Wednesday, January 28, 2015

చాటువు:--


       "ఆంధ్ర రత్న"దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాజకీయాలలో పేరు ప్రఖ్యాతులు పొందినవాడు.బారిష్ఠరుగా తన వాక్చమత్కృతితో,ఆకట్టుకునే కంఠ మాధుర్యంతో గాంధీజీ దృష్టిని ఆకర్షించినాడు.రామదండు ఉద్యమం,చీర అలా పేరాల ఉద్యమాలతో ప్రపంచాన్నీ ఆకర్షించాడు.చాటు కవిగా కూడా ప్రసిధ్ధుడు.తన ప్రసంగాలలో ఆశువుగా  అనేక చాటువులు దొర్లేవి. ఇతరులపై వ్యగ్యాస్త్రాలు సంధించడమే కాక తన పై తాను చెప్పుకొగల సాహసి.మచ్చుకి ఈ చాటువు ----
          "వేదాంతముల తోడ వెక్కిరింతల తొడ
                    లెక్చర్ల సాగించు లీల నెవడు
          లక్ష్య మొక్కటి లేక యక్ష గానములతో
                    కాలంబు వృధ పుచ్చు ఘను డెవ్వండు
          చీరాల పేరాల చిన్ని గ్రామంబుల
                    దొసమెన్నక కొంప తీసె నెవడు
          ఆంధ్ర రత్నం బంచు అహమికతో పెద్ద 
                   పిన్న లంచును మది నెన్న డెవడు
          అట్టి గోపాల కృష్ణుని హాస్య సరళి
          గోల కృష్ణునిగా చేసి కొరత దీర్చె
          కాక పగములుండునే 'గాడూ కైన
          రామ నగరీ నరేంద్ర! శ్రీ రామచంద్ర!"

               ఇలాంటి దుగ్గిరాల పై అబ్బూరి వారు చెప్పిన చాటువు--
   "ఉపమా పై ,పెసరట్టు పై,ఇడిలి పై హుమ్మంచు చూపించు నీ
    జప సంబద్ద పరాక్రమ కటాక్ష శ్రేణి మన్నించి శు
    భ్రపు జిల్లేబి పకోడి లడ్వగయిరా పై కొంతమంది రానిమ్ము శ్రీ
   చపలాపాంగ సితాంగనా హృదయ పా శా!పూజ్య వస్తు ప్రియా!"

              పండితులు పాడిత్యం లోనే కాక రసాస్వాదనలో స్వ పర భేదం పాటించరు.మనం కూడా ఆస్వాదిద్దాము.

    
             

Monday, January 26, 2015

చంద్రకళాంజనం:----


       కొబ్బరి నూనె--------------150గ్రా.
       నూవ్వులనూనె-------------150గ్రా.
       తేనె మైనం----------------150గ్రా.
       జామాయిల్----------------------50గ్రా.
       ముధ్ధ కర్పూరం------20గ్రా.
       వాము పువ్వు---------------25గ్రా.
       వాము పువ్వు---------------25గ్రా.
       యాలకుల తైలం-----------25గ్రా.
      (యాలుకలు దొరకక పోతే 10 యాలకుల గింజలు  పొడి చేసి  వస్త్ర్కాయం పట్టి ఉపయోగించుకోవచ్చు.)
      కర్పూరం, వాము పువ్వు,పుదీనా పువ్వు ఒక సీసాలో వేసి ఉంచిన పది గంటలలో కరుగుతుంది.
      నూనెలు మూడూ కలిపి అందులో  తేనె మైనం వేసి స్టౌ మీద పెట్టి కరిగించాలి.కరిగినదానిని  ఖధ్ధరు లేదా నేత వస్త్రం లో  రెండు సార్లు వడకట్టాలి.వేడి తగ్గిన తరువాత  నీరుగా కరిగిన కర్పూరం,వాము, పుదీనా పువ్వుల మిశ్రమాన్ని యాలకులపొడి వేసి చిక్కగా క్రీం లాగా అయ్యే వరకు  గరిటెతో తిప్పుతూ ఉండాలి.అదే "చంద్ర కళాంజనము".
        ఇది తలనొప్పి,ఒళ్ళు నొప్పులు మొదలైన వాటికి బాగా పనిచేస్తుంది.

