Sunday, May 25, 2014

FOSWAL

  ఫాశ్వాల్
              ఈ రోజు ఫాశ్వాల్ ప్రథమ వార్షికోత్సవ సభ విజయవాడలోని వాసవ్య మహిళామండలి సిల్వర్ జుబ్లిహాల్ లో జరిగింది.ఫాశ్వాల్ అంటే ఫ్రెండ్స్ ఆన్ సేం వేవ్ లెంగ్త్. ఇది మొదట కాలిఫోర్నియాలో స్తాపించబడినది. ప్రపంచంలో అనేకదేశాలకు విస్తరించి తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. టాగూర్  " ఎక్కడ మనుషులు భయం లేకుండా ఉంటారో--" అన్న గేయం ప్రార్ధనా గీతం గా పాడతారు.ముఖ్య అతిధులుగా వచ్చినవారు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. ఈ రోజు ముఖ్య అతిధి డాక్టర్ .పి. వి. కృష్ణా రావు.
                   కృష్ణా రావు గారు "పర్యావరణ పరిరక్షణ" పై ప్రసంగించారు. కేవలం మొక్కని నాటటం కాదు గార్డెన్ పెంచమని సూచించారు.అది అనేక సమస్యలకు పరిష్కారమని చెప్పారు.  గార్డెనింగ్ మంచి వ్యాయామమే  కాదు టానిక్ లాగా పనిచేస్తుంది.మానసిక, శారీరక ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సాస్ వారి రీసెర్చ్ లో 3,310 మంది  గార్డెనింగ్ చేసిన వృద్ద మహిళలను  పరిశీలించగా వారు జాగింగ్,స్విమ్మింగ్,ఏరోబిక్స్ చేసిన మహిళల కంటే తక్కువ ఆస్టియోపొరాసిస్ తో ఉన్నారని తేలింది.కొలస్ట్రాల్  బి.పి  లు తగ్గుతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు చెప్పారు.
            ఒక మనిషి కి  సగటున మూడు సిలెండర్ ల ఆక్సిజెన్ అవసరమవుతుంది.గాలి ఉచితం కాబట్టి మనం ఎప్పుడూ దాని గురించి ఆలోచించము.కృష్ణారావు గారు దాని విలువను తెలియజేసారు
   50 సంవత్సరాలు బ్రతికే ఒక చెట్టు 
      రూ.5.3 లక్షల విలువజేసే ఆక్సిజెన్ విడుదల చేస్తుంది.
      రూ.6.4 లక్షల విలువచేసే భూసారాన్ని పరిరక్షిస్తుంది.
     రూ.6.4 లక్షల  విలువచేసే భూమికోతను నివారిస్తుంది.
     రూ.5.3 లక్షల విలువచేసే  ఇతర జీవజాలానికి ఆశ్రయమిస్తుంది..
     రూ.10.5 లక్షల విలువ చేసే వాయు కాలుష్యాన్ని నిరోధిస్తుంది.
   మొత్తం విలువ 33.9 లక్షలు !
      చెట్లు ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గించటమే గాక  శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు  మొక్కలను పెంచాడానికి ప్రాధాన్య మివ్వాలి.ప్రత్యేక సందర్భాలలో మొక్కల్ని బహుమతిగా ఇవ్వమని సూచించారు.విలువైన సూచనను ఆచరించటం లో అందరం బాగస్వాములం అవుదామా!
          

