Monday, December 14, 2015

సంకీర్తన


    
      గీత గొవింద కారుడిగా ప్రశస్తి పొందినవాడు జయదేవుడు.ఆయన కుటుంబ సంబంధ పదాలతో దశావతారాన్ని పోలుస్తూ చెప్పిన తెలుగు సంకీర్తనం లోని  సరస ప్రయోగ చాతుర్యం,మాధుర్యం,లయ మనసుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి.
         మా పాప మా వల్లు మత్స్యావతారం
         కూర్చున్న తాతల్లు కూర్మావతారం
         వరసైన బావల్లు వరహావతారం
         నట్టింట నాయత్త నరసిమ్హావతారం
         వాసి గల బొట్టెల్లు వామనావతారం
         పరమ గురుదేవ పరశురామావతారం
         రంజించు మామయ్య రామావతారం
         బంటైన బంధువులు బలరామావతారం
         బుధ్ధి తో మా చిట్టి బుధ్ధావతారం
         కలివిడితో మా యన్న కల్క్యావతారం
         వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి
         చిట్టి నా కన్న శ్రీ కృష్ణావతారం.
           

Sunday, December 13, 2015

బీట్ రూట్ రసం



   బీట్ రూట్------------------చిన్నది1
   టమోటాలు---------------2
   ఉల్లి----------------------------1
   అల్లం-----------------------చిన్న ముక్క
   వెల్లుల్లి----------------------2 రెబ్బలు
   ఉప్పు---రుచికి సరిపోను
   రసం పొడి--------------1స్పూను
   నూనె--------------------1స్పూను
   కరివేపాకు,కొతిమీర,తిరగమోత దినుసులు
   పులుపు చాల దనుకొనే వారు ఒక రెబ్బ చింత పండు వేసుకోవచ్చు.
             ముందుగా బీట్ రూట్ చెక్కు తీసి అది ,టమోటా ముక్కలుగా తరిగి ,అల్లము ,వెల్లుల్లి కూడా వేసి మెత్తగా ఉడికించి మిక్సీ లో వేసి పేష్టు చేసుకోవాలి.తరువాత స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగినాక తిరగమోత దినుసులు ,కరివేపాకు,సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేగినాక ముందుగా చేసిపెట్టుకున్న పేష్టు వేసి పలచగా అయ్యేలా నీరు పోయాలి.అది కళాపెళా కాగుతుండగా రసం పొడి ఉప్పు వేసి బాగా కాగినాక కొతిమీర వేసి దించుకోవాలి.వెరైటీ కోరుకునేవారు ఈ రసం ప్రయత్నించండి.

Sunday, November 29, 2015

గురజాడ


     
      ఆంధ్ర సాహిత్య లోకానికి అరుణోదయం
      యుగకర్త గురజాడ మఓదయం
      కొత్తపాతల మేలు కలయికగా
      క్రొమ్మెరుంగులు చిమ్ముతూ
      నవయుగ వైతాళికుడిగా
      జాతిని నడిపిస్తూ
      మానవత్వపు పరిమళాలు
      వెదజల్లావు
      దేశమంటే మట్టి కాదు 
      మనుషులే నంటూ
      సొంత లాభము కొంత మానుకొని
      పొరుగు వాడికి తోడు పడమన్నావు
      జాతి బంధములన్న గొలుసులు
      జారిపోయి
      మతాలన్నీ మాసిపోయి
      ఙ్ఞాన మొక్కటి నిలచి 
      వెలగాలని
       వర్ణభేదాలు కల్లలై
      యెల్లలోకము ఒక్క ఇల్లుగా
      చేసుకొని
      జీవించాలని కోరావు
      తెలుగు కవితను
       ముత్యాల సరాలతో అలంకరించి
       కొయ్య బొమ్మలే మెచ్చు కళ్ళకు
       కోమలులు సౌరెక్కునా యని
      నిలదీశావు
      ప్రజల భాషనే
      కవిత్వ భాష గా"దిద్దు బాటు"చేసి
      కష్ట సుఖాల సారమెరిగి
      మంచియన్నది మాలయైతే
     మాల నేనౌతా నని
     సమాజ శ్రేయస్సే"దీక్షా విధి"గా
     భావించిన
     సర్వ మానవ హితుడా!
    తెలుగు సాహితీ జగత్తులో
    శతాబ్ద కాలంగా
    వెలుగులీనుతున్న
    ఓ కవి భాస్కరుడా!
   నీ కిదే నా నివాళి.

Tuesday, November 24, 2015

అలసంద గారెలు


     అలసందలు-------------1/4కెజి
    పచ్చి మిర్చి---------6
    అల్లం---------------------కొంచెం
    ఝీర----------------------1స్పూను
    ఉల్లి పాయ---------------1
    ఉప్పు-------రుచికి సరిపోను
   నూనె------డీప్ ఫ్రై కి సరిపోను
                అలసందలు 5,6 గంటలు నానబెట్టి,అల్లం,పచ్చిమిర్చి వేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి.అందులో జీర,ఉల్లి పాయ సన్నగా తరిగి వేసుకోవాలి.అన్నీ కలిపి చిన్న గారెలుగా చేసి నూనె లో డీప్ ఫ్రై చేయాలి.వేడి,వేడి గారెలు రెడీ!
   
   

ఆశ


   నేను ఒంటరి జీవిని
   ప్రేమ కోసం వెతుకుతూ ప్రార్ధిస్తున్నాను
   నన్ను ప్రేమించి
   నా కోసం జీవించే వారు
   ఒకరు కావాలని
   వేడుకుంటూనే ఉన్నాను
   నన్ను ఆనందం గా,సుఖం గా ఉంచాలని
   కష్టాల సుడిగుండాలలో నడుస్తుంటే
   జీవన పద్మ వ్యూహం లో
   నన్ను ఒంటరిగా వదలకూడదని
   కోరుకుంటూనే ఉన్నాను.
   కాలం కరిగిపోతూనే ఉంది
   నేను ఎందు కోసం వెదుకుతున్నానో
   దేనికోసం జాగ్రత్త పడుతున్నానో
   ఎప్పుడూ మరచిపోలేదు.
   చివరకు
   అదృష్టం నా తలుపు తట్టింది
   నా ప్రయాణం లో
   ఒక అపురూప వ్యక్తి తారస పడ్డాడు
    అతనే ఆత్మ,భాగస్వామి,స్నేహితుడు
    అతని ప్రేమకు లోతులు లేవు
    ఓర్పుకు ఎల్లలు లేవు
    అందుకే
   ఏదో జరిగి పోతుందనే భయం తో
   జీవించ వద్దు
   ఆలస్యంగా నైనా
   భగవంతుడు నీకు కావాల్సింది ఇస్తాడు
   వేచి ఉండటమే నీ పని.
   

Friday, November 20, 2015

తెలుగు


      అనురాగం పండించి,
      ఆత్మీయత కలబోసి
      ఇంగిత ఙ్ఞానం కలిగి
     ఈసు ఇసుమంత లేక
     ఉజ్జ్వలం గా వెలుగుతూ
     ఊకువ గా నిలచి
     ఎలతోట విరిసిన
     ఏలుబడి భాష
     ఐచ్చికము గా నేర్వ కుతూహల బడు
     ఒప్పు భాషలందెల్ల ఉత్తమంబుగా
     ఓజోమయమై అలరారు భాష
     ఔచిత్యము నెరిగి
     అందలము నెక్కించ
     తడబాటు పొందెద వేలా
     ఓ తెలుగు వాడా!
  
  ఊకువ=ఆధారం.
     

     

Tuesday, November 3, 2015

ఫలూద



   ఫాలు----------1కప్పు
   సేమ్యా------1/4కప్పు
   రోజ్ సిరప్------3టబుల్ స్పూన్లు
   సబ్జా గింజలు---1టబుల్ స్పూను
   వెనిల్లా ఇచె క్రీం---1-2స్కూప్స్
       సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తీసి పక్కన బెట్టాలి.పాలలో సేమ్యా వేసి ఉడికించి చల్లార నివ్వాలి.
      ఒక గ్లాసు తీసుకొని ముందుగా రోజ్ సిరప్ వేసి పైన నానిన సబ్జా గింజలు ఆ పైన ఉడికించిన సేమ్యా పైన వెనిల్లా ఇచె క్రీం వేసి నట్స్ చెర్రీస్ తో అలంకరించాలి.లేయర్స్గా వేయడం లోనే మన ప్రతిభ కనిపిస్తుంది.నోరూరించే ఫలూదా రెడీ.


Monday, October 5, 2015

ఆభిఙ్ఞాన శాకుంతలం


  
       "కావ్యేషు నాటకం రమ్యం "అని అలంకారికుల నిర్వచనం.ఆ నాటకాలలో  కాళిదాసు విరచితమైన  ఉత్తమమైనదని అందులో చతుర్ధాంకము ఆ అంకములోని నాలుగు శ్లోకములు కావ్య జగత్తులో ప్రసిధ్ధమైనవి.కాళిదాసు నాటకాన్ని 'కందుకూరి వీరేశలింగం తెలుగు లోకి అనువదించారు.ఆ ప్రసిధ్ధ శ్లోకాలను తెలుగు లోకి ఎలా అనువాదము చేసారో చూధ్ధాము.
     సందర్భము శకుంతలను కణ్వుడు అత్త వారింటికి పంపే టప్పుడు తండ్రిగా ఆయన పొందే వేదన బిడ్డకు ఆయన చెప్పే సుధ్ధులు ఆ తరానికే కాదు ఏ తరానికీ ఆచరణ యోగ్యమే!

