Wednesday, August 26, 2015

ఉండవల్లిగుహలు


   
           రాజుల కాలం లో గుహలలో చిత్రాలు వేయడం, శిల్పాలు చెక్కటం ఎక్కువగా కనిపిస్తుంది.అలాంటివే విజయవాడకు 6కి.మి లలో ఉన్న ఉండవల్లి గుహలు.4,5 శతాబ్దుల కాలం లో విష్ణు కుండినిలకు చెందినవని చరిత్రకారుల అభిప్రాయం.బౌధ్ధ శిల్పకళా రీతులు కంపించడాన్ని బట్టి ,బౌధ్ధులకు విశ్రాంత మందిరాలుగా ఉండెవేమోనని ఒక అభిప్రాయం.
      ఒకే పర్వతం లో 4అంతస్తులుగా నిర్మించ బడినవి.ఇవి ఇసుక రాయితో కూడినది.వివిధ దేవతా ప్రతిమలు,త్రి మూర్తుల శిల్పాలు ఏక శిలా నిర్మితాలు.రెండవ అంతస్తులో గ్రానైట్ ఏకశిలలో 20అడుగుల విష్ణువు యొక్క శయన భంగిమ  ఉన్నది .ఈయనని అనంత పద్మనాభ స్వామి అంటారు.బయటి వైపున సప్తఋషుల విగ్రహాలు కలవు.పై నుంచి చూస్తే పచ్చటి వరి పైరులు కనువిందు చేస్తాయి.ఇది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పరిధి లోకి వస్తోంది.అన్ని రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్న  వీటిని తప్పనిసరిగా చూడదగిన ప్రదేశము.





Saturday, August 22, 2015

రొయ్యలవేపుడు


   
   రొయ్యలు-------------------1/2కెజి
   ఉల్లిపాయలు---------------2
   వెల్లుల్లి---------------------3రెబ్బలు
   అల్లం----------------------చిన్న ముక్క
   పచ్చిమిరప----------3
   కారం------------------11/2స్పూను
   పసుపు-----------------1/4స్పూను
   ధనియాలు------------1స్పూను
   సోంపు పొడి---------1/2స్పూను
   కొబ్బరి కోరు---------2స్పూన్లు
    గరం మసాలా---1స్పూను
    నిమ్మరసం లేదా పెరుగు---------1స్పూను
     నూనె-----------------11/2స్పూను
     కరివేపాకు----------2రెమ్మ్మలు
    ఊప్పు------రుచికి సరిపోను
               శుభ్రం గా కడిగిన రొయ్యలకు అల్లం పచ్చి మిర్చి పేష్టు,కారం,ఉప్పు,పసుపు,నిమ్మరసం కలిపి 15 నిముషాలు నానబెట్టాలి.తరువాత 1/4 కప్పు నీళ్ళు పోసి 10 నిముషాలు ఉడికించాలి.తరువాత ష్టౌ  మీద బాణిలి పెట్టి నూనె వేసి కాగినాక ముందు సన్నగా తరిగిన వెల్లుల్లి,ఉల్లి పాయ ముక్కలు  కరివేపాకు,ఎర్రగా మారేవరకు వేయించాలి.కసూరి మేథి కూడా వేయవచ్చు.అందులో ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ధనియాల పొడి, గరం మసాలా,ఉప్పు,కొబ్బరి కోరు వేసి 5నిముషాలు ఉంచి ష్టౌ కట్టేయాలి.ఘుమ ఘుమ లాడే రొయ్యల వేపుడు రెడీ!
   

Friday, August 21, 2015

ఆమె


  ఉదయం విరిసిన
  పూవులా ఎద తలుపును తడుతుందా
  సంజె వేళ కల్లా
  వసివాడిన విరిబోణి అవుతుంది
 
   సవ్యసాచి లా
  ఒక చేత్తో కూరల సంచి
  మరో చేతిలో ఆఫీసు ఫీళ్ళ్తో
  కుటుంబ కురుక్షేత్రానికి
  విజయ దరహాస మౌతుంది.

  అభిమన్యుడిలా
  బతుకు పద్మవ్యూహము లో
  ఒంటరి పోరాటం చేస్తూ
  ఇంకా న్యాయం చేయలేక పోతున్నాననే
  అసంత్రుప్తితో జీవనయానం చేస్తుంది.

  పెదవులు పై అద్దుకున్న చిరు నవ్వుతో
  గడపలో అడుగు పెడుతూనే
   ద్వి పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి
   విసుగులు,అలకలు,చిరాకులు,పరాకులు
   దరిచేరని కవచ కుండలాలు ధరించిన
   కర్ణుడు అవుతుంది.

