Thursday, December 27, 2012

తెలుగు గీతము
  విన్నానూ అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగూ
  ప్రభవించెను నామదిలో విఙానపు వెలుగూ //వి//
  మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం
  కలసి మెలసి బ్రతికేందుకు మాతృభాష కీలకం//మ//
 తతరాల అనుభవాల్ని అందించే సాధనం
 జాతి జనుల సంస్కృతి ప్రతిఫలించు దర్పణం/త/
  మాతృ భాష జనం మధ్య వికసించే అనురాగం
  ప్రతి గుండెను పలికించే సమైక్యతారాగం /మా/
  విఙానపు  వీచికలను వెదజల్లే సౌరభం
 విశ్వమంతా చాటుదాం తెలుగుభాషావైభవం /వి/
  భారతాన్ని తెనిగించిన నన్నయ తిక్కన ఎర్రన
 భక్తి గాధల పోతన తెలుగు సామెతల వేమన
 కందుకూరి గురజాడ గిడుగు పిడుగు శ్రీశ్రీలు
 నవజీవన సమభావన నేర్పించిన మహనీయులు/వి/
పచ్చనైన పైరు మీద పేర్చినట్టి చీడపీడ
 అచ్చ తెలుగు భాష మీద  ఆంగ్లభాష పడగనీడ
 విష సంస్కృతి కోరలలో విలపించెను భాష
పట్టదేమి పాలకులకు తెలుగుతల్లి ఘోష
 అమ్మ ప్రేమ కమ్మదనం తెలుగు భాష తియ్యదనం
 భాషాభిమానంతో కడవరకు సాగుదాం
 త్యాగాలతో సాధించిన విశాలాంధ్ర దేశం
విద్రోహుల చేతులలో పడనీయకు నేస్తం //వి//
         *****_******
ఈ గీతం ఎవరు రాశారో తెలియదు .బాగున్నదని  ఎప్పుడో  సేకరించాను. ప్రపంచ తెలుగుమహాసభల నేపధ్యం లో ఈగీతం పోస్టు చేశాను.

Sunday, August 5, 2012

నయాగరా జలపాతం

ప్రపంచ ప్రసిద్దిగాంచిన జలపాతాలలో రెండవ స్థానాన్ని పొందిన జలపాతం నయాగరా.మొదటిది దక్షిణ అమెరికాలోని విక్టోరియా జలపాతం.కాని సందర్శకులను  ఎక్కువగా ఆకర్షించేది నయాగరానే.
 
          ఇది యు.ఎస్ లోని న్యూయార్క్ స్టేట్ కెనడా దేశాల మధ్య సరిహద్దుగా ఉన్నది.న్యూయార్క్ నగరానికి 75మైళ్ళ దూరంలో ఉన్నది, మూడుజలపాతాల సమూహము.మొదటిది హార్ష్ షూఫాల్స్,రెండవది అమెరికన్ ఫాల్స్,మూడవది బ్రైడల్ వీల్ ఫాల్స్.మొదటి రెండిటిని గోట్ ఐలాండ్ వేరు చేస్తుండగా తరువాత రెండిటిని లూనా ఐలాండ్  వేరు చేస్తున్నాయి.అమెరికన్,బ్రైడల్ వీల్ ఫాల్స్ రెండూ అమెరికా వేపు,హార్స్ షూ ఫాల్స్ కెనడావైపు ఉన్నాయి. ఇరి,ఒంటారియో సరస్సులు రెండు నయాగరా నదిగా ఏర్పడి 165 అడుగుల ఎత్తు నుండి పడటం వలన సహజసిద్దమైన ఈ జలపాతము ఏర్పడినది.సెకనుకు నాలుగు మిలియన్ క్యుసెక్కుల నీరు పడుతుందని అంచనా వేయబడింది.రెండు జలవిద్యుత్తు కేంద్రాలు ఇక్కడ కలవు.మంచి పర్యాటక కేంద్రంగా,పారిశ్రామిక ,వ్యాపార కేంద్రంగా  ఉన్నది.


             చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 18000సంవత్సరాల క్రితం ఐస్ గడ్డ కట్టి ఉండేదని, 12500 సంవత్సరాలనాటికి కొంచెం కొంచెం ఐస్ కరగడం ప్రారంభమై రెండు సరస్సులుగా ఏర్పడ్డాయని చెబుతారు.అవే ఇరీ,ఒంటారియోసరస్సులు.సుమారు 5500సంవత్సరాలక్రితం ఇవి ప్రవాహాన్ని సంతరించుకొని నయాగరానదిగా మారి ప్రవహిస్తూ ఎత్తు నుండి పడటం వలన జలపాతం ఏర్పడినది.  అన్నితికంటే పెద్దది హార్స్ షూ ఫాల్స్. దీని ఎత్తు 173 అడుగులు,వెడల్పు 2600 అడుగులు.
             మొదటిసారిగా సామ్యూల్డి తన జర్నల్ లో ఈ జలపాతాన్ని తాను చూసినట్లుగా వ్రాసాడు.1677లో లూయిస్ హెన్నెఫిన్ వీటి అందాన్ని వర్ణించడంతో యూరోపియన్లకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఫెర్కాం 18వశతాబ్దం లో దీని శాస్త్రీయతను ప్రకటించాడు.ఈ శతాబ్దం మధ్యకి ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించసాగినాయి. 19వ శతాబ్ది ప్రారంభంలో నెపోలియన్ బోనపార్టీ సోదరుడు తన భార్యతో ఈ జలపాతాన్ని దర్శించాడు.అమెరికన్ సివిల్ వార్ తరువాత రోడ్డు,రైలు మార్గాలను బాగా అభివృధి చేశారు.ఒక ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా మారింది.

              మేము శనివారం వేళ్ళాము.ఆరోజు విపరీతమైన రద్దీగా ఉన్నది. చాలా టూరిష్టు బస్సులలో ఎక్కడెక్కడి నుంచో విజిటర్స్ వచ్చారు.అమెరికావైపు  చూడ దగినవి  Maid of Mist, Cave of the winds, Naigara falls state Park,acqarium  etc...మెయిడ్ ఆఫ్ మిష్ట్ అంటే మనల్ని క్రూస్(మోటార్ బోట్స్) లో హార్ష్ షూ జలపాతానికి చాలా దగ్గరగా తీసుకు వెళతారు.వర్షం పడినట్లుగా మన మీద నీటి తుంపరలు పడతాయి.బోట్ ఎక్కే ముందే మనకు ప్లాస్టిక్ కోట్ లాంటిది ఇస్తారు. దాన్ని వేసుకొని వెళ్ళలి.ఆ అనుభూతి మాటలలో చెప్పడం అసాధ్యం.అనుభవించి తీరాల్సినదే.కేవ్ ఆఫ్ ది విండ్స్ లోమనని బ్రైడల్ వీల్స్ ఫాల్స్ కిందకు మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళవచ్చు.అది మధురానుభూతి.అక్వేరియం,స్టేట్ పార్క్ కూడా చూఊడాదగినవే.కెనడా వైపు ది స్కైలైన్ టవర్ ,కాసినోస్ మొదలైనవి ఉన్నాయి.పెద్దదైన హార్ష్ షూ ఫాల్స్ అమెరికా వేపు నుంచి కంటే కెనడా వైపు నుండి బాగా కనిపిస్తుంది.కాని అటు నుంచి చూడాలంటే వీసా తీసుకొని వెళ్ళాలి.రాత్రి 9 గంటలు దాటిన తరువాత కెనడా వైపు నుంచి ఫాల్స్ మీద పడేటట్లుగా లైట్లు వేస్తారు.సప్త రంగులతో ఇంద్ర ధనస్సును మరిపించేటట్లుగా ఉన్న ఆ దృశ్యం అత్యద్భుతం. చిత్రకారులకు,కవులకు ప్రేరణ కలిగించే దృశ్య మాలిక.అందరూ చూసి ఆనందించ దగిన సుందర ప్రదేశం.కొన్ని ఫొటోలను జత పరిచాను.మీరూ చూసి ఆనందించండి.


 

నా చేతిపని

                     ఇక్కడ పూల రేకులు దొరుకుతాయి.వాటితో పూలను,కట్ చేసి ఆకులను తయారు చేసి రంగులను అద్ది ఈగుత్తి తయారు చేశాను.


Tuesday, July 31, 2012

కార్నెగీ గ్లాస్ మ్యూజియం

మా అమెరికా యాత్రలో భాగంగా నయాగరాజలపాతం చూడాలని భావించాము. కాని స్నేహితుల ద్వారా గ్లాస్ మ్యూజియం గురించి తెలిసింది. ముందు అంత ఆసక్తి అనిపించ లేదు .సరే దారిలోనేకదా చూద్దాంలే  అన్నట్లుగా వెళ్ళాము.వెళ్ళక పోయివుంటే  మంచి  అనుభవాన్ని మిస్ అయివుండే వాళ్ళము.