 1.కొందలమందె డెందము శకుంతల తానిపుడెగునం చయో!
    క్రందుగ బాష్ప రోధమున గంఠమునుం జెడె;దృష్టి మాంద్యముం 
    బొందె;నొకింతపెంచిన తపోధనులే యిటుకుంద,నెంతగా 
    గుందుదురో తమంత గను కూతుల బాయు గృహస్థు లక్కటా!

2. ఎవతె జలంబు మీకిడక యెన్నడు ద్రాగదు తాను ముందుగా 
    నెవరితె ప్రేమచే జదుమ దీప్సిత భూషణమయ్యు మీ చిగు 
    ళ్ళెవతెకు మీరు తొల్త ననలెత్తుట పండువుగాగనుండు నా 
    ప్రవిమల గాత్రి యేగు బతి పజ్జకు నందఱ్నుజ్ఞ యీయరే.

3.మమ్ములనత్తపోధనుల,మాన్య భవత్కులమున్,స్వబంధులన్ 
   సమ్మతి వేడ కీమె యెటొ సల్పిన నీపై కూర్మి,నెంచి మా 
   కొమ్మను నేలుకొమ్మ సరి కొమ్మలతో సమ గౌరవంబునన్;
   బిమ్మటిదెల్లభాగ్యమగు;పేర్కొనరాదది యింతి బంధువుల్.

4.గురులకు సేవజేయు మనుగుంగతి జూడుము నీసపత్నులన్ 
   వరుడలుక వహించినను భర్తృవిరుధ్ధవుగాకు మీసునన్;
   పరిజనులందు జూపుము కృపం గడు;బొందకు భాగ్య గర్వమున్;
   తిరిగిన నిట్లు,కాంతురు సతీత్వము కాంతలు;నింద్య లొండుచోన్.

             మొదటి పద్యము కూతురుని అత్తవారింటికి పంపే సాధారణ తండ్రి వేదన,రెండవపద్యము అప్పటి వరకు ఆమె సన్నిహితముగా మెలిగిన అందరి వధ్ధ నుండి అనుమతి తీసుకోవడం వర్ణించారు.
            ఇక మూడవ ,నాలుగవ పద్యాలలో కొత్తగా అత్తవారింటికి వెళ్ళిన ఆడపీల్ల ఎలా మెలగాలో వివరంగా వర్ణించారు.
    

Sunday, September 27, 2015

వైకుంఠపురం



       ఉండవల్లికి అమరావతికి మధ్యలో ఉంటుంది.మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3గంటలు అయినది.కొండ మీద గుడి తీసిలేదు.కింద ఉన్న గుడి కూడా మూసి ఉన్నవి  కాని గ్రామస్తులు మమ్మల్ని చూసి పూజారి గారిని పిలుచుకు వచ్చారు.ఆయన గుడి ప్రాశస్త్యాన్ని చక్కగా చెప్పారు.పూర్తిగా గుర్తు లేదు. కాని ప్రాచీనమైన ఆలయమని 2000 సంవత్సరాల క్రితమే కట్టబడినదని చెప్పారు.కొండపైన విగ్రహం చిన్నగా ఉంటుందని అన్నారు.గ్రామం చక్కటి సిమెంట్ రోడ్లతో ప్రశాంతంగా ఉన్నది.ఇది కూడా రాజధాని పరిధి లోకి వస్తుంది.


Saturday, September 26, 2015

వింత అలవాట్లు


     మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో వారి చేష్టలు అన్ని రకాలుగా ఉంటాయి.ఊతపదాలతో  కొందరు వివిధ చేష్టలతో మరికొందరు వింతగా కనిపిస్తారు.
        కొంతమంది చేతులూపుతూ మాట్లాడతారు.మర్కొందరు తలలూపుతూ,కళ్ళెగరిస్తూ,కళ్ళుమూసుకొని,గోళ్ళుకొరుకుతూ,గడ్డం రాసుకుంటూ మాట్లాడతారు.ఎదుటివారి వంక చూడకుండా తలదించుకొని తప్పుచేసినవారిలాగా మాట్లాడే వారు మరి కొందరు.మిగతావాటితో సర్దుకుపోవచ్చు గాని చేతులూపేవారితో ఇబ్బందే!ఆ ఊపులో చేయొచ్చి ఎక్కడ తగులుతుందో తెలియదు.పక్కనగాని,ఎదుటగాని ఏవైనా వస్తువులుంటే అవి స్థానభ్రంశం చెందడమో,రూపం కోల్పోవడమో జరుగుతుంది.మరీ బిగదీసుకుపోయి పాఠం అప్పజెప్పినట్లు మాట్లాడినా బాగోదు.ఇంకా కొంతమంది అవసరమున్నా లేకపోయినా మీద చేయివేసి,వీపునిమురుతూనో,మనమీద పడిపోయో మాట్లాడతారు.వారికి మనమీద ప్రేమ పొంగి పోతున్నట్లు అనుకోవాలన్న మాట.ఏదైనా తగు మోతాదులో ఉంటేనే అందం ఆనందం.
                    నవ్వు కూడా అంతే.జోక్ వేసినా నవ్వని వారు కొందరైతే,నవ్వు వచ్చే విషయం అక్కడ లేకపోయినా పక్కవారు ఉలిక్కిపడేట్టు పెద్దగా నవ్వేవారు మరి కొందరు.కొందరు చిరునవ్వుతో ఆహ్లాదకరం గా మాట్లాదతారు.డబ్బాలో గులకరాళ్ళు పోసి మోగించినట్లు భీకరం గా నవ్వే వారు మరికొందరు.అందరూ నవ్వుతుంటే మూతిబిగించుకుంటారు కొందరు.అందరూ నవ్వటం ఆపేసినాక నవ్వడం మొదలుపెడతారు మరికొందరు.అప్పటికిగాని ట్యూబ్ లైట్ వెలగదు మరి.
                 ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా కొందరు అవతలివారికి కనిపించదని తెలిసీ హావ భావాల్తో మాట్లాడుతుంటారు.సంతోషమో,కోపమో,విసుగో మన స్వరం తో ఎదుటివారికి తెలిసిపోతుంది.అవతల అధికారి మాట్లాడుతున్నారనుకోండి ఇవతల కూర్చున్న వారు అసంకల్పిత ప్రతీకార చర్యలా లేచి నుంచుంటారు.ఏదైనా సైజు చెప్పాలంటే చేతులు బార్లా సాచి మరీ చెబుతుంటారు.
                          ఊతపదాల విషయానికి వస్తే ఇవి మనుషులకు మంచిగానో,వ్యంగ్యం గానో గుర్తింపును తెస్తాయి.అలాగా,అవునా,మరే,పోతే,నిజం చెప్పొద్దూ,ఐసీ,ఓకే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో.ఒక పదాన్ని అదే పనిగా వాడితే వారికి ఆ పేరు స్థిరపడిపోతుంది.ఒకాయన ఎప్పుడూ సింగినాదం జీలకర్ర అంటూ ఉంటాడు.ఆయనకు సింగినాదం పేరు స్థిరపడిపోయింది.మరొకాయన అన్నిటికీ ఏడ్చిందిలే,ఏడ్చాడులే అంటూ ఏడ్పుగొట్టాయనగా మిగిలిపోయాడు.ఊతపదాలు వాడటం లో ఉపాధ్యాయులది ప్రత్యేక స్థానం.తరగతి గదులలో వారు తెలిసిందా?వింటున్నారా?అండర్స్టాండ్,అసలూ ఇలా వాడుతూనే ఉంటారు.పిల్లలు వారికి పెట్టే పేర్లకు హద్దే లేదు.మన ముఖ్య మంత్రి గారు కూడా మనవిజేసుకుంటున్నాను,తెలియజేసుకుంటున్నాను అనే పదాలు తరచూ వాడుతుంటారు.
             అతి ఏదైనా వింతగాను ఒకోసారి ఎబ్బెట్టుగాను అనిపిస్తుంది.మోతాదు మించకుండా ఉంటే మనకీ పక్కవారికి ఎదుటివారికి ఎంతో హాయి.
                                  