Friday, January 23, 2015

అవిసెగింజలపొడి:----


       అవిసె గింజలు-----------------100గ్రాములు
       ఎండు మిరపకాయలు--------6
       జీర-----------------------------1స్పూను
      వుల్లుల్లి----------------------5రెబ్బలు
      ఉప్పు-----------------------రుచికి సరిపోను
               అవిసె గింజలు చిరు ధాన్యాలు అమ్మే షాపులలో దొరుకుతాయి.వాటిని కొంచెం వేయించుకోవాలి.ఎండు మిరపకాయలు కూడా వేయించాలి.రెండూ నూనె లేకుండానే వేయించాలి.ఇప్పుడు ఉప్పు సరిపోను వేసి మిక్సీ పట్టుకోవాలి.
           అన్నం లో మొదటి ముధ్ధలో ఒక స్పూను వేసుకుని తినాలి.తినగలిగితే వట్టి అవిసెగింజలైనా మిక్సీ పట్టి రోజూ ఒక స్పూను తినవచ్చు.
           ఇది చాలా మంచిది.రక్త శుధ్ధి జరుగుతుంది.బాడ్ కొలష్ట్రాల్ తగ్గుతుంది.ఫ్రీ మోషన్ అవుతుంది.

Wednesday, January 21, 2015

జొన్నమురుకులు:-


          జొన్న పిండి-------------------1/4కెజి
          పెసర పిండి------------------50గ్రాములు
          శనగ పిండి------------------50గ్రాములు
          నువ్వులు-------------------------2టబుల్ స్పూన్లు
          జీర-----------------------------1టీ స్పూను
         కారం------------------------1టీ స్పూను
         ఉప్పు----------------రుచికి సరిపోను
        నూనె--------మురుకులు వేయించడానికి చాలినంత
                       పెసర పప్పు,శనగపప్పు కొద్ది గా వేయించుకొని  పొడి చేసుకుంటే బాగుంటుంది. నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ ,ఒక స్పూను వేడి చేసిన నూనె  నీళ్ళతో ముధ్ధ గా కలుపుకోవాలి.
                బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పిండిని  మురుకుల గొట్టం లో పెట్టి  ఒత్తు కొని ఎర్రగా వేయించి తీసుకోవాలి.కరకర లాడే  జొన్న మురుకులు తినటానికి రెడీ.

Tuesday, January 20, 2015

ధర్మము:-


       ఏది ధర్మము?వేదములు,ఉపనిషత్తులు అనేక ధర్మాలను ప్రభోహించాయి.ఒక ధర్మాన్ని పాటించాలనుకున్నప్పుడు మరొక దానికి భాగం వాటిల్లవచ్చు.
                ఒక అరణ్యం గుండా గౄహస్థు వెళుతున్నడు.అతనిని చంపి అతని దగ్గరున్న ధనాన్ని అపహరించాలని దొంగలు వెంటబడతారు.ఆ గౄహస్థు
దగ్గర లో నున్న ఋషి ఆశ్రమం లో దాక్కుంటాడు.వెంబడించిన దొంగలు ఋషిని గృహస్థు ఉనికిని అడుగుతారు.అతని ఉనికి చెప్పక పోతే "సత్యం వద" జరుగుతుంది.చెబితే "అహింసా పరమో ధర్మః"అనే ధర్మానికి విఘాతం కలుగుతుంది.
         రెండు ధర్మాలకు విప్రతిపన్నములై నప్పుడు ఏది పరమ ధర్మమో దానిని అనుసరించాలి.స్వార్ధాన్ని కుటుంబం కొరకు,కుటుంబమును సంఘం కొరకు,సంఘమును దేశము కొరకు,దేశమును విశ్వము కొరకు,విశ్వాన్ని సత్యం కొరకై త్యజించాలి.ఏ త్యాగమే పరమధర్మము.చిన్న ధర్మాన్ని పెధ్ధ ధర్మము కొరకై విడిచిపెట్టాలి.ఏదియో ఒక ధర్మం చేయుటగాని ,ఏ ధర్మాన్ని స్వీకరింప కుండా ఉండటం కూడా కర్తవ్యం కాదు.

Saturday, January 17, 2015

కాశీఖండము:--


      శ్రీ నాధుడు రచించిన కాశీ ఖండము లోని ఈ రెండు పద్యముల లో అధికార,ఐశ్వర్య మదాంధులైన ఆ నాటి  రాజుల దిష్టత్వాన్ని నిర్మొహమాటం గా ఎలా చెప్పాడో గమనించండి.ఈ నాటి పాల కులకు కూడా చెంప పెట్టు అనటం లో సందేహం లేదు.
      "ఘ్నతరాహంకార కాలకూట విషాన
                 లాభీలములు కట్క్షాంచలములు
       దుర్వారతర తీవ్ర గర్వ గళగ్రాహ
                కవిత గాద్గద్య ఘర్ఘరము మాట
      యస్మితా సంప్రభూత స్మయాపస్మార
               విస్తృత ధైర్యంబు వినయ గరిమ
      యుధ్ధామ దర్ప భారోష్ణ దాహ జ్వరా
               రంభ సంభృత వికారంబు మనసు
      చరణ చంక్రమ మభిమాన సన్నిపాత
      జాత సర్వాంగ భంగంబు జనపతులకు
      భూ భుజుల తప్పె యది వారి బొందియున్న 
      ధరణి సామ్రాజ్య భారంబు తప్పు గాక?

