుత్తూ మరచిపోగలమా?
నిజం గా నిఝమే చెప్తానన్న బుడుగు ని,పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్న గిరీశాన్ని తెలుగు జాతి ఎప్పటికీ మరచిపోదు.హాస్య పాత్రల నన్నిటినీ ఒక్కసారి స్మరించాలని ఉంది కాని సమయాభావము వలన ఇంతటితో ముగిస్తున్నాను.
Thursday, September 24, 2015
పాస్తా
కారెట్----------------1/4కప్పు
బీన్స్--------------------1/4కప్పు
కాప్సికం-------------1/4కప్పు
టమోటా---------------1/4కప్పు
ఉల్లిపాయలు--------------1/4కప్పు
పస్త అ------------------2కప్పులు
పచ్చి మిర్చి----------4
నూనె-------------------2టీ స్పూన్లు
బ్రెడ్ పొడి------------2టీ స్పూన్లు
ఊప్పు రుచికి సరిపోను.
ముందుగా పాస్తాని నీళ్ళలో ఉడకబెట్టుకొని చిల్లుల గిన్నె లోకి వంచుకోవాలి.అవి అంటుకోకుండా ఒక స్పూను ణునెజ్ వెసి కలిపి ఉంచుకోవాలి.టమోటా ప్యూరీ చేసుకోవాలి.మిగిలిన కూరలన్నీ వాలికిలుగా సన్నగా తరుగుకోవాలి.స్టౌ మీద బాణిలి పెట్టి నూనె వేసి కాగినాక కూరముక్కలు,పచ్చి మిర్చి,ఉప్పు వేసి మగ్గ నివ్వాలి.తరువాత టమోటా ప్యూరీ వేసి చిక్కబడినాక పక్కన ఉంచుకున్న పాస్తా వేసి కలియబెట్టాలి.అవి ముక్కలవ కుండా జాగ్రత్తగా తిప్పాలి.దించినాక్ బ్రెడ్ పొడి పైన జల్లాలి.
Wednesday, September 23, 2015
నవ్వు-నవ్వించు
ఒక ఉపాధ్యాయుడికి శిష్యుడికి మధ్య జరిగే సంభాషణలు ఇలా ఉన్నాయి.
ఉ:-ఒక ఇంటికి 5 అంతస్తులు ఉన్నాయి.ఒక్కో అంతస్తుకి పది మెట్లు ఉన్నాయి.అయిదో అంతస్తుకి ఎక్కాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి?
శి:-మొత్తం అన్నీనండీ!
2.ఉ:-పేడ పురుగికి రోజుకెంత తిండి కావాలంటే ,దాని బరువుకి సరిపడా.
శి:-......మరి దానికి తన బరువెట్లా తెలుస్తుందండీ?
3.ఉ:-మొగలు సామ్రాజ్యానికి ఔరంగజేబు ఎంత వరకు కారకుడు?
శి:-కొంత వరకు కారకుడు.
Tuesday, September 22, 2015
మిని కవితలు
బాణం
తనువు గాయపరుస్తుంది
వాగ్బాణం
మనసు చిద్రం చేస్తుంది
వాదన
మూఢత్వానికి ప్రతీక
మౌనం
ఙానానికి మరో భాష
విద్య
విధ్వంస మయ్యాక
విద్యకు
ఏ స్థాన మయినా ఒకటే!
ఆ ఇంటికి
ఏదీ ఉండాల్సిన చోట ఉండదు
ఔను
అతడు వాస్తు విద్వాంసుడు మరి
మృగం
లేడి నెత్తురు తాగింది
అభాగ్య జీవికి
చెత్తకుండీ స్థావర మయ్యింది
పగలంతా
పుస్తకాలతో కుస్తీ
రాత్రంతా
అంతర్జాలం తో దోస్తీ
ఒకే కప్పు కింద నివాసం
ఒంటరి జీవితం తో సావాసం.
Monday, September 21, 2015
వెగ్క్వెస్డెల్ల
M
తరిగిన ఉల్లిపాయలు------------1/2కప్పు
తరిగిన పుట్ట గొడుగులు----1/4కప్పు
తరిగిన కాప్సికం-------------1/4కప్పు
ఉడకబెట్టిన స్వీట్కార్న్--1/4కప్పు
తురిమిన చీజ్-------------------1కప్పు
పచ్చి మిర్చి----------------2
కొత్తిమీర-----------------------కొంచెం
నూనె----------------------------1స్పూను.