Friday, September 25, 2015

హాస్యం


       
            హాసము అంటే నవ్వు.హాసాన్ని కలిగించేది కనుక హాస్యం.స్మితం,హసితం,విహసితం,ఉపహసితం,అపహసితం,అతి హసితం అని ఆరు రకాలు.ఇందులో మొదటి రెండు మాత్రమే ఉత్తమమైనవని,తక్కినవి ఉత్తరోత్తర పరిహరణీయమని ధనుంజయుని అలంకార గ్రంధం లో చెప్పబడింది.
           హాస్యం ఇతరుల మనసులను నొప్పించేది,అవహేళన చేసేది,నీచ హేయ సంబంధమైనది ఉత్తమ హాస్యం అనిపించుకోదు.కాలుజారి పడితే నవ్వడమో,ఇతరుల వేష భాషలను అవహేళన చేయడమో హాస్యం కాదు.మనం ఎవరినైతే ఆటపట్టిస్తామో వారు కూడా మనసు విప్పి నవ్వ గలిగేదే నిజమైన హాస్యం.సరసోక్తి,చలోక్తి,నర్మోక్తి,వక్రోక్తి  వంటి యుక్తుల ఆధారం గా అర్ధవంతమైన హాస్యాన్ని పండించ వచ్చు.ప్రపంచం లో నవ్వ గలిగే జీవి మానవుడు ఒక్కడే.హాస్యాన్ని ఆస్వాదించలేని మనిషి జీవితం దుర్భరం.అందులో మనసుకి వికాసం కలిగించే జీవ శక్తి ఉన్నది.మానసిక ఒత్తిడి తగ్గి మనుగడ సుఖప్రద మవుతుందని శాస్త్ర్వేత్తల అభిప్రాయం.అందులో మర్మం తెలుసు కాబట్టే ఊరూరా'లాఫింగ్ క్లబ్బులు 'వెలుస్తున్నాయి.ఫ్రెంచ్ వారు,ఆంగ్లేయులూ,అమెరికన్లు కూడా వారి సాహిత్యం లో హాస్యానికి పెద్ద పీట వేసారు.జెరూం,క్రేఫోర్డ్,డికెన్స్,మార్కుత్వైన్,లీకాక్ వంటి హాస్య రచయతులు కనిపిస్తారు.
                  తెలుగు లో 20వ శతాబ్దం ప్రారంభం నుంచి మాత్రమే ఆరోగ్యప్రదమైన హాస్యం కనిపిస్తుంది.ఆరంభం లో కందుకూరి ప్రహసనాలు,చిలకమర్తి గణపతి,పానుగంటి కంఠాభరణం,గురజాడ కన్యాశుల్కం కనిపిస్తాయి.తరువాత మొక్కపాటి  బారిష్టరు పార్వతీశం,కాంతం కధలతో మునిమాణిక్యం,మొలియరె ప్రభావం తో భమిడిపాటి కామేశ్వర రావు,బుడుగు ద్వారా ముళ్ళపూడి వెంకట రమణ పాత్ర గత,భాషా గత శబ్దగత,భావాశ్రయమైన హాస్యాన్ని అందించి తెలుగు హాస్యానికి  మూల స్తంభాలుగా నిలిచారు.భానుమతి అత్తగారి కధలూ ఈ కోవకే చెందుతాయి.తరువాత తన గీతల ద్వారా బాపు ని,జంధ్యాల గారి హాస్య సంభాషణలు మన నిత్య జీవితాలలో భాగాలైనాయి.ఇప్పటికీ ఎంతోమంది తమ హాస్య రచనల ద్వారా మనకు ఆరోగ్యాన్ని పంచుతూనే ఉన్నారు.
             ఒకసారి మునిమాణిక్యం గారి మేనకోడలు చిట్టెమ్మ గారు ఆయనను చూడటానికి బందరు వచ్చింది.బందరు లో గడిదలు ఎక్కువగా ఉండటాన్ని గమనించిన ఆమె 'ఈ ఊరి నిండా గాడిదలేనే 'అని మేలమాడింది.ఆయన ఏమానా తక్కువ తిన్నారా 'అవును వాటిని చూడటానికి అప్పుడప్పుడూ పొరుగూరి గాడిదలు కూడా వస్తూ ఉంటాయీ----ఇదీ హాస్య మంటే.
            ఆలాగే మునిమాణిక్యం గారి ప్రేమలేఖ చూడండి.
 ప్రియమైన కాంతానికి,
           శుభాశీస్సులతో వ్రాయు లేఖాన్శములు.ఉభయ కుశలోపరి.నువ్వు వ్రాయించిన జాబు అందినది.సంగతులు తెలిసినవి.ఎదురింటి మీనాక్షికి మళ్ళీ ఆడపిల్లే.ఈ విషయం నీకు సంతోషం కలిగించ గలదని తెలుపడమైనది.మీ జానకమ్మ పీన్నిగారింట్లొ అంతా కులాసాగానే ఉన్నారు.కనకమహాలక్ష్మి నీ కోసం ఎదురుచూస్తున్నది.వారి పెద్దమ్మాయికి సీమంతం చేస్తారట.నువ్వు చెప్పిన ప్రకారం పనిమనిషి దగ్గరున్న దబర గిన్నె తెప్పించాను.పాత కాగితాలవాడు అమ్మ గారు ఎప్పుడు వస్తారని వాకను చేస్తున్నాడు.నువ్వు మడిగా కాక విడిగా చిన్న జాడీలో తీసిన ఆవకాయ అయిపోయింది.నువ్వు వెళ్ళినప్పటి నుంచి అదే కదా ఆధరువు.మరి పెద్ద జాడీ లోంచీ తీసుకోమంటావా?ఏ సంగతీ జవాబు వ్రాయించ గలవు.---------ఇల సాగుతుంది.ఆ తరం ప్రేమ లేఖ.
        గణపతి 'తులసీ దళాలతో చారు,చుక్కులు చుక్కులుగా జుత్తూ మరచిపోగలమా?
     నిజం గా నిఝమే చెప్తానన్న బుడుగు ని,పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్న గిరీశాన్ని తెలుగు జాతి ఎప్పటికీ మరచిపోదు.హాస్య పాత్రల నన్నిటినీ ఒక్కసారి స్మరించాలని ఉంది కాని సమయాభావము వలన ఇంతటితో ముగిస్తున్నాను.

Thursday, September 24, 2015

పాస్తా 

   కారెట్----------------1/4కప్పు
   బీన్స్--------------------1/4కప్పు
   కాప్సికం-------------1/4కప్పు
   టమోటా---------------1/4కప్పు
   ఉల్లిపాయలు--------------1/4కప్పు
   పస్త అ------------------2కప్పులు
  పచ్చి మిర్చి----------4
   నూనె-------------------2టీ స్పూన్లు 
   బ్రెడ్ పొడి------------2టీ స్పూన్లు
  ఊప్పు రుచికి సరిపోను.

      ముందుగా  పాస్తాని నీళ్ళలో ఉడకబెట్టుకొని చిల్లుల గిన్నె లోకి వంచుకోవాలి.అవి అంటుకోకుండా ఒక స్పూను ణునెజ్ వెసి కలిపి ఉంచుకోవాలి.టమోటా ప్యూరీ చేసుకోవాలి.మిగిలిన కూరలన్నీ వాలికిలుగా సన్నగా తరుగుకోవాలి.స్టౌ మీద బాణిలి పెట్టి నూనె వేసి కాగినాక కూరముక్కలు,పచ్చి మిర్చి,ఉప్పు వేసి మగ్గ నివ్వాలి.తరువాత టమోటా ప్యూరీ వేసి చిక్కబడినాక పక్కన ఉంచుకున్న పాస్తా వేసి కలియబెట్టాలి.అవి ముక్కలవ కుండా జాగ్రత్తగా తిప్పాలి.దించినాక్ బ్రెడ్ పొడి పైన జల్లాలి.



Wednesday, September 23, 2015

నవ్వు-నవ్వించు



   ఒక ఉపాధ్యాయుడికి శిష్యుడికి  మధ్య జరిగే సంభాషణలు ఇలా ఉన్నాయి.
   ఉ:-ఒక ఇంటికి 5 అంతస్తులు ఉన్నాయి.ఒక్కో అంతస్తుకి పది మెట్లు ఉన్నాయి.అయిదో అంతస్తుకి ఎక్కాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి?
   శి:-మొత్తం అన్నీనండీ!

2.ఉ:-పేడ పురుగికి రోజుకెంత తిండి కావాలంటే ,దాని బరువుకి సరిపడా.
   శి:-......మరి  దానికి  తన బరువెట్లా తెలుస్తుందండీ?

3.ఉ:-మొగలు సామ్రాజ్యానికి ఔరంగజేబు ఎంత వరకు కారకుడు?
   శి:-కొంత వరకు కారకుడు.
 

Tuesday, September 22, 2015

మిని కవితలు


       బాణం
       తనువు గాయపరుస్తుంది 
       వాగ్బాణం
       మనసు చిద్రం చేస్తుంది

      వాదన 
      మూఢత్వానికి ప్రతీక 
     మౌనం 
    ఙానానికి మరో భాష 

     విద్య
     విధ్వంస మయ్యాక 
     విద్యకు
     ఏ స్థాన మయినా ఒకటే!
 
     ఆ ఇంటికి
     ఏదీ ఉండాల్సిన చోట ఉండదు
     ఔను 
    అతడు వాస్తు విద్వాంసుడు మరి 

    మృగం 
    లేడి నెత్తురు తాగింది 
   అభాగ్య జీవికి 
   చెత్తకుండీ స్థావర మయ్యింది 

   పగలంతా
   పుస్తకాలతో కుస్తీ 
   రాత్రంతా 
   అంతర్జాలం తో దోస్తీ 
    ఒకే కప్పు కింద నివాసం 
    ఒంటరి జీవితం తో సావాసం.


  

Monday, September 21, 2015

వెగ్క్వెస్డెల్ల

M
       తరిగిన ఉల్లిపాయలు------------1/2కప్పు
       తరిగిన పుట్ట గొడుగులు----1/4కప్పు
       తరిగిన కాప్సికం-------------1/4కప్పు
       ఉడకబెట్టిన స్వీట్కార్న్--1/4కప్పు
       తురిమిన చీజ్-------------------1కప్పు
       పచ్చి మిర్చి----------------2
       కొత్తిమీర-----------------------కొంచెం 
      నూనె----------------------------1స్పూను.
      చపతిస్-------------------------2
      ఉప్పు,మిరియాలపొడి---------రుచికి సరిపోను
    
                   పాన్  స్టౌ మీద పెట్టి నూనె వేసి కూరగాయ ముక్కలు పచ్చి మిర్చి ఉప్పు మిరియాలపొడి వేసి 5నిముషాలు మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి.
           చపాతి రెండు వైపులా కాల్చినాక పెనం మీద ఉంచే 1/2కప్పు చీజ్ పరచి దానిపై కూరగాయల మిక్చర్ సగం పరిచి చపాతీని సగానికి మడిచి  కాలినాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.అలాగే రెండో చపతీ కూడా చేసుకోవాలి.వెజ్ క్వెస్డెలా తినడానికి సిధ్ధం.