   భావుకత్వం తో
   సుందర స్వప్నాల పల్లకిలో
   విహరించిన ఆమె
   యాంత్రిక జీవన సంగ్రామం లో
   శిఖండి అయినది

    భారతీయత నింపుకున్న 
   ఆమె
    మరెవరో కాదు
    సగటు భారతీయ మహిళ.

Monday, August 17, 2015

వంకాయపులుసు


     వంకాయలు------------------1/4కెజి
     టమోట---------------------2
      చిలకడదుంప--------1
     ములక్కాయ----------------1
    ఉల్లిపాయ--------------------1
    పచి మిర్చి --------------2
    చింత పండు----------చిన్న నిమ్మకాయంత
   నూనె-----------------------2స్పూన్లు
    కారం--------------------1స్పూను
    ఉప్పు-------రుచికి సరిపోను
      తిరగమోతకు------ఆవాలు,మినపపప్పు,మెంతులు,శనగపప్పు--1/2,1/2స్పూన్లు
     కరివేపాకు.
           ముందుగా వంకాయల్ని ముక్కలు కోసి నీటిలో వేయాలి.మిగిలిన కూరగాయల్ని కడిగి విడివిడి గా ముక్కలు గా కోసుకోవాలి.స్టౌ మీద గిన్నె పేట్టి నూనె వేసి కాలినాక తిరగమోత దినుసులు కరివేపాకు వేసి,పచ్చి మిర్చి,ఉల్లిపాయ ముక్కలు వేయాలి .కొంచెం వేగినాక టమోటాముక్కలు వేసి అవి కూడా మగ్గినాక వంకాయ ,చిలకడదుంప,ములక్కాయ ముక్కలు ఉప్పు,కారం వేసి బాగా మగ్గినాక చింతపండు పులుసు పోసి చిక్కబడినాక దించుకోవాలి.ఉడ్కేటప్పుడు ఒక1/2స్పూను పంచదార వేస్తే మంచి రుచి వస్తుంది.

Wednesday, August 12, 2015

మినికవితలు



 గుండె
 గుప్పెడంత
 ఆశ
 ఆకాశమంత
 
 ఆమె
 విప్పని ఫజిలైతే
 అతడు
 జవాబు లేని ప్రశ్న అవుతాడు

 మగువ
 మరణ వేదన
 మాధ్యమానికి
 ంఅరో మేత దొరికింది.
 
 వస్తువు
 కొన్న ప్రతి దానికి గ్యారంటీ
 వరుడు
 కోట్లు పోసి కొన్నా లేదు.

  నాడు
  వంశాంకురమని మురిసింది
  నేడు
  వంశ వినాశకుడని బెదిరింది
  పున్నామ నరకం తప్పించే  వాడని
  భ్రమసింది
  నరకమంటే ఇదేనని
  గ్రహించింది.

  *******     ******    *****
  గరిక పూవు కీ
  ఉంది చరిత
  గరీ బోడికీ
  ఉంది భవిత.

****    ******.     *****
  ఉల్లి
 నాడు
 కోసే టప్పుడు కన్నీరు
 నేడు
 కోనేటప్పుడూ కన్నీరు.
*******.    ******.     

Tuesday, August 11, 2015

తెలివితక్కువగాడిద


             రామైఅహ్ అనే వ్యాపారికి  ఒక గాడిద ఉంది.అది ఎప్పుడూ  బధ్ధకం తో పని తప్పించుకోవాలని చూసేది.
         ఒకరోజు రమైఅహ్ వ్యాపార నిమిత్తం ఉప్పు బస్తాలను గాడిద మీద వేసుకొని పట్టణానికి బయలుదేరాడు.ఆ బరువుకి అది మూలుగుతూ నడుస్తోంది.పట్టణానికి వెళ్ళే దారిలో ఉన్న వన్ తెనంత్ దాటుతూ జారి కాలువలో పడిపోయింది.వెంటనే ఉప్పు కరగడం ప్రారంబమైంది.గాడిద ఎలాగో ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకుంది.కొంత ఉప్పు కరిగిపోవడం తో బరువు తగ్గి తేలికగా కులాసాగా గమ్యానికి చేరుకుంది.
         మరునాడు వ్యాపారి మరికొన్ని బస్తాల ఉప్పుని గాడిద మీద వేసాడు.కానీ అది ఆ బరువు ఇబ్బంది అనుకోలా! ఎందుకంటే దానికి బరువు తగ్గించుకొనే యుక్తి తెలిసిందిగా!ఆ రోజు కూడా కాలువలో కి కావాలని జారింది.బరువు తగ్గడం తో సంతోషం గా ప్రయాణం సాగించింది.కాని వ్యాపారి దాని దుర్బుధ్ధిని గ్రహించాడు.దానికి ఎలాగైనా బుధ్ధి చెప్పాలనుకొని మరునాడు బస్తాలను స్పాంజి తో నింపాడు.ఇది తెలియని గాడిద యధాప్రకారం కలువలోకి జారింది. స్పాంజి నీటిని పీల్చుకొని బరువు ఎక్కువ అయ్యింది.ఆ బరువు మోయలేక ఆయాసంతో రొప్పుకుంటూ బయటకు వచ్చింది.ఇంకెప్పుడూ ఇలాంటి దురాలోచన చేయకూడదు అనుకుంది.
  రెలివింగ్ తక్కువ వారు మాత్రమే ఒకే రకమైన మోసాన్ని ఒకటికంటే ఎక్కువ సార్లు చేయాలనుకుంటారు.