         న్యూయార్క్ రాష్ట్రంలోనే  పెన్సిల్వేనియా సరిహద్దులోవున్న  చిన్న పట్టణం కార్నెగి.జనవరి 1,థాంక్స్ గివింగ్ డే, డిసెంబెర్ 24,25 తేదీలలో మాత్రమే సెలవు రోజులు.మిగతా అన్ని రోజులు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు  విజిటింగ్ అవర్స్ వున్నాయి. గ్లాస్ మేకింగ్,గ్లాస్ విత్ ఫన్ ,గ్లాస్ షో ,షాట్టెరింగ్ గ్లాస్ వంటి ప్రత్యేకమైన షోలు వున్నాయి. మనకు మనమే ఒక గ్లాస్ ఆర్టికల్ తయారు చేసుకోవడం థ్రిల్లింగ్ గా వుంటుంది.
               ఈ మ్యూజియం 1950లో  ప్రారంభించబడినప్పటికీ అధికారికంగా 1951 నుండి విజిటర్స్ కు అనుమతి లభించినది. 1951 నుండి 1960 వరకు ,1973 నుండి 1980 వరకు థామస్ s బుచ్నెర్  డైరెక్టర్గా పనిచేశారు.ఈయన హయాం లో గ్లాస్ తయారికి సంబంధిచిన అరుదైన అనేక పుస్తకాలు సేకరించాడు.పాల్ పెరెట్ డైరెక్టర్గా వున్న సమయంలోకూడా మ్యూజియం అభివృధికి ఎంతో కృషి చేశాడు. నేటీ మ్యూజియం రూపకర్త గున్నర్ బర్కెర్త్స్.కొత్త భవన నిర్మాణం లోనే కాకుండా వస్తువుల సేకరణకు ప్రత్యేక శ్రధ్ధ కనబరిచాడు.ఇది  మే28,1980లో ప్రారంభించబడినది.
                ప్రసిధ్ధిగాంచిన క్లాస్ మోజె,కరెన్ లామోంట్,డాల్ చిహ్లి,బ్రిక్టోవాలు రూపొందించిన అనేక కళాకృతులు ఇక్కడ వున్నాయి.లోపలికి వెళ్ళి తలెత్తి చూడగానే మనకు కనిపించేది 600  గ్లాస్బౌల్స్ తోచేయబడిన టవర్ దర్సనమిస్తుంది. మెసపటోమియా,ఈజిప్టు నాగరికతల కాలం నాటి గాజు వస్తువుల నుండి  ఆధునిక కళారూపాల వరకు కలవు.పూర్వకాలంలో గాజు తయారీఈ ఎలా వుండేదో అక్కడ తయారుచేసే కొలిమి పనిముట్లు ప్రదర్సించబడినాయి. ఆధునిక కాలంలో తయారీ మనకు 20 నిముషాల డెమో ద్వారా చూపిస్తారు. పూర్తిగా మాన్యువల్. కనుకనే ధర కూడా ఏక్కువే.3500 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు 40,000 కు పైగా వస్తువులు వున్నాయి. pink chuhli chandlier,tiffiny window,crystal table boat  కళ్ళు తిప్పుకోనివ్వవు. పంచభూతాలను  గ్లాస్లో మలచిన తీరు మహాద్భుతం.మహ్మదీయుల గ్లాస్ పనితనము,ఆభరణాలు భద్రపరిచే పెట్టెలు,గాజు గిన్నెలు,సైంట్ఫిక్ పరికరాలు అన్నీ దేనికవే  అద్భుతమైనవి.