Friday, September 4, 2015

బీట్రూట్పచ్చడి


    బీట్ రూట్-----------------మీడియం సైజ్ 1దుంప
    పచ్చి మిర్చి---------4
    చింత పండు---------1రెబ్బ
    వెల్లుల్లి-----------------3రెబ్బలు
    జీర------------------1స్పూను
   పురుగు----------------1కప్పు
   కరివేపాకు----------2రెబ్బలు
    నూనె-----------------2స్పూన్లు
    ఉప్పు-----------------రుచికి సరిపోను

           బీట్ రూట్ తోక్క తీసి కోరు కోవాలి.పచ్చి మిర్చి ఒక స్పూను నూనె వేసి వేయించాలి.తరువాత పచ్చి మిర్చి,చింత పండు,బీట్ రూట్ కోరు వెల్లుల్లి,జీర సరిపోను ఉప్పు వేసి మిక్సీ పట్టాలి.స్టౌ మీద బాణిలి పెట్టి మిగిలిన నూనె వేసి తిరగమోత దినుసులు,కరివేపాకు వేసి మిక్సీ పట్టిన బీట్ రూట్ను వేసి రెండు సార్లు తిప్పి చివరలో  పెరుగు కలపాలి.

Wednesday, September 2, 2015

చక్కెరపొంగలి


     బియ్యం--------------1/2కెజి
     పెసరపప్పు-------1/4కెజి
     బెల్లం---------------600గ్రాములు
     పంచదార------150గ్రాములు
     జీడిపప్పు----------250గ్రాములు
    కిస్మిస్---------------200గ్రాములు
    ఎండు కొబ్బరి------200గ్రాములు
    ఏలకులు-------------5గ్రాములు
    నెయ్యి--------------400గ్రాములు
          ముందు పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేలా వేయించుకోవాలి.తరువాత బియ్యము,పెసరపప్పు కలిపి అన్నము వండాలి. అది ఉడికేలోపు జీడిపప్పు,కిస్మిస్,ఎండుకొబ్బరి సన్నగా తరిగి ఆ ముక్కలు నేతిలో మంచి రంగు వచ్చేటట్లు వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి.ఏలకులు పొడిలా చేసుకోవాలి.ఉడికిన అన్నము ఒక మందపాటి గిన్నెలో వేసుకొని తరిగిన బెల్లము, పంచదార వేసి స్టౌ మీద పెట్టి కొంచెం కొంచెం నెయ్యి  వేస్తూ అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి.చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు చివర్లో వేయించి పెట్టుకున్న దినుసులు ,ఏలుకులపొడి వేసి దించేయాలి.చిటికెడు పచ్చ కర్పూరం కూడా వేస్తే మంచి వాసన వస్తుంది.మంచి పాకం వస్తుంది కాబట్టి రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుంది.బియ్యము,పెసరపప్పు కలిపి ఎంత కొలతో అంత జీడిపప్పు,కిస్మిస్,కొబ్బరి ముక్కలు కలిపి అంత. నెయ్యి కూడా ఇంచుమించు సమానం గా పడుతుంది.ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి రాజీ పడకుండా చేసుకుంటే అమృత తుల్యమే.
         దీన్ని కొంతమంది పాలు పోసి,మరికొంతమంది విడిగా పాకం పట్టి పోసి  ఇంకా  చాలా రకాలుగా చేస్తారు కానీ దీనంత రుచి రాదు.ఒక్కసారి ప్రయత్నించి చూడంది.తేడా మీకే తెలుస్తుంది.

Wednesday, August 26, 2015

ఉండవల్లిగుహలు


   
           రాజుల కాలం లో గుహలలో చిత్రాలు వేయడం, శిల్పాలు చెక్కటం ఎక్కువగా కనిపిస్తుంది.అలాంటివే విజయవాడకు 6కి.మి లలో ఉన్న ఉండవల్లి గుహలు.4,5 శతాబ్దుల కాలం లో విష్ణు కుండినిలకు చెందినవని చరిత్రకారుల అభిప్రాయం.బౌధ్ధ శిల్పకళా రీతులు కంపించడాన్ని బట్టి ,బౌధ్ధులకు విశ్రాంత మందిరాలుగా ఉండెవేమోనని ఒక అభిప్రాయం.
      ఒకే పర్వతం లో 4అంతస్తులుగా నిర్మించ బడినవి.ఇవి ఇసుక రాయితో కూడినది.వివిధ దేవతా ప్రతిమలు,త్రి మూర్తుల శిల్పాలు ఏక శిలా నిర్మితాలు.రెండవ అంతస్తులో గ్రానైట్ ఏకశిలలో 20అడుగుల విష్ణువు యొక్క శయన భంగిమ  ఉన్నది .ఈయనని అనంత పద్మనాభ స్వామి అంటారు.బయటి వైపున సప్తఋషుల విగ్రహాలు కలవు.పై నుంచి చూస్తే పచ్చటి వరి పైరులు కనువిందు చేస్తాయి.ఇది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పరిధి లోకి వస్తోంది.అన్ని రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్న  వీటిని తప్పనిసరిగా చూడదగిన ప్రదేశము.





Saturday, August 22, 2015

రొయ్యలవేపుడు


   
   రొయ్యలు-------------------1/2కెజి
   ఉల్లిపాయలు---------------2
   వెల్లుల్లి---------------------3రెబ్బలు
   అల్లం----------------------చిన్న ముక్క
   పచ్చిమిరప----------3
   కారం------------------11/2స్పూను
   పసుపు-----------------1/4స్పూను
   ధనియాలు------------1స్పూను
   సోంపు పొడి---------1/2స్పూను
   కొబ్బరి కోరు---------2స్పూన్లు
    గరం మసాలా---1స్పూను
    నిమ్మరసం లేదా పెరుగు---------1స్పూను
     నూనె-----------------11/2స్పూను
     కరివేపాకు----------2రెమ్మ్మలు
    ఊప్పు------రుచికి సరిపోను
               శుభ్రం గా కడిగిన రొయ్యలకు అల్లం పచ్చి మిర్చి పేష్టు,కారం,ఉప్పు,పసుపు,నిమ్మరసం కలిపి 15 నిముషాలు నానబెట్టాలి.తరువాత 1/4 కప్పు నీళ్ళు పోసి 10 నిముషాలు ఉడికించాలి.తరువాత ష్టౌ  మీద బాణిలి పెట్టి నూనె వేసి కాగినాక ముందు సన్నగా తరిగిన వెల్లుల్లి,ఉల్లి పాయ ముక్కలు  కరివేపాకు,ఎర్రగా మారేవరకు వేయించాలి.కసూరి మేథి కూడా వేయవచ్చు.అందులో ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ధనియాల పొడి, గరం మసాలా,ఉప్పు,కొబ్బరి కోరు వేసి 5నిముషాలు ఉంచి ష్టౌ కట్టేయాలి.ఘుమ ఘుమ లాడే రొయ్యల వేపుడు రెడీ!
   

Friday, August 21, 2015

ఆమె


  ఉదయం విరిసిన
  పూవులా ఎద తలుపును తడుతుందా
  సంజె వేళ కల్లా
  వసివాడిన విరిబోణి అవుతుంది
 
   సవ్యసాచి లా
  ఒక చేత్తో కూరల సంచి
  మరో చేతిలో ఆఫీసు ఫీళ్ళ్తో
  కుటుంబ కురుక్షేత్రానికి
  విజయ దరహాస మౌతుంది.

  అభిమన్యుడిలా
  బతుకు పద్మవ్యూహము లో
  ఒంటరి పోరాటం చేస్తూ
  ఇంకా న్యాయం చేయలేక పోతున్నాననే
  అసంత్రుప్తితో జీవనయానం చేస్తుంది.

  పెదవులు పై అద్దుకున్న చిరు నవ్వుతో
  గడపలో అడుగు పెడుతూనే
   ద్వి పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి
   విసుగులు,అలకలు,చిరాకులు,పరాకులు
   దరిచేరని కవచ కుండలాలు ధరించిన
   కర్ణుడు అవుతుంది.

   భావుకత్వం తో
   సుందర స్వప్నాల పల్లకిలో
   విహరించిన ఆమె
   యాంత్రిక జీవన సంగ్రామం లో
   శిఖండి అయినది

    భారతీయత నింపుకున్న 
   ఆమె
    మరెవరో కాదు
    సగటు భారతీయ మహిళ.

Monday, August 17, 2015

వంకాయపులుసు


     వంకాయలు------------------1/4కెజి
     టమోట---------------------2
      చిలకడదుంప--------1
     ములక్కాయ----------------1
    ఉల్లిపాయ--------------------1
    పచి మిర్చి --------------2
    చింత పండు----------చిన్న నిమ్మకాయంత
   నూనె-----------------------2స్పూన్లు
    కారం--------------------1స్పూను
    ఉప్పు-------రుచికి సరిపోను
      తిరగమోతకు------ఆవాలు,మినపపప్పు,మెంతులు,శనగపప్పు--1/2,1/2స్పూన్లు
     కరివేపాకు.
           ముందుగా వంకాయల్ని ముక్కలు కోసి నీటిలో వేయాలి.మిగిలిన కూరగాయల్ని కడిగి విడివిడి గా ముక్కలు గా కోసుకోవాలి.స్టౌ మీద గిన్నె పేట్టి నూనె వేసి కాలినాక తిరగమోత దినుసులు కరివేపాకు వేసి,పచ్చి మిర్చి,ఉల్లిపాయ ముక్కలు వేయాలి .కొంచెం వేగినాక టమోటాముక్కలు వేసి అవి కూడా మగ్గినాక వంకాయ ,చిలకడదుంప,ములక్కాయ ముక్కలు ఉప్పు,కారం వేసి బాగా మగ్గినాక చింతపండు పులుసు పోసి చిక్కబడినాక దించుకోవాలి.ఉడ్కేటప్పుడు ఒక1/2స్పూను పంచదార వేస్తే మంచి రుచి వస్తుంది.

