అనుబంధాలు:-
"అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకం
మనుషులు ఆడుకొనే వింత నాటకం"---అన్నాడు ఒక మహా కవి.
నిజమే!
ఆత్మీయత లేని బంధం మరీ బూటకం.
మొన్నీ మధ్య ఒక మిత్రురాలి భర్త చనిపోతే పలకరిధ్ధామని వెళ్ళాను.ఇధ్ధరూ పెధ్ధ వయసు వారే.ఆమెకు 83,ఆయనకు 92 ఉంటాయి.అదే సమయం లో వారికి తెలిసినాయన వచ్చారు.ఆయన ఆమెను " మీరు ఒంటరిగా భావిస్తున్నారా?"అని అడిగారు.దానికి ఆమె "ఇది ఈ రోజు కొత్తగా వచ్చిన ఒంటరి తనం కాదు.ముందు నుంచీ ఉన్నదే"అని నిర్లిప్తంగా సమాధానం ఇచ్చింది.ఆయన ఆస్చర్యం గా చూశారు. ముందు నుంచీ ఆమె గురించి తెలిసిన నేను ఆస్చర్య పోలేదు.
ఆమె పేరు జానకి.11సంవత్సరాలకే పెళ్ళైంది.కొద్ది రోజులకే ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు.అక్కడ నుంచి వచ్చి వెళ్ళె సందర్భంగా జరిగిన సంఘటన గుర్తుగా ఒక బిడ్డ కలిగాడు.ఈ సారివెళ్ళినవాడు మరల రాలేదు.కుటుంబానికి పెద్ద కొడుకు అవడం తో కొడుకు భవిష్యత్తే కాక అత్తింటి వారి బాధ్యత కూడ ఆమెపై పడింది.కాలక్షేపానికి చదువుకున్న హింధీ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం తెచిపెట్టింది.పిల్లడి చదువు,కుటుంబ బాధ్యతలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వచ్చింది.ఆ మహానుభావుడు ఉత్తరాలు వాళ్ళ నాన్న కు వ్రాసేవాడు. అందులో ఒక ముక్క కూడా భార్యా పిల్లల గురించి ఉండేది కాదు.
కొడుకు పెళ్ళైంది,ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాడు.ఉద్యోగమే తోడుగా కొన్నాళ్ళు గడిపింది.ఆమెకు రిటైర్మెంట్ వయస్సు వచ్చింది.ఈలోపు ఆయనకు వయసు వచ్చి,సోదరుల ప్రోద్బలంతోను ఆమె దగ్గర కు చేరాడు.ఆయనకు డిగ్రీలు లేవు కాని తెలుగు,సంస్కృతం,హింధీ వచ్చు.వేదాభ్యసనం కూడా చేసాడు.ఆశ్రమంలో నేర్చుకున్న ఆయుర్వేద విద్య పైన పుస్తకాలపైన వ్యాసాలు వ్రాస్తూ కాలక్షేపం చేసేవాడు. ఆయన వచ్చినా ఆమె బాధ్యత తీరలేదు కాని పెరిగింది.అన్నీ ఆవిడే చూసుకోవలసి వచ్చేది.మంచీ చెడూ మాట్లాడుకోవడం కాని ,కబుర్లు చెప్పడం కాని ఉండేది కాదు.ఇద్దరు అపరిచితులు కర్మ వశాత్తు ఒక ఇంట్లో ఉన్నట్లు ఉండేది.అలాంటప్పుడు ఆమె మనస్సులో భర్త అన్న భావం కాని,ఆత్మీయత కాని ఎలా కలుగుతుంది. అలా కాక ఎలా మాట్లాడుతుంది.
ఏ బంద్దమైనా మనసుకు దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేని లోటును అనుభవిస్తాము.భార్య అయినా ,భర్త అయినా,బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా మనకు వారు మానసికంగా ఎంత దగ్గరైనారు అనే దాన్ని బట్టి మనం బాధపడటం,లోటును భావించడం ఉంటుంది.బరువులు, బాధ్యతలు పంచుకోకపోయినా మానసికం గా తోడు అయినప్పుడు ఆళోటు పూడ్చుకోలేనిది.జీవితకాలం మానసికంగా,బాధ్యతల బరువులోను ఒంటరితనం అనుభవించిన ఆమె అలాకాక ఇంకెలా స్పందిన్స్తుంది అనిపించింది.
No comments:
Post a Comment