Monday, August 10, 2015

తప్పులు


       అన్నిటి కంటె తేలికైన విషయం ఏమిటంటే ఎదుటి వారిలో తప్పులెంచడం.మనం చేసిన తప్పులు ఒప్పులుగా ను అదే ఎదుటి వారు చేస్తే తప్పులు గాను కనిపిస్తాయి.
   "తప్పులెన్ను వారు తండోప తండంబు
    లుర్వి జనులకెల్ల నుండు తప్పు
    తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగరు"---అని వేమన ఏనాడో చేప్పాడు.
        కొంతమంది తాము తప్పు చేసినా ఎదుటి వారి మీద నెట్టివేస్తారు.తప్పు చేయడం మానవాళికి సహజం .తమ తప్పు తాము తెలుసుకొని దిద్దు కొనేవాడే విజ్ఞుడు.
     కాసుల పురుషోత్తమ కవి వ్రాసిన "నరసిమ్హ శతకము"లోని ఈ పద్యము ఎ తప్పులకు ఎవరు బాధ్యులో చక్కగా చెప్పాడు.

         పసరంబు పంజైనబసుల కాపరి తప్పు
                  ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు
        భార్య గయ్యాలైన బ్రాణ నాధుని తప్పు
                  తనయుడు దుడుకైన దండ్రి తప్పు
        సైన్యంబు చెదిరిన సైన్య నాధుని తప్పు
                  కూతురు చెడుగైన మాత తప్పు
        అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు
                 దంతి మదించ మావంతు తప్పు
        ఇట్టి తప్పులెఱుంగక యిచ్చ వచ్చు
       నటుల మెలగుదు రిప్పుడీ యనుని జనులు
       భూషణ వికాస!శ్రీ ధర్మ పురి నివాస!
       దుష్ట సమ్హార!నరసిమ్హ!దురితదూర! 
               శతక పద్యాలు ఆ నటికి,ఈ నాటికి,ఏ నాటికీ అనుసరణీయమే!

Sunday, August 9, 2015

పుదీనాపచ్చడి



  పుదీనా--------------------2కట్టలు
  ఎండు మిరప కాయలు-----5
   మినపపప్పు-------------2స్పూన్లు
   శనగపప్పు-------------2స్పూన్లు
   జీర---------------------------1స్పూను
  వెల్లుల్లి-------------------------5రెబ్బలు
  చింత పండు---------------2రెబ్బలు
   నూనె-----------------------1స్పూను
   ఉప్పు-------రుచికి సరిపోను
         పుదీనా ముదురు కాడలు తీసివేసి ఆకులు విడదీసి కడిగి పెట్టుకోవాలి.బాణిలి లో ఒక స్పూను నూనె వేసి మిరప కాయలు వేయించి తీసి,మినపపప్పు,శనగపప్పు,జీర వేసి దోరగా వేయించి తీయాలి.దనిలోనే పుదీనా వేసి వేయించాలి.కొంచెము ఆరిన తరువాత పుదీనా తప్ప దినుసులు,చింతపండు,వెల్లుల్లి,ఉప్పు వేసి మిక్సీ పట్టి  అవి నలిగినాక పుదీనా వేసి తిప్పాలి.పుదీనా పచ్చడి రెడీ.రుచికి రుచీ,ఆరోగ్యానికీ మంచిది.