Wednesday, August 12, 2015

మినికవితలు



 గుండె
 గుప్పెడంత
 ఆశ
 ఆకాశమంత
 
 ఆమె
 విప్పని ఫజిలైతే
 అతడు
 జవాబు లేని ప్రశ్న అవుతాడు

 మగువ
 మరణ వేదన
 మాధ్యమానికి
 ంఅరో మేత దొరికింది.
 
 వస్తువు
 కొన్న ప్రతి దానికి గ్యారంటీ
 వరుడు
 కోట్లు పోసి కొన్నా లేదు.

  నాడు
  వంశాంకురమని మురిసింది
  నేడు
  వంశ వినాశకుడని బెదిరింది
  పున్నామ నరకం తప్పించే  వాడని
  భ్రమసింది
  నరకమంటే ఇదేనని
  గ్రహించింది.

  *******     ******    *****
  గరిక పూవు కీ
  ఉంది చరిత
  గరీ బోడికీ
  ఉంది భవిత.

****    ******.     *****
  ఉల్లి
 నాడు
 కోసే టప్పుడు కన్నీరు
 నేడు
 కోనేటప్పుడూ కన్నీరు.
*******.    ******.     

Tuesday, August 11, 2015

తెలివితక్కువగాడిద


             రామైఅహ్ అనే వ్యాపారికి  ఒక గాడిద ఉంది.అది ఎప్పుడూ  బధ్ధకం తో పని తప్పించుకోవాలని చూసేది.
         ఒకరోజు రమైఅహ్ వ్యాపార నిమిత్తం ఉప్పు బస్తాలను గాడిద మీద వేసుకొని పట్టణానికి బయలుదేరాడు.ఆ బరువుకి అది మూలుగుతూ నడుస్తోంది.పట్టణానికి వెళ్ళే దారిలో ఉన్న వన్ తెనంత్ దాటుతూ జారి కాలువలో పడిపోయింది.వెంటనే ఉప్పు కరగడం ప్రారంబమైంది.గాడిద ఎలాగో ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకుంది.కొంత ఉప్పు కరిగిపోవడం తో బరువు తగ్గి తేలికగా కులాసాగా గమ్యానికి చేరుకుంది.
         మరునాడు వ్యాపారి మరికొన్ని బస్తాల ఉప్పుని గాడిద మీద వేసాడు.కానీ అది ఆ బరువు ఇబ్బంది అనుకోలా! ఎందుకంటే దానికి బరువు తగ్గించుకొనే యుక్తి తెలిసిందిగా!ఆ రోజు కూడా కాలువలో కి కావాలని జారింది.బరువు తగ్గడం తో సంతోషం గా ప్రయాణం సాగించింది.కాని వ్యాపారి దాని దుర్బుధ్ధిని గ్రహించాడు.దానికి ఎలాగైనా బుధ్ధి చెప్పాలనుకొని మరునాడు బస్తాలను స్పాంజి తో నింపాడు.ఇది తెలియని గాడిద యధాప్రకారం కలువలోకి జారింది. స్పాంజి నీటిని పీల్చుకొని బరువు ఎక్కువ అయ్యింది.ఆ బరువు మోయలేక ఆయాసంతో రొప్పుకుంటూ బయటకు వచ్చింది.ఇంకెప్పుడూ ఇలాంటి దురాలోచన చేయకూడదు అనుకుంది.
  రెలివింగ్ తక్కువ వారు మాత్రమే ఒకే రకమైన మోసాన్ని ఒకటికంటే ఎక్కువ సార్లు చేయాలనుకుంటారు.

Monday, August 10, 2015

తప్పులు


       అన్నిటి కంటె తేలికైన విషయం ఏమిటంటే ఎదుటి వారిలో తప్పులెంచడం.మనం చేసిన తప్పులు ఒప్పులుగా ను అదే ఎదుటి వారు చేస్తే తప్పులు గాను కనిపిస్తాయి.
   "తప్పులెన్ను వారు తండోప తండంబు
    లుర్వి జనులకెల్ల నుండు తప్పు
    తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగరు"---అని వేమన ఏనాడో చేప్పాడు.
        కొంతమంది తాము తప్పు చేసినా ఎదుటి వారి మీద నెట్టివేస్తారు.తప్పు చేయడం మానవాళికి సహజం .తమ తప్పు తాము తెలుసుకొని దిద్దు కొనేవాడే విజ్ఞుడు.
     కాసుల పురుషోత్తమ కవి వ్రాసిన "నరసిమ్హ శతకము"లోని ఈ పద్యము ఎ తప్పులకు ఎవరు బాధ్యులో చక్కగా చెప్పాడు.

         పసరంబు పంజైనబసుల కాపరి తప్పు
                  ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు
        భార్య గయ్యాలైన బ్రాణ నాధుని తప్పు
                  తనయుడు దుడుకైన దండ్రి తప్పు
        సైన్యంబు చెదిరిన సైన్య నాధుని తప్పు
                  కూతురు చెడుగైన మాత తప్పు
        అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు
                 దంతి మదించ మావంతు తప్పు
        ఇట్టి తప్పులెఱుంగక యిచ్చ వచ్చు
       నటుల మెలగుదు రిప్పుడీ యనుని జనులు
       భూషణ వికాస!శ్రీ ధర్మ పురి నివాస!
       దుష్ట సమ్హార!నరసిమ్హ!దురితదూర! 
               శతక పద్యాలు ఆ నటికి,ఈ నాటికి,ఏ నాటికీ అనుసరణీయమే!

Sunday, August 9, 2015

పుదీనాపచ్చడి



  పుదీనా--------------------2కట్టలు
  ఎండు మిరప కాయలు-----5
   మినపపప్పు-------------2స్పూన్లు
   శనగపప్పు-------------2స్పూన్లు
   జీర---------------------------1స్పూను
  వెల్లుల్లి-------------------------5రెబ్బలు
  చింత పండు---------------2రెబ్బలు
   నూనె-----------------------1స్పూను
   ఉప్పు-------రుచికి సరిపోను
         పుదీనా ముదురు కాడలు తీసివేసి ఆకులు విడదీసి కడిగి పెట్టుకోవాలి.బాణిలి లో ఒక స్పూను నూనె వేసి మిరప కాయలు వేయించి తీసి,మినపపప్పు,శనగపప్పు,జీర వేసి దోరగా వేయించి తీయాలి.దనిలోనే పుదీనా వేసి వేయించాలి.కొంచెము ఆరిన తరువాత పుదీనా తప్ప దినుసులు,చింతపండు,వెల్లుల్లి,ఉప్పు వేసి మిక్సీ పట్టి  అవి నలిగినాక పుదీనా వేసి తిప్పాలి.పుదీనా పచ్చడి రెడీ.రుచికి రుచీ,ఆరోగ్యానికీ మంచిది.

Saturday, August 8, 2015

కార్యసాధకుడు


     ఉత్సాహో బలవా నార్య!
     నా స్త్య్ ఉత్సాహం త్పరం బలం
     సోత్సాహ స్వాస్తి లోకేస్మిన్
     న కించిదపి దుర్లభం||
             సీతాపహరణం జరిగిన తరువాత మానసికం గా క్రుంగిన అన్నను చూచి లక్ష్మణుడు చెప్పిన శ్లోకం ఇది.
       "ఆర్యా!ఉత్సాహం చాల బలమైనది.దాన్ని మించిన బలం లేదు.ఉత్సాహవంతుడికి లోకం లో అసాధ్యమైనది కూడా ఏదీ లేదు."అని భావం.ప్రతి కార్యసాధకుడికి అనుసరణీయమైన మార్గము.
    
   ఒకచొ నేలను బవళించు,నొకచో నొప్పారు బూసెజ్జపై
   నొకచో శాకములారగించు,నొకచో నుత్కృష్ట శాల్యోదనం
   బొకచో బొంత ధరించు,నొక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి,లె
   క్కకు రానీయడు,కార్యసాధకుడు దూఃఖంబున్,సుఖంబున్ మదిన్!
             కార్యాన్ని సాధించాలను కున్న వాడు నేల మీదైనా,పూల పాంపు అయినా ఒకే విధం గా నిద్రిస్తాడు.కూర గాయలైనా ,విందు భోజనమైనా ఒకే విధంగా ఆరగిస్తాడు.బొంతనైనా,పట్టు వస్త్రాలనైనా ఒకే విధంగా ధరిస్తాడు.విచారాన్ని కాని,సంతోషాన్ని కాని మనసులోకి రానీయడు.పని జరగడం ముఖ్యం. కష్టాన్ని, సుఖాన్ని  కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు సమానం గా చూస్తాడని భావము.
            ఆటంకాలు ఎదురైతే మధ్యలో వదిలేసే వాడు మధ్యముడు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా తొలగించుకుంటూ కార్యాన్ని సాధించే వాడు ఉత్తముడు.
     ఉత్సాహం,కార్యదీక్ష,పట్టుదల ఉంటే  విజయం మనదే!

Friday, August 7, 2015

మినీకవితలు



   పాపాయి
   బోసి నవ్వులు
   ఇల్లంతా
   వెన్నెల వెలుగులు

   పల్లె
   పలచ బడింది
   పట్నం
   చిక్క బడింది.
  
   వాడు
   పశువయ్యాడు
   ఆమె
   గ్రాసమయ్యింది.

   మౌనం
   మాట్లాడుతుంటే
   శబ్దం
   మూగబోతుంది.

   అక్షరం
   అణ్వాయుధమైతే
   జ్ఞానం 
   అనంత మౌతుంది.

  కన్నీళ్ళు 
  భగవంతునికి అర్జీలు
  పరిశీలిస్తాడో?
  బుట్టదాఖలు చేస్తాడో?
   