          రాకో రీసర్చ్ లైబ్రరీ:-
          ఈ మ్యూజియంకు సంబంధించిన ప్రతి అంసము జూలియట్ ,లియోనార్డొ రాకోరీసర్చ్ లో పొందుపరచబడ్డాయి.40 కి పైబడిన భాషలలో  ముద్రించబడిన పుస్తకాలలో పూర్తి సమాచారము లభిస్తుంది. 12వ శతాబ్దం నుండి  ఆధునిక గ్లాస్ కళాకారుల జీవిత చరిత్రల వరకు ఇక్కడ కలవు.వ్యక్తిగత, కార్పొరేట్ ఆర్చివ్స్,మాన్యు స్క్రిప్ట్స్,స్టాంపులు,కాలెం
డర్లు గ్లాస్ కు సంబంధించిన అనేక అంశాలు ఈ లైబ్రరీలో దొరుకుతాయి.
         అంతర్జాతీయ కళాకారుల కోసం బోధనా తరగతులు ,వర్క్ షాపులు నిర్వహించ బదతాయి.అమెరికన్ మరియు  అంతర్జాతీయ  ఇనస్ట్రక్టర్స్ సంవత్సరం పొడువునా తరగతులు నిర్వహిస్తారు. ఒక నెల  ఇక్కడ వుండి గ్లాస్ కళ ,ఆధునిక కళ లోని మెలుకువలను నేర్పుతారు. తరువాత ప్రతి ఒక్క విద్యార్ధి తను నేర్చుకొ విషయం మీద ప్రెజెంటేషన్ ఇవ్వాలి.glass blowing,flame work,kiln casting,hot sculpting,engraving,cold working,fusing,gilding,sand blasting మొదలగునవి నేర్పుతారు.  కొన్ని  కళాకృతులను ఇక్కడ  పెడుతున్నాను మీరు కూడా చూసి  ఆనందించండి
 

Wednesday, July 18, 2012

మంచి మాట

 అసూయ,అశాంతి,అహంకారం,అనుమానం,అనుకరణ,అపనమ్మకం,అశ్రధ్ధ,అసంతృప్తి,అనాసక్తి,అసమర్ధత,అసహనం,అలసత్వం,అశక్తత,అయిష్టం,అత్యాశ మొదలగు అకారలలో కొన్నిటినైనా వదిలితే మనిషి మనిషిగా బ్రతకవచ్చు.అన్నిటినీ వదిలితే మహాత్ముడే అవుతాడు.

Saturday, June 30, 2012

బర్డ్స్ ఫీడింగ్




 నేను అమెరికా లోని మాతమ్ముడి గారింటికి ఒక వారం ఉండటానికి వెళ్ళాను.వాళ్ళదిసొంత ఇల్లు.చుట్టూ అందమైన తోట.చార్లెట్ లో ఎక్కడ చూసినా చెట్లే.వాటిని చెట్లు అనకూడదు,వృక్షాలు అనాలి.అడవిని తలపిస్తుంది. వారిల్లు కూడా అలాగే ఉన్నది.అందులో నన్ను బాగా ఆకర్షించినది బర్డ్స్ ఫీడింగ్.



           తోటలో ఒక ఇనుప స్తంభానికి రెండు గాజు కుప్పీలు వాటికి మధ్య మధ్య చిన్న హోల్స్ ఉన్నాయి.వాటినిండా ధాన్యపు గింజలు పోసి స్తంభానికి వేలాడ తీసారు.ఉదయం నుంచిరాత్రి వరకు రకరకాల పక్షులు వచ్చి వాటిని తింటూ సందడి చేస్తుంటాయి.మాకు రోజూ అదే కాలక్షేపము.దానికి ఒక సూర్య కాంతిని  చార్జ్ చేసుకునే దీపము కూడా ఉన్నదండోయ్. ఆంధ్రదేశం లో కనుమరుగు అయిన పిచ్చుకలు ఇక్కడ కొల్లలుగా కనిపించాయి.వడ్రంగి పిట్టలు,కోయిలలు ఇంకా పేరు తెలియని ఎన్నో పక్షులు కనువిందు చేయటమేకాక వాటి కిలకిలా రావాలు మనస్సును ఆనంద డోలికల్లో ఊగించాయి.

          అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది హమ్మింగ్ బర్డ్.అది చాలా చిన్న పక్షి .కాని అమిత వేగంతో ఎగురుతుంది.అది రెక్కలను విపరీతమైన వేగం తో కదిలిస్తుంది.ఆరెక్కలుచేసే చప్పుడు వల్లే ఆపేరు వచ్చివుంటుంది.దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.ఆపక్షిని ఆకర్షించే నీలం పూలు పూసేమొక్కను పెట్టారు.ఒక ప్రత్యేకమైన గిన్నెలో ఒక పంచదార మూడు వంతులు నీరు కలిపిన ద్రావకాన్ని ఆగిన్నెలో పోసి పెడతారు.వాటిని నాలుగు రోజులకు ఒకసారి మారుస్తుంటారట. మనస్సుకు స్వాంతన కలుగచేసే ఆరోగ్యకరమైన వాతావరణం అక్కడ చోటుచేసుకున్నది.అది అందరితో పంచుకోవాలనే ఇందులో రాయడం జరిగింది. కొన్ని ఫొటోలు ఇక్కడ పెట్టాను మీరూ వీక్షించి ఆనందిస్తారని భావిస్తాను.