2.   భువనైక ధన్విచే బుష్పాయుధుని చేత
                  బ్రసవాస్త్రమున నేటు పడనివాడు
      అతి గాఢమైన క్రోధాంధకారమ్మున
                  కన్నుల అంధుండు గానివాడు
      నిర్ణిబంధన లోభ నిద్రాభరంబున
                 పారవశ్యంబుచే బడనివాడు
     లక్ష్మీ కటాక్ష లీలా సీధు మదమున
                 మనము లోపల నున్నుకొనని వాడు
     లేడు!భూపతి!!కలిగెనా వాడు నృపుడె
    విశ్వ ధాత్రీ జనుల పాలి వేల్పు గాక!
    బాహ్య శత్రుల బరిహరింపంగ వచ్చు
    అంతరారుల నిర్జింప నలవి కాదు"

                  కామ,క్రోధ,లోభ మోహముల చిక్కిన జనుల నేగతి పాలింప నెంచును.బాహ్య శత్రువులు కనిపిస్తారు పోరాడవచ్చు.కాని అంతః శత్రువులతో  పోరాడాలంటే ఆత్మస్థైర్యం కావాలి. ఈ నలుగురు శత్రువులు లేని నాయకులు ఇప్పుడు ఎవరున్నారు?

Friday, January 16, 2015

చాటువు:--


        పూర్వం కవులు రాజులను పొగడ్తలతో ,అతిశయోక్తులతో  కవి త్వం చెప్పేవారు.తిరుమల రాయలు  రామలింగని స్వభావోక్తి లో ఒక పద్యం చెప్పమని కోరాడట. ఆయనకు ఒక కన్ను లేదు.ఆ విషయాన్ని ఈ పద్యం లో ఎంత గొప్పగా చెప్పడో చూడండి.
        "అన్నాతి కూడ హరుడవు
         అన్నాతిని కూడకున్న అసుర గురుడ వీ
         వన్నా తిరుమలరాయా!
         కన్నొక్కటి లేదు కాని కంతుడు వయ్యా!
          ఆ+నాతి  అంటే భార్య తో కూడి ఉంటే మూడు కన్నులు అవుతాయి కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడువే! లేకుంటే ఒక కన్ను తో అసుర గురుడు శుక్రాచార్యుడివి.ఆ కన్నొక్కటి ఉన్నచో మన్మధుడువే! --అని చమత్కారం గా నొప్పించ కుండా చెప్పాడు.ఇలాంటి  చక్కటి పద్యాలు మన సాహిత్యానికి లో కోకొల్లలు గా  ఉన్నాయి.చదివి ఆస్వాదించే ఓపికా,తీరికా మనకుండాలి.

Thursday, January 15, 2015

బీట్ రూట్ పచ్చడి:-


        బీట్ రూట్---------------2 మీడియం సైజు
       చింతకాయలు -----------1/4 కెజి
       పచ్చి మిరప---------8 పెద్దవి
       వెల్లుల్లి---------------------5,6 రెబ్బలు
       నూనె-------------------2స్పూన్లు
       ఉప్పు--------------------చాలినంత
                పోపుకి--మినపపప్పు,శనగపప్పు, ఆవాలు,కరివేపాకు, ఇంగువ
            ముందుగా పచ్చి మిరప కాయలు 1 స్పూను నూనె లో వేయించుకోవాలి.బీట్రూట్ తోలుతీసి  కోరి పెట్టుకోవాలి.ఈ రోజుల్లో పచ్చి చింతకాయలు బాగా వస్తాయి. వాటిని ఒక పావు తీసుకొని కట్ చేసుకొని లోపలున్న గింజ తీసివేయాలి.తరువాత మిక్సీలో పచ్చి మిరప చింతకాయలు ముక్కలు కోరిపెట్టుకున్న బీట్రూట్ వెల్లుల్లి చాలినంత ఉప్పు వేసి తిప్పుకోవాలి.దానిని గిన్నెలోకి తీసుకొని ఇంగువ కరివేపాకు తో పోపు పెట్టుకోవాలి. అంతే నోరూరించే బీట్  రూట్  పచ్చడి రెడీ.