Wednesday, August 5, 2015

ముందుచూపు


      మనిషికి ముందు చూపు చాలా అవసరం.లేకపోతే ఇబ్బందులు పడతాడు.ఈ శ్లోకం చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.
      "వర్షార్ధ మష్టౌ ప్రయతేత మాసాన్
        నిశార్ధ మర్ధం దివసే యతేత |
        వార్ధక్య హేతో ర్వయసా నవేన 
        పరత్ర హేతో రిహజన్మనాచ||"
                వర్షం లో బయటకు వెళ్ళలేము కనుక అప్పటికి కావలసినవి మిగిలిన ఎనిమిది మాసాల లోనే సమకూర్చు కోవాలి.రాత్రి వేళ చీకటి కనుక పగటి పూట పొందుపరచుకోవాలి.వార్ధక్యం లో శక్తి సన్నగిల్లుతుంది కనుక ముసలితనం లో ప్రశాంతం గా జీవించ డానికి వయసులో ఉండగానే సంపాదించు కోవాలి.పరలోకానికి కావలిసిన పుణ్యాన్ని ఇహలోకంలోనే సంపాదించుకోవాలి.
              ఈ శ్లోకం జీవితం గురించి  తెలిపితే "మూడు చేపల కధ" ముందు చూపు,సమయస్ఫూర్తి లేకపోతే దీర్ఘ సూత్రుడు లా ప్రాణాలు కోల్పోతారు.సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడులా తప్పించు కోవచ్చు.దీర్ఘ దర్సి కి ముందు చూపు ఉండటం వలన తనను తాను కాపాడుకో గలిగింది.

Tuesday, July 28, 2015

నివాళి


       ఒక గొప్ప శస్త్రవేత్త,రచయిత,వక్త ,దార్సనికుడు,వైణికుడు నేల రాలిపోయాడు. లేదు ఒక తార గగనమెక్కె.అనారోగ్యం లేదు తాను ఇబ్బంది పడలేదు,ఇతరులను ఇబ్బంది పెట్ట లేదు అనాయాస మరణాన్ని పొందాడు.అదీ తనకిష్టమైన బొధన కావిస్తూ వందలాది విద్యర్ధుల సమక్షం లో.ఎంత పుణ్యం.
      ప్రశాంత ద్వీపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఓ బాటసారీ నీ కివే మా అశ్రు నివాళులు.

Monday, July 27, 2015

సామ కిచిడి


     సామలు-------------------1/2కె.జి
     నీరు-------------------------1లీటరు
     పెసర పప్పు-------------1/4కె.జి
     ఆకుకూరలు---------------తోటకూర,పాలకూర(రెండు చిన్న కట్టలు)
     ఉల్లి పెధ్ధది------------1
    పచ్చి మిర్చి-----------4
    నూనె-----------------------10గ్రాములు
    ఆవాలు,మినపపప్పు,శనగపప్పు,జీర------ఒక్కొక్కటి స్పూను
    కరివేపాకు------------2రెబ్బలు
   ఉప్పు------------------రుచికి సరిపోను
                      సామలు,పెసరపప్పు కడిగి పెట్టుకొని ,ఉల్లి,పచ్చిమిర్చి,ఆకు కూరలు
సన్నగా తరిగి పెట్టుకోవాలి.బాణిలి ష్టౌ మీద పెట్టి నూనె వేసి కాగినాక తాలింపు దినుసులు ,కరివేపాకు,పచ్చి మిర్చి, ఆకుకూరలు,పెసరపప్పు వేసి వేగినాక కొలిచి పెట్టుకున్న నీళ్ళు పోయాలి.తగినంత ఉప్పు వేసి నీళ్ళు మరుగుతుండగా సామలు వెయ్యాలి.బాగా ఉడికినాక కలిపి దించుకోవాలి.సుమారు 15,20 ని||లు పడుతుంది
           ఇది చాలా బలవర్ధమైన ఆహారం.
    

Saturday, July 25, 2015

కొర్ర దోసె


     కొర్ర బియ్యం---------------2 కప్పులు
     మినపపప్పు--------------1 కప్పు
    శనగపప్పు--------------2 టీ స్పూనులు
    మెంతులు----------------------1/2 స్పూను
    ఉప్పు--తగినంత
    నూనె----దోసె కాల్చటానికి తగినంత
             పైన చెప్పిన దినుసులు అన్నీ  విడివిడి గా 4,5గంటలు నానబెట్టాలి.నానిన తరువాత శుభ్రం గా కడిగి  ముందుగా కొర్రలు ,మెంతులు మెత్తగా రుబ్బుకోవాలి.మినపపప్పు,శనగపప్పు కలిపి మెత్తగా రుబ్బాలి.ఈ రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి రత్రంతా ఉంచితే పులుస్తుంది.ఉదయం రుచికి సరిపోను ఉప్పు కలిపి నీరు చేర్చి దోసెల పిండిలా జారుగా చేసుకొని పెనం మీద ఒక గరిటె పోసుకొని ఒక స్పూను నూనె వేసుకొని రెండు పక్కలా కాల్చు కోవాలి.
         మాంస కృత్తులు,ఇనుము,పీచు పదార్ధం ఉండటం వలన ఎదుగుదలకు,జీర్ణ క్రియకు దోహద పడటమేగాక శక్తిని, చురుకుదనాన్ని పెంపొందిస్తుంది.

Friday, July 24, 2015

శబ్దము


        శబ్దము అంటే మాట,చప్పుడు,ధ్వని,బిరుదు,నామము మున్నగు అర్ధాలున్నాయి.ఇప్పుడు మనం చప్పుడు(ధ్వని) గురించి తెలుసుకుందాము.
         మానవ జీవితం లో శబ్దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది.జననం నుంచి మరణం దాకా చప్పుడు లేనిదే ఏ పనీ జరగదు.పుట్టిన శిశువు ఏడవడం తోనే జీవన పోసుకుంటాడు.ఒకవేళ ఏడవకపోతే వీపు మీద చరచి మరీ ఏడిపిస్తాము.అతడి అచ్చట్లు ముచ్చట్లు అన్నీ శబ్దం తోనే ముడిపడి ఉన్నాయి.దేవుడికి కూడా బాజాలు కావాల్సిందే.అప్పుడే కరుణిస్తాడు.నిశ్శబ్దాన్ని  ఎక్కువ సేపు భరించ లేము.చేదించాలనుకుంటాము.
       మానవుడు శబ్దాల ద్వారా బంధాలను ఏర్పరుచుకుంటాడు.మనం పలికే ధ్వని లోనే మన భావం వ్యక్తమౌతుంది.పదాన్ని మనం పలికే తీరులో ప్రేమ, లాలన,అధికారం,అహంకారం,ద్వేషం అన్ని భావాలు వ్యక్తమౌతాయి.జంతువులు,పక్షులు కూడా ధ్వనులు చేస్తాయి.ఒక్కో జంతువుది,ఒక్కో పక్షిది ఒకో రకమైన ధ్వని.అవి కూడా ఆకలిని వివిధ ఉద్వేగాలను వేరు వేరు ధ్వనుల ద్వారా వ్యక్తీకరిస్తాయి.అందరికీ ఆ ధ్వనుల భావం తెలియక పోయినా వాటిని సాకే వారికి అర్ధమౌతాయి.
       వాహనాలు చేసే ధ్వనులు కూడా విభిన్నం గా ఉండి అవి చేసే చప్పుడిని బట్టి అవి ఏ వాహనమో తెలియజేస్తాయి.ప్రతి చప్పుడికి ఒక భాష ఉంటుంది.
        కురుక్షేత్రం లో కౌరవ,పాండవ యుధ్ధానికి నాంది శబ్దం.వారు తాము యుధ్ధానికి సన్నధం గా ఉన్నామని చెప్పటానికి శబ్దాన్ని ఉపయోగించారు. వ్యాసుడు ఒకో శబ్దానికి ఒక్కో ప్రత్యేకతను చెప్పడు.భీష్ముని శంఖారావం  ఆ చుట్టుపక్కల భయంకరం గా వినిపిస్తుంది. ఇది ముందు జరిగితే అయోమయ స్థితిని తెలుపుతుంది.కృష్ణుడు పాంచజన్యాన్ని పూరిస్తాడు.ఆ ధ్వని దుర్యోధనుని పతనాన్ని ధ్వనింప జేస్తుంది.అర్జునుడు  దేవదత్తం,ధర్మరాజు అనంత విజయం,భీముడి పౌండ్రం,నకులుడు సుఘోష,సహదేవుని మణి పుష్పకం ఇలా పాండవులు విడి విడి గా తమ శంఖాలను పూరిస్తారు.ఒక్కొక్క ధ్వని ఒక్కో విధంగా దుర్యోధనుని గుండెను భీతావహం చేస్తుంది.కౌరవ పక్ష ధ్వనులు తాటాకు చప్పుళ్ళుగాను పాండవ పక్ష ధ్వనులు స్పష్టమైన అవగాహనతో ఉంటాయి.కేవలం చప్పుళ్ళ తేడాతో జీవిత సారాన్ని ఇమిడ్చి శబ్దానికి గల అద్వితీయ శక్తిని విపులీకరించాడు వ్యాసుడు.
          కర్ణపేయమైన ధ్వని ఏదైనా మనసుకి  ఆహ్లాదాన్ని కలిగిస్తూ శుభసూచకం గా ఉంటుంది.కర్ణ కఠోరమైన చప్పుడు భీతావహ వాతావరణాన్ని కలిగిస్తుంది.ఇదీ శబ్ద ఘోష.