Wednesday, June 20, 2012

స్వామినారాయణ మందిరం


                                                

    ఆధ్యాత్మిక,మానసిక,భౌతిక ప్రశాంతతను చేకూర్చే మందిరాలు ప్రపంచవ్యాప్తంగా అనేకంకలవు.అలాంటి మందిరమే అట్లాంటాలోనిలారెన్స్ విల్లేహైవే ప్రక్కన రాక్ బ్రిడ్జె రోడ్డులో 29ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన "స్వామినారాయణ మందిరము".

        ప్రముఖ స్వామిమహరాజ్ ఆధ్వర్యంలో ఆగష్టు26,2007కి నిర్మించబడినది.టర్కిష్ లైంస్టోన్ ,ఇటాలియన్ మార్బుల్,ఇండియన్ పింక్ శాండ్ స్టోన్లను భారతదేశం లోని కళాకారులు వివిధ రూపాలలో చెక్కి దాదాపు 34000 పైగా ఆకృతులను అమెరికా తరలించారు.బాగా ఎత్తు మీద నిర్మించబడిన ఈ మందిరము అద్భుతమైన శిల్ప సంపదతోను,రాతి తోరణాలతోను చూపరులను మంత్రముగ్దులను చేస్తుంది.ఉదయం 9 నుండి 10.30,11.15 నుండి12.00,సాయంత్రం 4నుండి6.00 వరకు సందర్శకులకు మందిరం లోపలికి ప్రవేశం ఉంటుంది.ప్రసాదాలు, కొబ్బరికాయలు ఇతర పూజలు వంటి హడావిడి అక్కడ కనిపించదు. పూజారి హారతి ఇస్తారు.భక్తులు నిశ్శబ్దాన్ని పాటిస్తారు.ఎదురుగా పంచలోహాలతో చేసిన భగవాన్ స్వామి నారాయణ విగ్రహము ఉంటుంది.ప్రక్కన రాధాకృష్ణుల విగ్రహాలు   కొంచెము ఇవతలగా విఘ్నేశ్వరుడు ,సీతారాములు,శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్టించబడినాయి.ప్రశిష్యుల విగ్రహాలు కూడా కలవు.