Wednesday, February 5, 2014

ashtaa dasa sakti peethaalu


          శ్లో: లంకాయాం శాంకరీ దేవీ,కామాక్షీ కాంచికాపురే
                ప్రద్యుమ్నే శృంఖలాదేవీ,చాముండి క్రౌంచ పట్టణే,
                అలంపురీ జొగులాంబా,శ్రీశైలే భ్రమరాంభికా,
                కొళాపురే మహాలక్ష్మీ,మహుర్యే ఏకవీరిక్షా,
               ఉజ్జయిన్యాం మహాకాళీ,పీఠికాయాపురుహూతికా,
               ఓఢ్యాణే గిరిజాదేవీ,మాణిక్యే దక్షవాటకే,
              హరిక్షేత్రే కామరూపా,ప్రయాగే మాధవేశ్వరీ
             జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా,
            వారణస్యాం విశాలాక్షీ ,కాశ్మీరేతు సరస్వతీ
            అష్టాదశ శక్తిపీఠాని యోగినామపి దుర్లభం.
            సాయం కాలే పఠేనిత్యం సర్వశతృ వినాశనం
           సర్వ వ్యాధి ప్రశమనం సర్వ సంపత్కరం శుభం.
        యోగాగ్ని లోదూకి తనువు చాలించిన సతీదేవి శరీరాన్ని విష్నువు ఖండ ఖండాలుగా చేసి భూమి మీద పడవేయగా అవి అష్ఠాదశ శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి.
     అవి ఉన్న ప్రదేశాలు:--
  1.శ్రీ శాంకరీదేవి---------- ట్రైం కోమలి-శ్రీ లంక----కాలిగజ్జెలు పడినచోట
 2.శ్రీ కామాక్షీ దేవి------------కంచి--తమిళనాడు--వీపుబాగం '''
3.శ్రీశృంఖలా దేవి------------ గంగాసాగర్-గుజరాత్--ఉదరం ''
4.శ్రీ చాముండేశ్వరీ దేవి------మైసూరు-కర్ణాటక--తలవెంట్రుకలూ''
5.శ్రీ జోగులాంబా దేవి------అలంపురం-ఆంధ్రప్రదేశ్---పై దంత పంక్తి ''
6.శ్రీ భ్రమరాంబికా దేవి--శ్రీశైలం-ఆంధ్రప్రదేశ్- --మెదడు బాగం ''
7.శ్రీ మహాలక్ష్మీ దేవి -----కొళాపూర్-మహారాష్ట్ర--మూడు కళ్ళు ''
8.శ్రీ ఏకవీరాదేవి -----------మాహూర్యం --మహారాష్ట్ర--కుడి హస్తం ''
9.శ్రీ మహాకాళీ దేవి-----ఉజ్జయిని--మధ్యప్రదేశ్---పై పెదవి ''
10.శ్రీ పురుహూతికా దేవి---పిఠాపురం--ఆంధ్రప్రదేశ్--ఎడమ హస్తం ''
11.శ్రీ గిరిజా దేవి----------- జౌజిపూర్--ఒరిస్సా---------నాభి ''
12.శ్రీ మాణిక్యాంబా దేవి---ద్రాక్షారామం--ఆంధ్రప్రదేశ్-ఎడమచెక్కిలి ''
13.శ్రి కామరూపీ దేవి-----గౌహతి,హరిక్షేత్రం--అస్సం--యోని భాగం ''
14.శ్రీ మాధవేశ్వరీ దేవి---ప్రయాగ--ఉత్తరప్రదేశ్--హస్తాంగుళి ''
15.శ్రీ వైష్ణవీ దేవి---జ్వాలాకేతం--హిమాచలప్రదేస్--శిరస్సు ''
16.శ్రి మాంగల్యగౌరీ దేవి--గయ--బీహార్-------వక్షోజాలు ''
17.శ్రీ విశాలాక్షీ దేవి--వారణాశి-ఉత్తరప్రదేశ్--మణికర్ణిక ''
18.శ్రీ సరస్వతీ దేవి-----జమ్మూ--జమ్మూ-కాశ్మీర్----దక్షిణ హస్తం పడినచోటు.
 *~*~*~*~*~********** మంగళం భూయాత్ *******~*~**~*~*~*~*~*~*~*~*~*~*~*
  

