హాసము అంటే నవ్వు.హాసాన్ని కలిగించేది కనుక హాస్యం.స్మితం,హసితం,విహసితం,ఉపహసితం,అపహసితం,అతి హసితం అని ఆరు రకాలు.ఇందులో మొదటి రెండు మాత్రమే ఉత్తమమైనవని,తక్కినవి ఉత్తరోత్తర పరిహరణీయమని ధనుంజయుని అలంకార గ్రంధం లో చెప్పబడింది.
హాస్యం ఇతరుల మనసులను నొప్పించేది,అవహేళన చేసేది,నీచ హేయ సంబంధమైనది ఉత్తమ హాస్యం అనిపించుకోదు.కాలుజారి పడితే నవ్వడమో,ఇతరుల వేష భాషలను అవహేళన చేయడమో హాస్యం కాదు.మనం ఎవరినైతే ఆటపట్టిస్తామో వారు కూడా మనసు విప్పి నవ్వ గలిగేదే నిజమైన హాస్యం.సరసోక్తి,చలోక్తి,నర్మోక్తి,వక్రోక్తి వంటి యుక్తుల ఆధారం గా అర్ధవంతమైన హాస్యాన్ని పండించ వచ్చు.ప్రపంచం లో నవ్వ గలిగే జీవి మానవుడు ఒక్కడే.హాస్యాన్ని ఆస్వాదించలేని మనిషి జీవితం దుర్భరం.అందులో మనసుకి వికాసం కలిగించే జీవ శక్తి ఉన్నది.మానసిక ఒత్తిడి తగ్గి మనుగడ సుఖప్రద మవుతుందని శాస్త్ర్వేత్తల అభిప్రాయం.అందులో మర్మం తెలుసు కాబట్టే ఊరూరా'లాఫింగ్ క్లబ్బులు 'వెలుస్తున్నాయి.ఫ్రెంచ్ వారు,ఆంగ్లేయులూ,అమెరికన్లు కూడా వారి సాహిత్యం లో హాస్యానికి పెద్ద పీట వేసారు.జెరూం,క్రేఫోర్డ్,డికెన్స్,మార్కుత్వైన్,లీకాక్ వంటి హాస్య రచయతులు కనిపిస్తారు.
తెలుగు లో 20వ శతాబ్దం ప్రారంభం నుంచి మాత్రమే ఆరోగ్యప్రదమైన హాస్యం కనిపిస్తుంది.ఆరంభం లో కందుకూరి ప్రహసనాలు,చిలకమర్తి గణపతి,పానుగంటి కంఠాభరణం,గురజాడ కన్యాశుల్కం కనిపిస్తాయి.తరువాత మొక్కపాటి బారిష్టరు పార్వతీశం,కాంతం కధలతో మునిమాణిక్యం,మొలియరె ప్రభావం తో భమిడిపాటి కామేశ్వర రావు,బుడుగు ద్వారా ముళ్ళపూడి వెంకట రమణ పాత్ర గత,భాషా గత శబ్దగత,భావాశ్రయమైన హాస్యాన్ని అందించి తెలుగు హాస్యానికి మూల స్తంభాలుగా నిలిచారు.భానుమతి అత్తగారి కధలూ ఈ కోవకే చెందుతాయి.తరువాత తన గీతల ద్వారా బాపు ని,జంధ్యాల గారి హాస్య సంభాషణలు మన నిత్య జీవితాలలో భాగాలైనాయి.ఇప్పటికీ ఎంతోమంది తమ హాస్య రచనల ద్వారా మనకు ఆరోగ్యాన్ని పంచుతూనే ఉన్నారు.
ఒకసారి మునిమాణిక్యం గారి మేనకోడలు చిట్టెమ్మ గారు ఆయనను చూడటానికి బందరు వచ్చింది.బందరు లో గడిదలు ఎక్కువగా ఉండటాన్ని గమనించిన ఆమె 'ఈ ఊరి నిండా గాడిదలేనే 'అని మేలమాడింది.ఆయన ఏమానా తక్కువ తిన్నారా 'అవును వాటిని చూడటానికి అప్పుడప్పుడూ పొరుగూరి గాడిదలు కూడా వస్తూ ఉంటాయీ----ఇదీ హాస్య మంటే.
ఆలాగే మునిమాణిక్యం గారి ప్రేమలేఖ చూడండి.
ప్రియమైన కాంతానికి,
శుభాశీస్సులతో వ్రాయు లేఖాన్శములు.ఉభయ కుశలోపరి.నువ్వు వ్రాయించిన జాబు అందినది.సంగతులు తెలిసినవి.ఎదురింటి మీనాక్షికి మళ్ళీ ఆడపిల్లే.ఈ విషయం నీకు సంతోషం కలిగించ గలదని తెలుపడమైనది.మీ జానకమ్మ పీన్నిగారింట్లొ అంతా కులాసాగానే ఉన్నారు.కనకమహాలక్ష్మి నీ కోసం ఎదురుచూస్తున్నది.వారి పెద్దమ్మాయికి సీమంతం చేస్తారట.నువ్వు చెప్పిన ప్రకారం పనిమనిషి దగ్గరున్న దబర గిన్నె తెప్పించాను.పాత కాగితాలవాడు అమ్మ గారు ఎప్పుడు వస్తారని వాకను చేస్తున్నాడు.నువ్వు మడిగా కాక విడిగా చిన్న జాడీలో తీసిన ఆవకాయ అయిపోయింది.నువ్వు వెళ్ళినప్పటి నుంచి అదే కదా ఆధరువు.మరి పెద్ద జాడీ లోంచీ తీసుకోమంటావా?ఏ సంగతీ జవాబు వ్రాయించ గలవు.---------ఇల సాగుతుంది.ఆ తరం ప్రేమ లేఖ.
గణపతి 'తులసీ దళాలతో చారు,చుక్కులు చుక్కులుగా జుత్తూ మరచిపోగలమా?
నిజం గా నిఝమే చెప్తానన్న బుడుగు ని,పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్న గిరీశాన్ని తెలుగు జాతి ఎప్పటికీ మరచిపోదు.హాస్య పాత్రల నన్నిటినీ ఒక్కసారి స్మరించాలని ఉంది కాని సమయాభావము వలన ఇంతటితో ముగిస్తున్నాను.
No comments:
Post a Comment