          శ్రీస్వామి నారాయణ 1781లో ఉత్తర భారతదేశం లోని ఒకగ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు.అప్పుడు హిందూమతం దురాచారాలతోను,మూఢనమ్మకాలతోను,సమస్యలతోను అతలాకుతలం అవుతున్నది.వాటిని చూసి చలించిన ఘనశ్యాం మహరాజ్ (బాల్యంలోని పేరు)11 సంవత్సరాలకే ఇల్లు వదిలి ఏ విధమైన అనుచరులు ,కాలికి పాదరక్షలు లేకుండానే హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు 8000 మైళ్ళు ఒంటరిగా ప్రయాణించి మనిషి జీవితానికి నైతిక,ఆధ్యాత్మిక విలువలు ఎంత ముఖ్యమో ప్రచారం చేశాడు.ఆయన భోధనలు "వచనామృతం" అనే గ్రంధం లో ప్రచురించ బడ్డాయి.21సంవత్సరాల వయస్సులో "స్వామినారాయణ"సంప్రదాయాన్ని ప్రారంభించాడు.సంఘ సంస్కరణలు,పేదవారికి సహాయపడుట,మూఢాచారాలకు,దురలవాట్లుకు,హింసకు వ్యతిరేకంగా పోరాడటం ముఖ్య సిధాంతాలు.వీటి పట్ల ఆకర్షితులై స్వచ్చందంగా 2000 మంది అనుచరులు ఆయన శిష్యులుగా చేరారు. గుజరాత్లో 6 మందిరాలు నిర్మించబడ్డాయి.అందులో "అక్షర ధాం" ప్రఖ్యాతి గాంచినది.చిన్న వయస్సులోనే అనగా 49 సంవత్సరాలకే తనువు చాలించారు.ఆయన శిష్యులలో ముఖ్యుడైన గుణాతీతానంద స్వామి స్వామినారాయణ మత ప్రచార బాధ్యతను వహించారు.
గుణాతీతానంద స్వామి:-(1785-1867)
     వేదాలు,ఉపనిషత్తులు,ఇతిహాసాలు అనేక మత గ్రంధాలను ఆకళింపు చేసుకున్నారు.స్వామినారాయణ మతాన్ని ప్రచారం చెసిన మొదటి గురువుగా ప్రసిధ్ధికెక్కారు.
 భగత్జీ మహరాజ్:-(1829-1897)
  గుణాతీతానంద స్వామి శిష్యుడు.ఈయన రెండవ గురువు.
శశ్త్రాజీ మహరాజ్:-(1865-1951)
    మూడవ గురువు.మహా ఙ్ని.హిందూమతాభిమాని.5 మందిరాలు నిర్మించాడు.గుణాతీతానంద స్వామి(అక్షర),భగవాన్ స్వామినారాయణ(పురుషోత్తం)పేరుతో 1907లో భగవాన్ అక్షర పురుషోత్తమ స్వామి నారాయణసంస్థ ను(బి ఎ పి ఎస్) స్థాపించారు.
ప్రముఖ స్వామి మహరాజ్:-(1921-   )
         ప్రస్తుత గురువు.ఈయన ఆధ్వర్యంలో BAPS శాఖోపశాఖాలుగా విస్తరించినది.ప్రేమ,శాంతి,విశ్వాసము,మానవ సేవ ముఖ్య సిధాంతాలుగా ప్రపంచ వ్యాప్తంగా 3300 కేంద్రాలలో ఎ సంస్థ పనిచేస్తుంది.ఆధ్యాత్మిక,మానవతావిలువలు పెంచటమేకాక కళా,సాహిత్య,సంగీత రంగాల కేంద్రంగా కూడా ఈ సంస్థ పనిచేస్తున్నది.

ఇతరుల ఆనందంలోనే మన ఆనందాన్ని వెతుక్కోవాలనే వీరి బోధన అందరికీ అనుసరణీఈయమైనది.
    "సర్వే జనా సుఖినో భవంతు"

Wednesday, March 7, 2012

మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతా; ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నిలుస్తారు. వేదకాలంలో స్త్రీ పురుష భేదం అంతగాకనిపించదు. రాణి రుద్రమ ,దుర్గావతి, చాంద్ బీబీ,పల్నాటి నాగమ్మవంటి స్త్రీ మూర్తులు రాజకీయంగా సమాజాన్ని ప్రభావితం చేసారు.భూమి తల్లి,గోమాత,గంగామాత, భారతమాత అన్నింటిలో మాతృమూర్తిని పూజించుకొనే విశిష్ట లక్షణం మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. భారతీయ స్త్రీ ప్రపంచ స్త్రీలందరికీ ఆదర్సవాదిగా నిలుస్తుంది.రాజకీయవేత్తలుగా, శాసనకర్తలుగా,శాస్త్రవేత్తలుగా,విమానచోదకులుగా,అంతరిక్షంలో వ్యోమగాములుగా,న్యాయవాదులుగా,వైద్యులుగా ఇది అది యేమన అన్ని రంగములలో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు.
ఇది ఒక కోణం .విద్యాధికులైనా ,వుద్యోగులైనా స్త్రీ వివక్షకు గురి అవుతూనే వున్నది. నేటికీ బస్సు చార్జీ డబ్బులు మాత్రమే ఇచ్చి వుద్యోగానికి పంపే ప్రబుధులు ఎందరో.వుద్యోగం చేస్తున్నా ఆర్ధిక స్వేచ్చ లేని స్త్రీల దైన్య స్థితి ఇది. భార్య తనకన్నా చదువులో ,వుద్యోగంలో, తక్కువగా వుంటేనే భర్త అహం సంతృప్తి చెందుతుంది .మిన్నగా వుంటే హర్షించే భర్తల శాతం చాలా తక్కువ.నాగరికతలోఎంత ముందడుగు వేస్తున్నామనుకున్నా ఇప్పటికీ వరకట్నపు చావులు, అత్తా ఆడబిడ్డ ల వేధింపులు రోజూ ఏదోఒక మూల జరుగు తూనే వున్నాయి. స్త్రీల ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు నిత్యం జరిగే తంతులు.వుద్యోగం చేసేస్త్రీలని చులకనగా చూడటం ,నీచం గా మాట్లాడటం జరుగుతూనే వుంటుంది. ఇప్పుడు ఆధునిక వేధింపు ఏమిటంటే యాసిడ్ దాడులు. తన మాట వినకపోయినా, ప్రేమించకపోయినా యాసిడ్ పోసేయటమే. ఆ అమ్మాయికి ఇష్టా యిష్టాలు వుంటాయని ఆలోచించ రెందుకో. ఆకాశంలో సగం అని చెప్పుకోవడమే గాని రాజకీయాలలోగాని ,ప్రాధాన్యతా రంగాలలోగాని స్త్రీల శాతం ఎంత వున్నది? అతి కొద్ది మంది మాత్రమే వున్నత పదవులలో వుంటున్నారు .అన్నిటిలోవివక్ష కొనసాగుతూనేవుంటున్నది. ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా మౌలిక మైన మార్పులు రానప్పుడు స్త్రీల పరిస్థితి ఇంత కంటే మెరుగుగా ఎలా వుండగలదు.