Wednesday, July 15, 2015

ఘొరం


        వేదం లా ఘోషించే గోదావరి
        నేడు రోదనల హాహాకారాల రాదారి
        పుణ్యాన్ని గుత్తగా పొందాలని
        కొండంత ఆశతో, ఆనందోత్సాహాలతో
        అరుదెంచి
        అడుగులు తడబడి తొక్కిటబడి
        వేయి కాళ్ళు ఒక్కటై వేసిన
        అడుగులు మిగిల్చింది
        అవ్వను పోగిట్టుకున్న మనవడిని
        సతులను కోల్పోయిన పతులను
        రుణాను బంధాలు తెగి
        నిశ్చేష్టులై నిలచిన అభాగ్యులను
        పుణ్యలోకాలకు తరలిపోయారు వారు
        పుష్కర స్నానం పుణ్యమా?పాపమా?
        పోయినోళ్ళందరూ పుణ్యాత్ములే
        వాళ్ళను కోల్పోయిన అభాగ్యులు వీళ్ళు
        మాధ్యమాల నిండా ఇవే దృశ్యాలు
        హృదయాలను కలచివేసేటట్లు
        కొన్ని వేదంతో,కొన్ని సానుభూతితో
        దూఃఖంతో కొన్ని,రాజకీయంతో మరికొన్ని
        సమస్యను పరిష్కరించేవి ఎన్ని?
        ఎవరిదీ పాపం?
        తిలా పాపం తలా పిడికిడన్నట్లు
       ముందు చూపు లేని ప్రభుత్వానిదా?
       సమన్వయం లేని అధికారులదా?
       అవగాహన లేని ప్రజలదా?
       పాపం ఎవరిదైనా!
       ఆత్మీయులను గోదారికి అర్పించి
       హృదయం
       తూట్లు తూట్లుగా తునిగి పోతుంటే
       మరలిపోయేవారు తమ వేదనల చిచ్చు
       మరచిపోగలరా జీవనపర్యంతం
       పుణ్యానికి పోతే పాపమెదురైనట్లు
       ఎంత ఘోరం!
       అకాల మృత్యుబారిన పడిన వారి ఆత్మకు
      శాంతి కలగాలని ప్రార్ధించడం తప్ప
      మనమేమి చేయగలం?

Tuesday, July 14, 2015

మాతృభాషాబోధన


             ఒక తండ్రి తన కొడుకుని పరభాషా మాధ్యమం లో చదివించి నప్పుడు పడిన ఆవేదనను,మాతృభాష లో చదివించి నప్పుడు పొందిన ఆనందాన్ని ఇలా చెప్పాడు "పిల్లలు బడికి వెళ్ళినప్పుడు కొత్తప్రదేశానికి వెళ్ళి నట్లుగా ఉంటుంది.వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ,వాళ్ళ తోటలను,వాళ్ళ రోజు వారి జీవన విధానాన్ని వదిలి వెళ్తారు.తరగతి గదిలో కూర్చుని వాళ్ళ రోజూవారి జీవనానికి సంబంధం లేని కొత్త విషయాలను నేర్చుకుంటారు.కొత్త విషయాలను మాత్రమే నేర్చుకున్నందున సొంత విషయాలను తిరస్కరిస్తారు.గణుసు గడ్డలను తవ్వడానికి ఇష్టపడరు.మురికి పని అంటారు.నీళ్ళు తోడటం లో అమ్మకు సహాయం చేయరు.ఈ పనులను వారు చులకనగా చూస్తారు.పిల్లలలో చాలా మార్పు వచ్చింది.వాళ్ళు తల్లిదండ్రులకు విధేయం గా ఉండరు.రాస్కెల్స్ గా తయారవుతారు.వాళ్ళు బడికి వెళ్ళి మా పధ్ధతులను వదిలేసినందుకు ఈ విధంగా  జరుగుతుంది.ఇప్పుడు నా పిల్లవాడు టొక్ ప్లిస్ బడిలో ఉన్నాడు.తన ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు.ఇప్పుడు బడిలోనూ మా జీవన విధానాన్ని,మా పధ్ధతులను నేర్చుకుంటున్నాడు.ఇప్పుడు టొక్ ప్లిస్లో ఏది కావాలి నా రాయగలడు.తను చూసేవి మాత్రమే కాదు.తను ఆలోచించేవి కూడా! తన ప్రాంతాన్ని గురించి రాస్తాడు.తోటకి వెళ్ళడం గురించి,వాళ్ళ అమ్మ కు నీళ్ళు తోడటం లో సహాయ పడటం గురించి ,గణుసు గడ్డలు తవ్వడం గురించి రాస్తాడు.వీటి గురించి రాసినప్పుడు ఇవి అతనికి ముఖ్యమైనవిగా తోస్తాయి.బయటి విషయాలను గురించి చదవడం ,రాయడం మాత్రమే కాకుండా చదవడం,రాయడం ద్వారా మా జీవన విధానాన్ని గురించి గర్వపడడం నేర్చుకుంటున్నాడు.అతను పెద్దయ్యాక మమ్మల్ని తిరస్కరించడు.మన పిల్లలకు చదవను,రాయను బోధించడం ముఖ్యమే,కాని మన గురించి,వాళ్ళ గురించి గర్వపడటాన్ని బోధించడం ఇంకా ముఖ్యం."
             పాఠశాలలో మాతృభాషా బోధన ఉన్నప్పుడే రెండవ భాషను తేలికగా నేర్చుకో గలుగుతారు.ఉన్నత చదువులు చదివి ఎంతో కొంత ఙానం కలిగిన పట్టణ ప్రజలకే సరైన అవగాహన లేనప్పుడు  ఇంక పల్లె ప్రజలు మోజు పడటం లో తప్పేమున్నది.మాతృ. భాషా మాధ్యమం ద్వారా బోధించ కుండా పిల్లల్లోని సృజనాత్మకతను,తెలివితేటల్ని వికసించ కుండా చేస్తున్నాము.మన సంస్కృతి, సంప్రదాయాలకు కూడా దూరమై పోతున్నారు.సంతోషం లోనైనా,విచారం లోనైనా మనం " అమ్మా"అనే అంటాము.మాతృ భాష బాగా వచ్చిన వాళ్ళకు ఇతర భాషలు సులువు గా వస్తాయని అధ్యయనాలే చెబుతున్నాయి.కాబట్టి మన భాషను,నేర్చుకొని  నేను "తెలుగు వాడినని" అని గర్వంగా చాటుదాం.
           

Saturday, July 4, 2015

సహకారం


            రామయ్య అనే రైతు మొక్కజొన్న పంట పండించే వాడు.ప్రతి సంవత్సరం వ్యవసాయ ప్రదర్శనలో పాల్గొంటూ ప్రశంసలను, అనేక బహుమతులు పొందేవాడు.అతనితో పాటు చుట్టు పక్కల రైతులు కూడా అలాంటి  మొక్కజొన్ననే ప్రదర్శనకు తీసుకు రావడం గమనించిన ఒక విలేఖరి రామయ్యను "మీ పొరుగులతో రైతులతో ఈ విత్తనాన్ని ఎల పంచుకో గలిగారు"అని అడిగాడు.
       "గాలి పుప్పొడిని  పక్వమౌతున్న మొక్కజొన్న నుండి గ్రహించి అన్ని పొలాల మీదా జల్లుతుంది.చుట్టు పక్కల నాసిరకం  మొక్కజొన్న నాటితే నా పంట కూడా నాసిరకంగా తయారు అవుతుంది.నా పంట నాణ్యతగా ఉండాలంటే పక్క వారి పంట కూడా మంచి గా ఉండాలి.అందుకే సహాయం చేస్తున్నా."అని చెప్పాడు.
        రామయ్య పంట ద్వారా అద్భుతమైన  మానవ సంబంధాలను ఆవిష్కరించాడు.ఇరుగుపొరుగు సహకారం గా ప్రశాంతం గా ఉంటేనే మనము ప్రశాంతం గా ఉండగలం.విజయం సాధించ డానికి పట్టుదల,కృషి వ్యక్తిగతమైనప్పటికి  ఇతరుల సహకారం లేనిదే పొందలేము.
        సేంద్రీయ ఆహార పదార్ధాలకు నేడు ఆదరణ పెరుగుతోంది.రసాయన ఎరువులు వాడిన భూములు సాధారణ స్థితికి రావాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది.మనము ఒక్కరమే వేస్తే ఫలితముండదు.చుట్టూ రసాయన ఎరువుల పంటలు ఉండటం వలన గాలి కి  ఆ రసాయనాలు మన పంటకూ అంటు కుంటాయి.పక్క పొలం నుంచి వచ్చే నీరు కూడా పంటను కలుషితం చేస్తుంది.కాబట్టి  అందరి సహకారం తోనే సేంద్రీయ పంటలు పండించడం సాధ్యమౌతుంది.పైన రామయ్య కధలో చెప్పింది కూడా అదే."కలసి ఉంటే కలదు సుఖం,""సర్వే జన సుఖినో భవంతు" అనే భావనలు మన నరనరాల్లో జీర్ణించుకు పోయాయి.

Sunday, June 28, 2015

జానపదజానపద గేయం

జానపద గేయం

     ఎంతో సౌఖ్యము గల ఈ రాజయోగము ఏమని వర్ణింతునే  రామయ్య
     పంతముతో గుణవంతుల విని యానంత సుఖం బైతినే        "
     కన్నూల లోపల ఘనమైన చిత్కాళ లున్న జాడ గంటినే  "
     వెన్నెల మీదట వేదళకంజము వెలుగు దీప్తిని గంటినే         "


     పారావారము లేక పరిపూర్ణమై వెలుగు బ్రహ్మానందంబైతినే  "
    ఆరీటి మీరి ఆరీటి మీదట ఆత్మ నేనై యుంటినే.                                      "

    అంగము మీదట గంగ యమునల సందు లింగ మర్మము గంటినే.    "
   సదమలమై వెలుగు సచ్చిదానందము సాజయోగంబైతినే.          "
 
   కరుణతో గురుడు  నా శిరమందు కరమిడి ఎరుక ఏర్పడ జేసెనే.    "
   వేదాంతార్ధములోనె బోధ తెలిపెడి దండి సాధు సంగతి గంటినే "

   హరెరామ నేను మీ స్మరణ జేసుట వలన పరమభక్తుడనైతినే. "
   వర వైరాగ్యము చాత స్థిరబుధ్ధి సాక్షినై పరమ ధన్యుడ నైతినే "

   దరిజేరితే నేను ధన్యుడనైతిని నిరతము నను గావుమీ.                                "
    ంఅదికి నూర్ధ్వంబైన మంథెన్న నిలయా మీ మహిమ లేమన నందునే.   "
              
          ఈఇ గేయం కరీమ్నగర్ జిల్లాలోని  తాళ పత్రాలలో లభ్య మైనట్లుగా శ్రీ బిరుదురాజు రామరాజు గారు తెలిపారు.
     