Sunday, January 11, 2015

సొరకాయమసాలా:--


        గుండ్రటి సొరకాయ----------------చిన్నది 1
        చింత పండు.         -----------------చిన్న నిమ్మకాయంత
        ఉల్లి పాయలు----------------------------3
        పచ్చి మిరప----------------------2
        నూనె---------------------------------5టబుల్ స్పూనులు
        అల్లం-----------------------------------చిన్న ముక్క
        వెల్లుల్లి----------------------------------4,5రెబ్బలు
       కారం-------------------------------11/2టబుల్ స్పూనులు
       ఉప్పు ---------------------------------తగినంత
       లవంగాలు--------------------------4
       చెక్క-------------------------------చిన్నముక్క
     పోపుకి-------------------------------మినపపప్పు,ఆవాలు,జీర
      కొత్తిమీర,కరివేపాకు----------కొంచెం
                      దీనికి బాగా లేత సొరకాయ అయితే బాగుంటుంది.అప్పటికప్పుడు దొడ్లొ కోసిన సొరకాయ అయితే చెక్కు కూడా తీయక్కర లేదు.ఆ కాయని తీసుకొని కొంచెం లావుపాటి సూదితో కాయంతా గుచ్చి ఉప్పు రాసి ఒక అరగంట పక్కన పెట్టాలి.ఈ లోపు ఉల్లి, పచ్చి మిర్చి సన్నగా తరుగుకొని పెట్టుకోవాలి.అల్లం,వెల్లుల్లి,లవంగాలు,చెక్క మిక్సీ వేసుకోవాలి.అరగంట అయిన తరువాత సొరకాయ 4అంగుళాల సైజులో పెధ్ధ ముక్కలు గా కోసుకోవాలి.

      తరువాత స్టౌ మీద ప్రెషర్ పాన్ పెట్టుకొని  నూనె వేసి కాగాక పోపు దినుసులు,కరివేపాకు ,ఉల్లి పాయ ముక్కలు వేసి వేయించాలి.అది వేగాక సొరకాయ ముక్కలు కూడా కొంచెం సేపు నూనెలో వేగనివ్వాలి.అప్పుడు వెల్లుల్లి పేష్ట్ కారం ఉప్పు వేసి రెండు సార్లు తిప్పి చిక్కగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసు పొయ్యలి.పన్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచి కట్టేయాలి.మూత తీసి నాక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
           చేపల పులుసు రుచి వస్తుంది.మసాలా తినని వారు కొధ్ధి గా ఆవ పిండి జల్లుకోవచ్చు.దీనిని ఆవ పెట్టిన కూర అంటారు.
        

Friday, January 9, 2015

మీకు తెలుసా?
    జన గణ మన----రవీంద్ర నాధ ఠాకూర్
    వందే మాతరం----బకిం చంద్ర చటర్జీ
    మాతెలుగు తల్లికి---- శంకరంబాడి 
    దేశ మంటే మట్టి కాదోయ్---గురజాడ
           ఇవన్నీ దాదాపుగా అందరికీ తెలుసు.మరి ప్రతి రోజూ పాఠ శాలలో చెప్పుకునే " భారత దేశము నా మాతృభూమి భారతీయు లందరూ---------"ఈ  ప్రతిగ్ఞ్  ఎవరు రాసారో మీకు తెలుసా?ఇదిగో చూడండి. ఆయనే ఈయన--.

Saturday, January 3, 2015

నా చేతి పని:--


         చీర మీద నేను చేసిన ఎంబ్రాయిడరీ వర్క్.

మంచిమాట:--


         ప్రపంచం ఆధునిక మాధ్యమాలతో ఒకటిగా కనిపిస్తుంది కానీ  మన సులు మాత్రం ఇరుకైపోతున్నాయి.ఎక్కువ శాతం మనుషులు  స్నేహాలు,మాటలు లాభ నష్టాల బేరీజుతో నడుస్తున్నయి.ఆ క్షణానికి ఎవరితో అవసరమో వారే ఆత్మీయులనుకునే అంట సంకుచిత మైపోతోంది.అంతస్తులు ఆర్భాటాలు మారుతున్న కొధ్ధీ స్నేహాలు కూడా మారిపోతూ ఉంటాయి.అది మంచిది కాదు.మనల్ని మనగా చూస్తూ మన బలాల్ని బలహీనతల్ని సమానం గా స్వీకరించే వారే నిజమైన స్నేహితులు.అంతస్తుల తారతమ్యాలు ఉండవు.కృష్ణుడు కుచేలుని స్నేహితునిగా ఆదరించిన రీతిగా.

Thursday, January 1, 2015

మంచి మాట


          మనం ఏదైనా విజయం సాధించి నపుడు అంతా మన నైపుణ్యమని,మన ప్రతిభ అని  అహంభావాన్ని ప్రదర్సిస్తాము.అదే పరాజయాన్ని పొందితే దానికి  కారణాలుగా  వ్యక్తులను పరిస్థితులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తాము.కానీ విజయానికి కారణమైన వ్యక్తులను,పరిస్థితులను స్మరించుకొని,పరాజయానికి తన తప్పిదాలు కారణం గా భావించే వారు వివేకవంతులు.