చదువని వాడజ్ఞుం డగు
చదివిన సద సద్వివేక చతురత కలుగున్---అన్నారు పోతన
చదువు వలన జ్ఞానం లభిస్తుంది.ఇది రెండు రకాలు.పుస్తక జ్ఞానము,అనుభవ జ్ఞానము.పుస్తకాల వల్ల వచ్చేది పుస్తక జ్ఞానము.దీని వలన డిగ్రీలు వస్తాయి.వాడు బాగా చదువు కున్నాడురా. చాలా తెలివి కలవాడు అంటూ ఉంటారు.కానీ చదువుకీ తెలివితేటలకు,ప్రవర్తనకు సంబంధమే లేదు.చదువుకొని ఉన్నత ఉద్యోగాలు,పదవులలో ఉండి కూడా సంస్కార హీనంగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాము.ఇలాంటి వారిని చూసే "చదివినోడి కనా చాకలాడే మేలు "-అనే సామెత వచ్చి ఉంటుంది.
ఎవరితో ఎలా నడుచుకోవాలో,ఎలా మాట్లాడాలో నేర్పడానికి ఏ విశ్వవిద్యాలయం లేదు.లౌకిక జ్ఞానమనేది కుటుంబ సభ్యులు,స్నేహితులు,పరిసరాలు,సమాజం నుండి నేర్చుకుంటాము."ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడటమే "-విజ్ఞత.జీవితానుభవాలను మించిన పాఠాలు లేవు.జీవితాంతము నేర్చుకుంటూనే ఉంటాము.పోతన కూడా చదువు వల్ల సత్,అసత్ వివేకము కలుగుతుంది అని చెప్పాడు.
"ఏమి చదివి పక్షులు పైకెగుర గల్గెను
ఏ చదువు వల్ల చేప పిల్లలీద గల్గెనూ
చదువులతో పనియేమి హృదయమున్న చాలు
కాగితం పూల ఖన్న గరిక పూలు మేలు"--
ఎంత చదువుకున్నా వివేకము,యుక్తాయుక్త విచక్షణ లేనప్పుడు అది వాసన లేని కాగితం పూల లాగా నిరర్ధకమే కదా!రాంకుల వేట ,పతకాల పోరులో ఒక విదుర నీతి,సుమతి,వేమన శతకాలలోని విలువలు నీతులు ఎంత మంది కి తెలుసు.వాటిని తెలియచెప్పాల్సిన తల్లిదండ్రులు,గురువు లకు ఓపిక,తీరిక ఎక్కడిది?"అన్నమయ్య అంటే నాగార్జున అని,చత్రపతి ప్రభాస్ అనే విధంగా గానే ఉంటాయి వారి సమాధానాలు.
బ్రతుకు తెరువుకి చదువుకొని డిగ్రీలు పొందాలి.ఉన్నత జీవన నడవడికి జీవిత పాఠాలనూ నేర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలి.ఉన్నత విద్యనభ్యసించి వ్యసనాల పాలై దొగలుగా,చెయిన్ స్నాచర్స్ గా మారి కుటుంబానికి,సమాజానికి యువత రాచ పుండుగా మారకుండా విలువలతో కూడిన చదువులు చదవాలని నా అభిలాష.
No comments:
Post a Comment