Sunday, February 19, 2012

మనసు

చేతనత్వం లేని మనస్సు
వెన్నెల అందాల్ని ఆనందించ లేదు
ఏ విషయానికి స్పందించ లేదు
ఏ చికిత్సకు లొంగని
ఆ జడ మనస్కుల పై
పిడికెడు సానుభూతి వర్షించటం తప్ప
చేసేదేమీ లేదు.
చేవచచ్చిన ఆమనసులు
చుట్టూ వున్న చైతన్యాన్ని చూచి
తెగ ఏడుస్తూ వుంటాయి
పోనీ అలాగైనా స్పందించనీ
ఈర్ష్యా ,ద్వేషాలు లేని స్వచ్చమైన జీవితం
గడపాలని ఆకాంక్షిద్దాము.

Sunday, February 5, 2012

మరణం

నీవు పుట్టిన దగ్గర నుంచి
నీతో నిరంతరం నడుస్తూఉంటుంది
తన ఆనమాలు నీకు తెలియదు
అది తప్ప మిగిలినవన్నీ శాశ్వతం అనుకుంటావు.
అందుకే
బాధ్యతల్ని,బరువుల్ని నెత్తికెత్తుకుంటావు
అనురాగ,ద్వేషాలలో
ఈర్ష్యా,అసూయలలో
నిరంతరం మునిగి తేలుతుంటావు
ఆమైమరుపులో నీవుండగానే
అవేవీ తెలియని.అక్కరలేని
నీ ఆత్మీయ నేస్తం
తన గాఢ పరిష్వంగంలో నిద్రపుచ్చడానికి
తన చేతుల్ని చాస్తుంది.

