స్త్రీకి శరీరం ఉంటుంది దానికి వ్యాయామం ఇవ్వాలి
స్త్రీకి మెదడు ఉన్నది దానికి ఙానం ఇవ్వాలి
స్త్రీకి హృదయం ఉంటుంది దానికి అనుభవం ఇవ్వాలి"--అని తొలిసారిగా ప్రకటించి స్త్రీకి ఒక అస్తిత్వాన్ని ఇచ్చిన చలం జయంతి రేపు.
చలం మే 18 ,1894 బుధ జయంతి రోజున మద్రాసులో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివ రావు. చిన్నప్పుడే తాత (తల్లి తండ్రి )దత్తత తీసుకోవడంతో గుడిపాటి వెంకటా చలం అయ్యారు.పిఠాపురం కళాశాలలో చదివాడు. చిన్నతనం లోనే పురాణాలను ఆకళింపు చేసుకున్నాడు. తల్లి చెల్లెలు పడుతున్న ఇబ్బందులను గమనించి స్త్రీల సమస్య ల పట్ల ఆకర్షితుడు అయ్యాడు.సమాజం నుండి,అయినవాళ్ళ నుండి ,చుట్టుపక్కల వారినుండి స్త్రీలు భౌతికంగా మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన్ను కదిలించాయి,ఆలోచింపజేశాయి.అందువల్లనేస్త్రీని ప్రధానాంశముగా చేసుకొని రచనలు చేసాడు.
మైదానం,శశిరేఖ, దైవమిచ్చినభార్య,బ్రాహ్మణీకం, అరుణ అనసూయ,జలసీ మొదలగు రచనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి అంతే వివాదాస్పదమూఅయ్యాయి. మైదానం లో రాజేశ్వరి భర్తను వదిలి ఒకముస్లిం కుర్రాడితో వెళ్ళిపోతుంది. ఇక శశిరేఖ ప్రేమను ,సౌందర్యాన్ని వెతుక్కుంటూ తిరుగుతూనే ఉంటుంది.ఈ విశృంఖలత్వాన్ని సహజంగానే నిరసిస్తారు.కాని మనం ఇక్కడచుడవలసింది స్త్రీ ఆలోచనలకు,వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వకపోతేను ఆమెను కనీసం ఒకమనిషిగా కూడా చూడకపోతే జరిగే అనర్ధాన్ని చెప్పివుండవచ్చు. వివాహ వ్యవస్తలోని లోపాలను,కుళ్ళును, అర్ధహీనతను,ప్రేమరాహిత్యాన్ని,బలవంతాన్ని,మెటీరయలిష్టు పోకడలు ఈ నవలలో కనిపిస్తాయి.
గృహ హింసను చిత్రించే కథ జలసీ.ఎంతో నాగరికత,దయ,గౌరవమూ కలిగినపెద్ద మనుషులు భార్యల దగ్గరకు వచేటప్పటికి ఎలా ప్రవర్తిస్తారో చలపతిరావుని చూస్తే తెలుస్తుంది.కోరి ఆదర్సం కోసం వితంతువుని వివాహం చేసుకొని తర్వాత అస్తమానం అనుమానం తో ఎలా వేపుకుతింటాడో ,భార్యల మీద భర్తలమనే అధికారం తో మగాళ్ళు సాగించే దౌర్జన్యానికి తార్కాణం ఈ కధ .సుశీల కధ లో భర్త మీద ప్రేమను,సులేమాన్ పై ప్రేమను వదులుకోలేక మానసిక సంఘర్షణకు లోనై చివరకు క్షయ రోగ పీడితుడైన భర్తకు సేవ చేస్తూ వుండి పోతుంది .తన కధలలో మధ్య తరగతి భేషజాన్ని,కపటత్వానీ తీవ్రంగా దుయ్యబడతాడు అనేక వ్యాసాలుకూడా వ్రాసాడు.చలం ముందుచూపు పదేళ్ళకో, పాతికేళ్ళకో కాక శతాబ్దాల ముందుకి విస్తరించినది.
ఎంతోచదువుకొని వున్నత పదవులలో వున్న స్త్రీలు కూడా తమ సొంత అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పగలిగే స్థాయిలో ఎంతమంది వుంటారు?వేళ్ళపై లెక్క పెట్టవచ్చు.భర్తను దాటి సొంత నిర్ణయాలు తీసుకునేపరిస్థితి ఈనాటికీ లేదు. అలా తీసుకున్నా తీవ్రమైన సంఘర్షణను ఎదుర్కోవలసి వస్తుంది.
ఏది ఏమైనా స్త్రీల కోసం ఇంతగా వేదన అనుభవించిన రచయిత మరొకరు లేరనే చెప్పవచ్చు.రేపు 25వతేదీ భుధ్ధ పూర్ణిమ ఆయన జయంతి. ఈ సందర్భంగా చలం ను స్మరించుకోవడం తెలుగు వారిగా మనకర్తవ్యం.