మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో వారి చేష్టలు అన్ని రకాలుగా ఉంటాయి.ఊతపదాలతో కొందరు వివిధ చేష్టలతో మరికొందరు వింతగా కనిపిస్తారు.
కొంతమంది చేతులూపుతూ మాట్లాడతారు.మర్కొందరు తలలూపుతూ,కళ్ళెగరిస్తూ,కళ్ళుమూసుకొని,గోళ్ళుకొరుకుతూ,గడ్డం రాసుకుంటూ మాట్లాడతారు.ఎదుటివారి వంక చూడకుండా తలదించుకొని తప్పుచేసినవారిలాగా మాట్లాడే వారు మరి కొందరు.మిగతావాటితో సర్దుకుపోవచ్చు గాని చేతులూపేవారితో ఇబ్బందే!ఆ ఊపులో చేయొచ్చి ఎక్కడ తగులుతుందో తెలియదు.పక్కనగాని,ఎదుటగాని ఏవైనా వస్తువులుంటే అవి స్థానభ్రంశం చెందడమో,రూపం కోల్పోవడమో జరుగుతుంది.మరీ బిగదీసుకుపోయి పాఠం అప్పజెప్పినట్లు మాట్లాడినా బాగోదు.ఇంకా కొంతమంది అవసరమున్నా లేకపోయినా మీద చేయివేసి,వీపునిమురుతూనో,మనమీద పడిపోయో మాట్లాడతారు.వారికి మనమీద ప్రేమ పొంగి పోతున్నట్లు అనుకోవాలన్న మాట.ఏదైనా తగు మోతాదులో ఉంటేనే అందం ఆనందం.
నవ్వు కూడా అంతే.జోక్ వేసినా నవ్వని వారు కొందరైతే,నవ్వు వచ్చే విషయం అక్కడ లేకపోయినా పక్కవారు ఉలిక్కిపడేట్టు పెద్దగా నవ్వేవారు మరి కొందరు.కొందరు చిరునవ్వుతో ఆహ్లాదకరం గా మాట్లాదతారు.డబ్బాలో గులకరాళ్ళు పోసి మోగించినట్లు భీకరం గా నవ్వే వారు మరికొందరు.అందరూ నవ్వుతుంటే మూతిబిగించుకుంటారు కొందరు.అందరూ నవ్వటం ఆపేసినాక నవ్వడం మొదలుపెడతారు మరికొందరు.అప్పటికిగాని ట్యూబ్ లైట్ వెలగదు మరి.
ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా కొందరు అవతలివారికి కనిపించదని తెలిసీ హావ భావాల్తో మాట్లాడుతుంటారు.సంతోషమో,కోపమో,విసుగో మన స్వరం తో ఎదుటివారికి తెలిసిపోతుంది.అవతల అధికారి మాట్లాడుతున్నారనుకోండి ఇవతల కూర్చున్న వారు అసంకల్పిత ప్రతీకార చర్యలా లేచి నుంచుంటారు.ఏదైనా సైజు చెప్పాలంటే చేతులు బార్లా సాచి మరీ చెబుతుంటారు.
ఊతపదాల విషయానికి వస్తే ఇవి మనుషులకు మంచిగానో,వ్యంగ్యం గానో గుర్తింపును తెస్తాయి.అలాగా,అవునా,మరే,పోతే,నిజం చెప్పొద్దూ,ఐసీ,ఓకే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో.ఒక పదాన్ని అదే పనిగా వాడితే వారికి ఆ పేరు స్థిరపడిపోతుంది.ఒకాయన ఎప్పుడూ సింగినాదం జీలకర్ర అంటూ ఉంటాడు.ఆయనకు సింగినాదం పేరు స్థిరపడిపోయింది.మరొకాయన అన్నిటికీ ఏడ్చిందిలే,ఏడ్చాడులే అంటూ ఏడ్పుగొట్టాయనగా మిగిలిపోయాడు.ఊతపదాలు వాడటం లో ఉపాధ్యాయులది ప్రత్యేక స్థానం.తరగతి గదులలో వారు తెలిసిందా?వింటున్నారా?అండర్స్టాండ్,అసలూ ఇలా వాడుతూనే ఉంటారు.పిల్లలు వారికి పెట్టే పేర్లకు హద్దే లేదు.మన ముఖ్య మంత్రి గారు కూడా మనవిజేసుకుంటున్నాను,తెలియజేసుకుంటున్నాను అనే పదాలు తరచూ వాడుతుంటారు.
అతి ఏదైనా వింతగాను ఒకోసారి ఎబ్బెట్టుగాను అనిపిస్తుంది.మోతాదు మించకుండా ఉంటే మనకీ పక్కవారికి ఎదుటివారికి ఎంతో హాయి.
No comments:
Post a Comment