Saturday, August 8, 2015

కార్యసాధకుడు


     ఉత్సాహో బలవా నార్య!
     నా స్త్య్ ఉత్సాహం త్పరం బలం
     సోత్సాహ స్వాస్తి లోకేస్మిన్
     న కించిదపి దుర్లభం||
             సీతాపహరణం జరిగిన తరువాత మానసికం గా క్రుంగిన అన్నను చూచి లక్ష్మణుడు చెప్పిన శ్లోకం ఇది.
       "ఆర్యా!ఉత్సాహం చాల బలమైనది.దాన్ని మించిన బలం లేదు.ఉత్సాహవంతుడికి లోకం లో అసాధ్యమైనది కూడా ఏదీ లేదు."అని భావం.ప్రతి కార్యసాధకుడికి అనుసరణీయమైన మార్గము.
    
   ఒకచొ నేలను బవళించు,నొకచో నొప్పారు బూసెజ్జపై
   నొకచో శాకములారగించు,నొకచో నుత్కృష్ట శాల్యోదనం
   బొకచో బొంత ధరించు,నొక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి,లె
   క్కకు రానీయడు,కార్యసాధకుడు దూఃఖంబున్,సుఖంబున్ మదిన్!
             కార్యాన్ని సాధించాలను కున్న వాడు నేల మీదైనా,పూల పాంపు అయినా ఒకే విధం గా నిద్రిస్తాడు.కూర గాయలైనా ,విందు భోజనమైనా ఒకే విధంగా ఆరగిస్తాడు.బొంతనైనా,పట్టు వస్త్రాలనైనా ఒకే విధంగా ధరిస్తాడు.విచారాన్ని కాని,సంతోషాన్ని కాని మనసులోకి రానీయడు.పని జరగడం ముఖ్యం. కష్టాన్ని, సుఖాన్ని  కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు సమానం గా చూస్తాడని భావము.
            ఆటంకాలు ఎదురైతే మధ్యలో వదిలేసే వాడు మధ్యముడు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా తొలగించుకుంటూ కార్యాన్ని సాధించే వాడు ఉత్తముడు.
     ఉత్సాహం,కార్యదీక్ష,పట్టుదల ఉంటే  విజయం మనదే!

Friday, August 7, 2015

మినీకవితలు



   పాపాయి
   బోసి నవ్వులు
   ఇల్లంతా
   వెన్నెల వెలుగులు

   పల్లె
   పలచ బడింది
   పట్నం
   చిక్క బడింది.
  
   వాడు
   పశువయ్యాడు
   ఆమె
   గ్రాసమయ్యింది.

   మౌనం
   మాట్లాడుతుంటే
   శబ్దం
   మూగబోతుంది.

   అక్షరం
   అణ్వాయుధమైతే
   జ్ఞానం 
   అనంత మౌతుంది.

  కన్నీళ్ళు 
  భగవంతునికి అర్జీలు
  పరిశీలిస్తాడో?
  బుట్టదాఖలు చేస్తాడో?
   

Wednesday, August 5, 2015

ముందుచూపు


      మనిషికి ముందు చూపు చాలా అవసరం.లేకపోతే ఇబ్బందులు పడతాడు.ఈ శ్లోకం చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.
      "వర్షార్ధ మష్టౌ ప్రయతేత మాసాన్
        నిశార్ధ మర్ధం దివసే యతేత |
        వార్ధక్య హేతో ర్వయసా నవేన 
        పరత్ర హేతో రిహజన్మనాచ||"
                వర్షం లో బయటకు వెళ్ళలేము కనుక అప్పటికి కావలసినవి మిగిలిన ఎనిమిది మాసాల లోనే సమకూర్చు కోవాలి.రాత్రి వేళ చీకటి కనుక పగటి పూట పొందుపరచుకోవాలి.వార్ధక్యం లో శక్తి సన్నగిల్లుతుంది కనుక ముసలితనం లో ప్రశాంతం గా జీవించ డానికి వయసులో ఉండగానే సంపాదించు కోవాలి.పరలోకానికి కావలిసిన పుణ్యాన్ని ఇహలోకంలోనే సంపాదించుకోవాలి.
              ఈ శ్లోకం జీవితం గురించి  తెలిపితే "మూడు చేపల కధ" ముందు చూపు,సమయస్ఫూర్తి లేకపోతే దీర్ఘ సూత్రుడు లా ప్రాణాలు కోల్పోతారు.సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడులా తప్పించు కోవచ్చు.దీర్ఘ దర్సి కి ముందు చూపు ఉండటం వలన తనను తాను కాపాడుకో గలిగింది.