     
      
      

Saturday, June 27, 2015

కవిచౌడప్ప



                తెలుగు సాహిత్యం లో శతక వాఙ్మయానికి  ప్రత్యేక స్థానం ఉంది.వేమన,సుమతీ శతకాల సరసన చేర్చదగిన మరో శతకం'కవి చౌడప్ప శతకం".
              ఈ శతక కర్త కుందవరపు చౌడప్ప.ఇతడు రఘునాధ రాయల సమకాలికుడు."అన్నిట మంచి వారు,విమలాత్ములు,హాస్య కళా ధురంధరుల్........." అన్న చాటు పద్యాన్ని బట్టి మట్ల అనంత భూపాలుని  ఆస్థానములో ఉన్నట్లు తెలుస్తోంది."హాస్య కవి జాణ",గాన విద్యా ప్రవీణుడు"అన్న బిరుదులను పొందాడు.తిట్టు కవి గా,బూతు కవిగా ప్రసిధ్ధి చెందాడు.కాని ఆనాటి  పరిస్థితుల పట్ల తన అసంతృప్తిని పరుష భాషలో నిర్భయంగా చెప్పిన ధీమంతుడు.కందం చెప్పడంలో తిక్కన అంతటి వాడనని చెప్పుకున్నాడు.
     "ముందుగ  చను దినములలో -కందమునకు సోమయాజి ఘనుడందురు నే
      డందరు నను ఘనుడందురు-కందమునకు కుందవరపు కవి చౌడప్పా!"
      వేమన వలెనే సంఘ దురాచారాలను తూర్పారబట్టాడు.ఏది చెప్పినా బలంగా,సూటిగా గుండెలకు తగిలేట్టు చెప్పగలడు.
   "తినజాలకయే ధర్మము-గనజాలక పరమలోభి కష్టుడు గూర్చెన్
    ధనమెల్ల నేలపాలని,గనుమప్పా కుందవరపు ......"
          మచ్చుకి ఇది ఒకటి.తిట్టు పద్యాలలో 'గాడిదాపద్యం ప్రసిధ్ధమైనది.
   "ఆడిన మాటలు తప్పిన-'గాడిద కొడూకంచు తిట్టగా విని ,మదిలో
    'వీడా నా కొడూకని ఏడ్చును-గాడిదయును కుందవరపు........"
 ఆధ్యాత్మక మైన పద్యాలు కూడా శతకం లో కనిపిస్తాయి.
   "అలసటవేసట నయినం...........గరుడధ్వజునిన్ దలచిన వారి చేరవు"
   "అతిధుల బంధు జనంబుల..........పూజించిన నరుడు సద్గతి నొదున్"
 ఇవి ఉదాహరణలుగా చెప్పవచ్చు.'పసాపద్యాల గురించి తెలుసుకోకపోతే ఇది అసమగ్రమే అవుతుంది.
   "పప్పే పస బాపలకును,-ఉప్పే పస రుచుల కెల్ల,ఉవిదల కెల్లన్
    కొప్పే పస ,దంతములకు-కప్పే పస..........."
   "మీసము పస్త మొగ మూతికి..........."
  కవి 'పసా అంతా ఈ పద్యాల వలన తెలుస్తుంది.అలాగే దేనికి ఏది పదిలమో చెప్పే చక్కటి  చాటువు ఒకటి
    "ఇంటికి పదిలము బీగము -వింటికి పదిలంబు నారి,వివరింపంగా
     చంటికి పదిలము రవికెయు -కంటికి పదిలంబు రెప్ప..........."
           భారవి,నాచన సోముడు,మాఘుడు,శ్రీ నాధుడు,పెధ్ధన,తిక్కన వంటి  పూర్వ కవుల పట్ల అభిమానాన్ని ప్రకటించుకున్నాడు.ఏవో కొన్ని పద్Yఆలు శృంగార పద్యాలు ఉన్నంత మాత్రాన బూతు కవి గా ప్రచారం చేయడం సమంజసమేనా? దేనిలోనైనా మంచిని తీసుకొని చెడుని వదిలేయడం వివేకవంతుల లక్షణం.

Friday, June 26, 2015

శునకోపాఖ్యానము


           రాత్రి పది అయ్యింది.టి.వి చూస్తూ కూర్చున్నాను.ఎదురింటివారి కుక్క గోలగోలగా అరుస్తోంది.రోడ్డుమీద ఎవరన్నా వెళుతున్నా అది అలాగే అరుస్తుంది.విశ్వాసం గల జంతువు కదా!
          రాము మా ఇంట్లో పనివాడు.'కుక్కలా విశ్వాసం గా'ఉంటాడు.అంతకు ముందు పనిచేసిన రాములమ్మకు ఎంతో ఆర్ధిక సహాయం చేసినా పని మానేసింది.ఒక ముద్ద అన్నం పెడితే మన చుట్టూ తిరుగుతుంది కుక్క.అందుకే 'కుక్కకు విశ్వాసం ఉంటుంది కాని మనిషికి ఉండదు.'పక్కింటి వారు వాచ్ మాన్ ను పెట్టుకున్నారు. వాడు 'కుక్కలా కాపలా కాస్తాడూ.
       మా ఆఫీసులో రామారావు వాళ్ళ అబ్బాయి కాలేజీ సీటుకి సహాయం చేయమని అడిగాడు.అంతకు ముందు నాకు చేయల్ లేదు 'కుక్క కాటుకి చెంప దెబ్బలా' నో అని చెప్పేశాను.సుమతీ శతక కారుడు కూడా 'కనకపు సిమ్హాసనమున శునకము కూర్చుండ బెట్టిన  వెనుకటి గుణం మారదాని చెప్పాడు.
        పక్కింటి పంకజం  గోడ మీదగా మా దొడ్లోని మందార పూలు  కోస్తూ కొమ్మలన్నీ విరిచేస్తోంది.తిరిగొచ్చి కోసుకోమని ఎన్నిసార్లు చెప్పిన 'కుక్క తోక వంకరాలా ఆమె గుణం మారదు.'కుక్క తోక పట్టుకొని గోదావరి ఈది నట్లు 'స్నేహితుడిని నమ్మి వ్యాపారం లో వాటా పెట్టినందుకు నట్టేట్లో ముంచేశాడు.
        మా బావమరిది కొడుకు ఉన్నత చదువులు చదివాడు కానీదాలి గుంట్లో కుక్క చందమునావివేకము శూన్యము.మా వీధిలో సుబ్బారావు ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు.ఎవరన్నా గట్టిగా సమాధానం చెబితే 'మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదాన్నట్లు ఇంట్లో కెళ్ళి బయటకు రాడు.రాజా రావు  రాజా(కుక్క)కు పుట్టినరోజు వేడుకలు ఘనం గా చేస్తున్నాడు.అది చూసి చద్ది అన్నం తప్ప ఎరుగని పనివాడు 'పేదవాడింట్లో పుట్టడం కన్నా ఉన్న వాడింట్లో కుక్కగా పుట్టాలానుకున్నాడు.
        దొంగ బీరువాలు వెతికినట్లు 'కుక్క ఇల్లు జొచ్చి కుండలూ వెతుకుతుంది.సుబ్బారావింట్లో రాము జామ కాయలు దొంగతనం చేసాడనీకుక్కను కొట్టినట్లు 'కొట్టాడు.అల్ప బుధ్ధి కలవారికి అధికారమిస్తే 'చెప్పు తినెడి కుక్కకు చెఱ్కు తీపి తెలియనట్లు ' విలువ తెలియదు కదా!అనసూయమ్మ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందీకుక్క వంటి ఆశ 'కూర్చోనీయదు మరి.'కక్కిన కుక్క దగ్గరకు ,కన్న కుక్క దగ్గరకు పగవారిని కూడా పంప వద్దని నీతి.'కుక్క యేమెరుగు గురు లింగ జంగంబూ.అంటారు.
          నేరస్థులను పట్టుకోవడం లో పోలీసులకి మార్గదర్శి.మాయలఫకీరు బలా నాగమ్మ ను కుక్క గా మార్చే కిడ్నాప్ చేశాడు.దేవదాసుకి తోడు కూడా శునకమే!
          "గ్రామ సిమ్హం "గా ప్రసిధ్ధి చెందినా,కాలభైరవుడిగా పూజ లందుకున్నా శునకం మనుషుల కన్నా విశ్వాసము కలది.విదేశాలలో ఒకొక్కరూ 3,4 కుక్కల్ని కూడా పెంచుతుంది కుంటారు.తమ ఆస్తులు మొత్తం కుక్కలకు వ్రాసిన ఘనులు కూడా ఉన్నారు.కుక్క మన జీవితాలలో ఏదో ఒక సంధర్బం గా గుర్తు చేసు కుంటూనే ఉంటాము.
          "కుక్క  ఉన్నది  జాగ్రత్త!"
       *************్********్*********్**********్***********్********్************్********