Sunday, February 2, 2014

అసహజం


    పురాణకాలంలో మహాభారతంలో గాంధారి కృత్రిమ పధ్ధతి ద్వారా101 మంది సంతానానికి జన్మనిచినది అని తెలుసు. ఆధునిక కాలంలో పరిశోధనలు గాజుసీసాల ద్వారా పునరుత్పత్తి సాధ్యమే  అనితెలియజేస్తున్నాయి.
       మొదటి టెష్ట్ట్యూబ్ బేబీ 35 సంవత్సరాల క్రితమే ఆవిర్భవించింది.తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు పునరుత్పత్తికి అనేక మార్గాలు సూచిస్తున్నాయి.
        హృషీకేష్ పై (ప్రెసిడెంట్ ఎలక్ట్ ఇండియన్ సొసైటీ ఫర్ అసిష్టెడ్ రిప్రొడక్షన్) "భార్యాభర్తలలో ఒకరు వైఫల్యం చెందినప్పుడు స్పెర్మ్ లేక అండ దానాన్ని పొందడం అనుసరణీయమే.కానీథర్డ్ పార్టీని సంతానోత్పత్తికి అంగీకరింప జేయడం సవాలుగా మారుతుంది "అంటారు.ఈ సంవత్సరం కత్సుహికోహయషీ(జపనీస్ శాస్త్రఙుడు)  తన పరిశోధనాఫలితాలను వెల్లడించాడు. ఎలుక చర్మం నుండి బీజ కణాలను సేకరించి వాటిని స్పెర్మ్ ,ఎగ్స్ గా అభివృధ్ధిపరచినట్లు  తెలిపాడు.వీటినుండి ఎలుకల పునరుత్పత్తిని చేసాడు.ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు ఇటువంటి పరిశోధనలే ఫిమేల్ సెల్స్ నుండి స్పెర్మ్ డెవలప్ చేసే దిసెగా సాగుతునాయి.ఒక పది సంవత్సరాలలో స్టెం సెల్స్ నుండి హ్యుమన్ స్పెరంస్ తయారు చేయవచ్చు అంటారు పై.
            పరిశోధనాఫలితం ఏమిటంటే మానవ సంబంధం లేకుండానే బేబీని ఉత్పత్తి చేయవచ్చు. జపనీస్ శాస్త్రవేత్తలు గ్లాస్ చాంబెర్స్లో రెండు వారాలలో మేక పిండాలను అభివృధ్ధిపరచినట్లుగా పై తెలిపారు. కృత్రిమ పిండోత్పత్తిని చూడ టానికి ఇంక ఎంతోకాలం ఆగక్కరలేదు.
              పునరుత్పత్తి టెక్నిక్స్ ద్వారా  2025 నాటికి ప్రతిసంవత్సరం 80000 మంది పుడతారని అంచనా వేయబడుతోంది. ముంబై లాంటి పట్టణాలలో సంప్రదాయేతర కుటుంబాలు అంటే సింగిల్ మదర్ ,ఓల్డర్ మదర్ లేక సింగిల్ ఫాదర్ ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయని చెబుతారు ముంబైలో సంతాన సాఫల్య కేంద్రాన్ని నడుపుతున్న అనిరుధ్ మాల్పని.
               ఈ అభివృధ్ధి న్యాయపరమైన, మానవసంబంధ,నైతికమైన సమస్యలకువిధ్యార్ధులు బయలాజికల్ సైన్స్ పాఠాలు నేర్చుకోవడానికి అవరోధాలు అవుతాయి.పక్షులు ,ఈగలే కాకఏ జంతువుల చర్మ కణాలైనా పునరుత్పత్తికారకాలవుతాయని చెప్పవలసి వస్తుందేమో.
                 సర్గోసీ నియమావళిని సవరించే చట్టం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. మార్పును తొందరగా అంగీకరిచలేము.మన ఆలోచనా విధానాన్ని మార్చు కోవల్సి ఉంటుంది.సంప్రదాయకుతుంబాల కంటే ,సంప్రదాయేతర కుటుంబాల వారు పిల్లలు కావాలనే కోరికతో పొందుతారు కాబట్టి మిక్కిలి ప్రేమతో పెంచుతారు.వారు ఉత్పాదక పౌరులుగా ఎదుగుతారు అంటారు"-మాల్పని.
       కొన్నివిషయాలను మార్చకుండా ఉంటేనే బాగుంటుంది. సహజపధ్ధతిలో పిల్లలను కనడంఏ సన్మార్గము.మాతృత్వ సహజ భావనను పొందలేము కదా.పరిశొధనలు మానవ సంబంధాలను మెరుగు పరిచేవిగా ఉంటే బాగుంటుంది.
      "ది వీక్ లో పడిన ఆర్టికల్ ఆధారంగా రాసింది.