Sunday, January 29, 2012

పిల్లలు-క్రమశిక్షణ

నేడు పిల్లల పెంపకము కత్తి మీదసాములాగా తయ్యారైనది. పూర్వం తాతలు,అమ్మమ్మలు,పెదనాన్నలు,పెద్దమ్మలుఇంత మంది పెద్దల మధ్య పెరిగేవారు.వారికి ప్రత్యేకించి మంచి చెడు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు.వారి ప్రవర్తన నుండి మాటలను బట్టి సహజంగా నేర్చుకొనేవారు.ఇప్పటి కాలంలో పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత కేవలం తల్లి,తండ్రుల మీద ఉంటున్నది. చిన్నప్పటి నుండి వారు తమ దృష్టిని పిల్లల మీద కేంద్రీక రించవలసి వస్తోంది.
తల్లి బిడ్డపై చెరగని ముద్ర వేస్తుంది.బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఆలోచనావిధానం ప్రవర్తన బిడ్డలో ఏ రకమైన భావాలు ఏర్పడతాయో నిర్ధేశిస్తాయని మన ప్రాచీన సాహిత్యంలోనేగాక ఆధునిక పరిశొధనలూ నిరూపిస్తున్నాయి. అనగా తల్లి గర్భమే బిడ్డ తొలి పాఠశాల.తరువాత కుటుంబం,సమాజం మలి పాఠాలను నేర్పుతాయి.తల్లిదండ్రులు తమ జీవితం ద్వారా ఙానాన్ని,నీతి,నిజాయతీ,సత్ప్రవర్తన వంటి అంశాలను ఆచరించి చూపటం ద్వారా పిల్లలకు మార్గదర్శులు అవుతారు. అంతేగాని అవి ఒకరు బోధిస్తే వచ్చేవికావు. మాతృత్వము,కలహశీలత్వము,అహంకృతి,నమ్రత,ఆకలి,దప్పికపలాయనము,సాంఘికముమొదలగు పద్నాలుగు సహజాతములు పిల్లలలో ఉంటాయని "మెక్డూగల్" అనే శాస్త్రజ్ఞుడు గుర్తించాడు.
తల్లిదండ్రులు తమ పిల్లలలోని సహజాతములను గుర్తించి తదనుగుణముగా జాగ్రత్తలు తిసుకోవాలి.మానసిక శాస్త్రజ్ఞులు 6-8సంవత్సరాల మధ్య పరావస్థ దశ ముఖ్యమైనదిగా భావిస్తారు. "బౌలీ" చేసిన ప్రయోగాలనుబట్టి నూటికి 50మంది నేరస్థులు చెడ్డ గృహపరిస్థితులు గల వారై ఉన్నారు. బాల్య దశ మంచి అలవాట్లను నేర్పుటకు అనువైనది.ఎంత చిన్నవాడైన అతని మనస్సు అంత గ్రహణశక్తి మృదుత్వము కలిగి ఉంటుంది. కుటుంబములోని తల్లిదండ్రులు పిల్లల మీద చూపు ప్రేమ,దయ,విసుగు,హేయముమొదలగునవి ప్రధమంగా వారి ప్రవర్తనకు మూలబీజములు. పిల్లల్ని చీటికీ మాటికి తిట్టటం వారిని గురించి చెడుగా ఇతరుల వద్ద చెప్పడం,కొట్టటం,వెక్కిరించడం,చులకన చేయడంవంటివి వారిని ఆత్మన్యూనతకు గురి చేయును.పిల్లలకు తల్లితండ్రులమీద ఇంటిమీద ప్రేమ కలిగేటట్లుగా పెద్దల ప్రవర్తన ఉండాలి. అప్పుడే వారు మంచి పిల్లలుగా పెరుగుతారు.వారు ఒక ప్రతిపత్తి,సమ్రక్షణ,ప్రేమ,స్వాతంత్ర్యంకోరుకుంటారు. అందుకు తగిన ప్రోత్సాహమివ్వాలి.అలాయిస్తూనే నిరంతరం గమనిస్తూ ఉండాలి.తల్లిదండ్రులు తమ ఆశయాలను,అభిలాషలను పిల్లలమీద రుద్దకూడదు. వారి ఆలోచనలను తెలుసుకొని గౌరవించాలి.పిల్లలు తమ ఆలోచనలు,కష్టనిష్టురాలను తల్లిదండ్రులతో స్వేచ్చగా నిర్భయంగా చెప్పుకొనే అవకాశం ఉండాలి.అప్పుడే ఉత్తమ వ్యక్తులుగా ఎదుగుతారు.

Sunday, January 1, 2012

పురాణాలు

అష్టాదశపురాణాలను గుర్తుంచుకోవడం కష్టం.కాని అందుకు సులువైన మార్గం మన సాహిత్యం లోనే ఉన్నది.శ్లోకాలద్వారా, పద్యాలద్వారా గుర్తుంచుకోవడం తేలిక.
మద్వయం భద్వయంచైవ
బ్రత్రయం వ చతుష్టయం
అనాప కూస్కలింగాని
పురాణాని ప్రచక్షతే '
"మ"తో మొదలయ్యే పురాణాలురెండు: మత్స్య,మార్కండేయపురాణాలు
"భ" తో మొదలయ్యే పురాణాలురెండు:భాగవత,భవిష్య పురాణాలు
"బ్ర"తో మొదలయ్యే పురాణాలు మూడు: బ్రహ్మ,బ్రహ్మాండ,బ్రహ్మవైవర్తపురాణాలు
"వ"తోమొదలయ్యేవి నాలుగు:వామన,వాయు,విష్ణు,వరాహపురాణాలు
"అ"తో: అగ్ని పురాణం; "నా"తో :నారదీయ పురాణం;"ప"తో:పద్మ పురాణం; "కూ" తో :కూర్మ పురాణం
"స్క"తో:స్కాంద పురాణం;"లిం" తో:లింగ పురాణం ;"గ" తో:గరుడ పురాణాలను
పై శ్లోకం ద్వారా ఇలా గుర్తుంచుకోవచ్చు.