చపతిస్-------------------------2
ఉప్పు,మిరియాలపొడి---------రుచికి సరిపోను
పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి కూరగాయ ముక్కలు పచ్చి మిర్చి ఉప్పు మిరియాలపొడి వేసి 5నిముషాలు మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి.
చపాతి రెండు వైపులా కాల్చినాక పెనం మీద ఉంచే 1/2కప్పు చీజ్ పరచి దానిపై కూరగాయల మిక్చర్ సగం పరిచి చపాతీని సగానికి మడిచి కాలినాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.అలాగే రెండో చపతీ కూడా చేసుకోవాలి.వెజ్ క్వెస్డెలా తినడానికి సిధ్ధం.
Friday, September 4, 2015
బీట్రూట్పచ్చడి
బీట్ రూట్-----------------మీడియం సైజ్ 1దుంప
పచ్చి మిర్చి---------4
చింత పండు---------1రెబ్బ
వెల్లుల్లి-----------------3రెబ్బలు
జీర------------------1స్పూను
పురుగు----------------1కప్పు
కరివేపాకు----------2రెబ్బలు
నూనె-----------------2స్పూన్లు
ఉప్పు-----------------రుచికి సరిపోను
బీట్ రూట్ తోక్క తీసి కోరు కోవాలి.పచ్చి మిర్చి ఒక స్పూను నూనె వేసి వేయించాలి.తరువాత పచ్చి మిర్చి,చింత పండు,బీట్ రూట్ కోరు వెల్లుల్లి,జీర సరిపోను ఉప్పు వేసి మిక్సీ పట్టాలి.స్టౌ మీద బాణిలి పెట్టి మిగిలిన నూనె వేసి తిరగమోత దినుసులు,కరివేపాకు వేసి మిక్సీ పట్టిన బీట్ రూట్ను వేసి రెండు సార్లు తిప్పి చివరలో పెరుగు కలపాలి.
Wednesday, September 2, 2015
చక్కెరపొంగలి
బియ్యం--------------1/2కెజి
పెసరపప్పు-------1/4కెజి
బెల్లం---------------600గ్రాములు
పంచదార------150గ్రాములు
జీడిపప్పు----------250గ్రాములు
కిస్మిస్---------------200గ్రాములు
ఎండు కొబ్బరి------200గ్రాములు
ఏలకులు-------------5గ్రాములు
నెయ్యి--------------400గ్రాములు
ముందు పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేలా వేయించుకోవాలి.తరువాత బియ్యము,పెసరపప్పు కలిపి అన్నము వండాలి. అది ఉడికేలోపు జీడిపప్పు,కిస్మిస్,ఎండుకొబ్బరి సన్నగా తరిగి ఆ ముక్కలు నేతిలో మంచి రంగు వచ్చేటట్లు వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి.ఏలకులు పొడిలా చేసుకోవాలి.ఉడికిన అన్నము ఒక మందపాటి గిన్నెలో వేసుకొని తరిగిన బెల్లము, పంచదార వేసి స్టౌ మీద పెట్టి కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి.చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు చివర్లో వేయించి పెట్టుకున్న దినుసులు ,ఏలుకులపొడి వేసి దించేయాలి.చిటికెడు పచ్చ కర్పూరం కూడా వేస్తే మంచి వాసన వస్తుంది.మంచి పాకం వస్తుంది కాబట్టి రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుంది.బియ్యము,పెసరపప్పు కలిపి ఎంత కొలతో అంత జీడిపప్పు,కిస్మిస్,కొబ్బరి ముక్కలు కలిపి అంత. నెయ్యి కూడా ఇంచుమించు సమానం గా పడుతుంది.ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి రాజీ పడకుండా చేసుకుంటే అమృత తుల్యమే.
దీన్ని కొంతమంది పాలు పోసి,మరికొంతమంది విడిగా పాకం పట్టి పోసి ఇంకా చాలా రకాలుగా చేస్తారు కానీ దీనంత రుచి రాదు.ఒక్కసారి ప్రయత్నించి చూడంది.తేడా మీకే తెలుస్తుంది.
Subscribe to:
Posts (Atom)