Thursday, January 30, 2014

ఆవేదన


         కాయ పండకుండానే
         నేలరాలింది
         ఓ కన్నీటి చుక్క
          రాలింది.
        వికసించకుండానే మొగ్గ
          నలిగింది
       ఓ తల్లి హృదయం
       తల్లడిల్లింది.
       ఎదగకుండానే బాల్యం
       బధ్ధలైంది
       కన్నవారి గుండెలు
      కడలిగా మారాయి.
      అభాగిని అందం
      కాలిపోయింది
     అమ్మయి అంతరంగం
    ఆక్రోశించింది.
   ఈ అకృత్యాలనుగని భరతమాత
     కన్నీరైంది.

Saturday, January 25, 2014

మంచి మాట


     ఒకటి గొని,రెంటి నిశ్చల యుక్తి జేర్చి,
     మూటి నాల్గింట గడు వశ్యములుగ జేసి,
     యేనిటిని గెల్చి, యారిటి నెఱిగి,యేడు
     విడిచి వర్తించు వాడు వివేకధనుడు.
           భగవంతునిపై నిశ్చలమైన మనస్సును ,భక్తిని నిలిపి త్రికరణ శుధ్ధిగా  చతుర్విధ పురుషార్ధాలను వశము చేసుకొని,పంచేంద్రియములను గెలిచి అరిషడ్వర్గములను తెలిసికొని, సప్తవ్యసనములకు దూరంగా నడచు వాడే వివేకవంతుడు .----అని విదురుడు మహాభారతం లో ధృతరాష్ట్రునికి  చెప్పాడు.కాని ఇది సర్వకాల సర్వావస్థలలోను ఆచరిచ దగినది.
  అరిషడ్వర్గాలు---కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యములు.
  సప్తవ్యసనములు---జూదము,మాంసము,మద్యము,వ్యభిచారము,వేట,దొంగతనము,పరస్త్రీ వ్యామోహము.

Thursday, January 23, 2014

యోగ-ఒక ఆలోచన


     ఈ రోజుల్లో చాలామంది మేము యోగా నేర్చు కుంటున్నామనో,యోగాకి వెళితే మంచిదనో చెప్తూ వుంటారు. అసలు యోగా అంటే ఏమిటో కొన్ని విషయాలు తెలుసుకుందాము.
         యోగా అంటే మనస్సు లేని స్థితి అంటారు పతంజలి.మనోవ్యాపారాలను ఆపివేయడం.మనస్సులో అహంకారం, కోర్కెలు,ఆశలు, తాత్త్విక చింతనలు అన్నీ మామూలుగా వుంటాయి.మనస్సు లేకపోతే ఇవేమీ తెలియని స్థితిలోకి ప్రవేశిస్తాము.యోగా అనేది తెలియని స్థితి లోకి వెళ్ళడం. దీనినే రామచంద్రజీ మనస్సుకి వైరాగ్యాన్ని అలవర్చుకోవాలని చెబుతారు. యోగా అనేది ఒక శాస్త్రం మతం కాదు.మతం నమ్మకాన్ని గురించి చెబుతుంది.యోగా అనుభవాన్ని తెలియజేస్తుంది. మనిషి రేపటి గురించి ,భవిష్యత్తు గురించి ఆశ భ్రమలలో బ్రతుకుతున్నాడు.నగ్నమైన సత్యాన్ని చూసేందుకు ఎవరు సిధ్ధంగాలేరు.ఇలాంటి మనస్సు ఎప్పుడూ యోగా మార్గం లో ప్రవేశించ లేదు.ఎప్పుడైతే ఆశా భ్రమా లేకుండా జీవితం అర్ధ రహితంగా భావిస్తామొ అప్పుడు మాత్ర్మే యోగ శాస్త్రాన్ని అర్ధం చేసుకోగలం.బుధ్ధితోయోగాన్ని అర్ధం చేసుకోగలం వుపన్యాసం ఇవ్వగలం,వ్యాసాలు వ్రాయగలం కానీ యోగి కాలేము. యోగిగా మారాలంటే శిక్షణ అవసరం. శిక్షణ అంటే మనల్ని మనం క్రమ బధ్ధీకరించుకోవడం. మనం మనం గాఉండగలగడం. మనల్ని మనం తెలుసుకో గలగడం. ఆశ పూర్తిగానశించాలి.మనస్సు చెప్పేదంతా నిరర్ధకమన్న ఙానం కలగాలి.మనస్సును ఎప్పుడైతే వదిలేయగలమో అప్పుడు యోగాలోకి ప్రవేశించగలం. భవిష్యత్తు వైపు కానీ భూతకాలం వైపు కానీ వెళ్ళడం మానేసి  వర్తమానం లో ప్రయాణిచడం మొదలు పెట్టాలి.
                   మనస్సును అదుపు వుంచాలంటే దాని రూపాంతరాలను ముందు తెలుసుకోవాలి.మనస్సు యొక్క మొదటి రూపం ప్రమాణం.అదే వాస్తవిక ఙానం.మనకు సరైన ఙానం లభించి నప్పుడు దానిని నిరూపించు కోవాల్సిన అవసరం లేదు మార్గం ఎంచుకోవాల్సిన పనిలేదు.ఎందుకంటే అది వాస్తవం కాబట్టి.
             రెండవది విపర్యయ లేదా తప్పడు ~ంఆనం.ఏ పనిచేసినా తప్పుగానే చేస్తాము.ఏం చదివినా,ఎలా ప్రవర్తించినా అది తప్పుగానే ఉంటుంది.దెవుని దయను ఉన్మాదంగా అర్ధం చేసుకున్న ఒమర్ ఖయ్యాం  జీవితాంతం తాగుతూనే ఉన్నాడు.ఎందుకంటే దేవుడు దయ గలవాడు కనుక తనపట్ల దయ చూపిస్తాడని భావిస్తాడు. ఇది తప్పుడు ఙానం.
               మూడవది కల్పన. అందమైనవి అసహ్యకరమైనవి కూడా ఆ కల్పన నుండి వచ్చినవే.అందమైన ప్రపంచాన్ని సృష్టించాలంటే బలహీనుల్ని,అందవిహీనుల్ని ,అంగవికలుర్ని నాశనం చేయడం ద్వారా చేయవచ్చు అనేది కల్పన.అసలు నాశనం చేయడం అనేదే వికృతమైన ఆలోచన. ఇది అధివాస్తవిక కల్పన. కల్పన కవిత్వాన్ని, కళలను,చిత్రాలను ఎలా ఇవ్వగలదో అలాగే ఉన్మాదాన్ని కూడా. మనమెలావినియోగిస్తామనే దాన్ని బట్టి ఉంటుంది.
                   నాలుగు నిద్ర .నిద్ర అనేది స్పృహలో లేకపోవడం. చైతన్యం తనలో తను ముకుళించుకు పోతుంది.మనస్సు పనిచేయదు. కల కంటున్నామంటే నిద్ర పోవడం లేదన్న మాట.నిద్రకు మెలుకువకు మధ్యలో ఉన్నామన్న మాట.నిద్ర జీవ శక్తిని ఇస్తుంది. నిద్రను ఎలా వాడు కోవాలో తెలిస్తే అది సమాధి అవుతుంది.బుధుడు ,రామకృష్ణుడు ఏ ఆనందాన్ని అనుభవించారో ఆ ఆనందం మన సొంతమౌ తుంది.నిద్రలో కూడాప్రమత్తంగా ఉంటే అది సమాధి అవుతుంది.అది అధ్యాత్మిక అనుభూతి.
                ఙాపకం అయిదవ రూపాంతరం. ఙ్పకాన్ని తప్పుగా వాడుకుంటే అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. దానిలో కల్పన ప్రవేశించ వచ్చు.మార్పులకు గురికావచ్చు.ఙాపకం సరీయినదిగా ఉండాలంటే మనిషి తన పట్ల తాను నిజాయితీగా ఉండాలి. అది గత జీవితాన్నుండి విముక్తులను చేస్తుంది.అంతహ్ చేతనలో ఏదైతే ఉందో దానిని అలాగే ఉండనిస్తే అలాగేవాస్తవాన్ని చూడగలిగితే అదే స్వేచ్చ,స్వాతంత్ర్యం.అంటాడు పతంజలి.అప్పుడు మనస్సులో స్పష్టత సాధ్యమౌ తుంది.అదే ధ్యానం వైపు నడిపిస్తుంది.
                   ఎప్పుడైతే మనస్సు రూపాంతరాలను గ్రహించి దాని ప్రవాహవేగాన్ని అధిగమిస్తామో అప్పుడు మనస్సులేని స్థితిని పొందగలం.మనిషిలక్ష్యం సత్యం. అదిచేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి.పతంజలి అన్ని మార్గాలను వివరిస్తాడు.రామచంద్రజీ క్షాళన,ప్రార్ధనలను ప్రముఖం గా వివరిస్తారు. క్షాళన ప్రక్రియ ఆలోచన యొక్క మూలశక్తిని మానవ సంకల్ప రూపం లోవ్యక్తి యొక్క ఆత్మను శుధి చేయడానికి ఉపయోగిస్తుంది.ప్రార్ధన విజయం సాధించడానికితిరుగులేని ఉపయోగంగా పేర్కొనబడింది.భగవంతుని సతత స్మరణ చేస్తూ ఆత్మార్పణ కావించాలని ఆయన చెబుతారు ఇంకా హృదయం వధ్ధ దివ్యజ్యొతి వున్నదని భావించి హృదయ ధ్యాన పధ్ధతి ద్వారా పవిత్ర దివ్యత్వంతో ఏర్పరుచుకోవాలంటారు రామచంద్రజీ.
              ఎవరు ఏ మార్గాన్ని చెప్పినప్పటికీ అంతిమంగా మనం చిత్తశుధ్ధితో ప్రయత్నించినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం.ఏదో సాధించాలన్న ఉధ్ధేశ్యముతోనో తాత్కాలిక ప్రయోజనం ఆశించో చేయడ వలన ప్రయోజనం ఉండదు. ధ్యానం చేయండి.ఆనందించండి అక్కడ లక్ష్యం లేదు. భవిష్యత్తు లేదు.ధ్యానం చేయండి సంతోషించండి.అకస్మాత్తుగా లక్ష్యం అక్కడ ఉంటుంది.ప్రయత్నిచండి మరి.

Sunday, July 21, 2013

తెలుగు గీతం


 తెలుగు పాట తేనెమాటల ఊట
కుహూకుహూ రాగాల కోకిలపాట
పంచదారకన్న ఇక్షురసం కన్న
లేజవరాలి మోవికన్న తియ్యనైన తెలుగు
అజంతమై అమృతభావననింపు
నవరసాలొలుకు పద సంపద
అనుభూతులు అనుభవాలు పలుకు అక్షర దీప్తి
నీ సంపదే ను తెలుగు భాషామ తల్లి
పలుకుసమాసములు పదబంధమ్ములు
సూక్తులు నానుడులు సామెతలు జాతీయమ్ములు
తెలుగు వాడి నోట పలికినవి నిత్య చైతన్య స్రవంతిగా
అవధానాల అవధి చందో చమత్కృతి నెరిగిన భాష
శతకాల సంకీర్తనల చాటువులతో
ఇంపున పెంపై సోయగమొలుకు భాష
నానారుచిరార్ధ  సూక్తినిధి నన్నయ్య
అల్పాక్షరాల అనల్పార్ధ శిల్పి తిక్కన్న
ఎఱ్ఱన పెధన పోతనాది సేవలందిన భాష
జానపదుల వాఙ్మయ విన్యాసాలు
క్షేత్రయ అన్నమయల పదకవితా పరిమళాలు
సూరన కల్పనా చాతుర్యాలు
హాస్య రచనల వెన్నెల వయ్యారాలు
నాట్యమాడినవిట రసికలోక భాగ్యముగా
కధా నవలా నాటకాది ఆభరణాలనెన్నో
ఇమ్ముగా అలంకరించుకున్న ఇష్ట సఖి తెలుగు
మాండలిక యాస భాషలెన్నో ఇముడ్చుకున్నా
ప్రతి గుండెలో పలుకు సమైక్యతారాగం .