Saturday, January 15, 2011

మేలిపలుకుల మేలుకొలుపులు

మేలిపలుకుల మేలుకొలుపులు
తెలుగు పాఠకలోకానికి నిఝంగా మేలుకొలుపే.ముళ్ళపూడి వెంకట రమణగారి బహుమానం.ఎన్నో అద్భుత పుస్తకాలు అందించిన ఎమెస్కొ వారి ప్రచురణ. బాపు బొమ్మ ముఖచిత్రం గా మందపాటి అట్టతో ఆకర్షణీయంగా ఉంది .మద్యలో కూడ బాపు బొమ్మలు మనల్ని అలరిస్తాయి.పేజీలు కూడ మందంగా చాలా బాగున్నాయి.
ఇది తమిళ పాశురాలకు తెలుగు అనువాదము.యాభై,అరవై సంవత్సరాల క్రితమే అనువదించబడినప్పటికీ అవి వేదాంతసారానికే పరిమితమై భక్తి అనే చంద్రుడిని పాండిత్యమనే ఙ్ఞానమనే మేఘాలు కమ్మేసాయని తేట తెలుగు పాటలు రాలేదని ఆండాళమ్మ తల్లి అనుగ్రహంతో తనదైన రచనగా చేయాలని ప్రయత్నించిన ట్లుగా ముళ్ళపూడి వెంకట రమణ గారు ముందు మాటలో చెప్పారు.అది నూటికి నూరుపాళ్ళు నిజం.చిన్న చిన్న వాడుక పదాలతో పామరులు సహితము రసాస్వాదనము చేయగల కావ్యము. ముప్పది తమిళ పాశురాలు వాటికి తెలుగు అనువాదము ప్రతి అనువాదానికి బాపు బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా వెలువడినది.
సాధారణం గా భగవంతునికి భక్తులు మేలుకొలుపు పాడటం మనకు తెలుసు. కాని ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి తనను రేపల్లె గొల్లభామగా భావించి తన యీడు కన్నెపిల్లలందరికీ మేలుకొలుపు పాడుతూ తిరుప్పవై (సిరినోము) చేద్దాము రమ్మని ఆహ్వానిస్తుంది.
ఆనల్లానిస్వామి నడిగి పూలు పాలు పళ్ళూ ;కొబ్బరీబూరాలు తప్పెట్లు,తాళాలు ;తెచ్చుకోవాలమ్మ తెల్లారిపోకుండా
పల్లె పిల్లా మేలుకో
రే-పల్లెపిల్లా మేలుకో
ప్రతి పదమూ పల్లె పదమే. మార్గశిరనోము నోయడానికి కావలసిన సామగ్రిని బాలసింగం నడిగి తెచ్చుకోవాలని ఆనోము ఫలంగా స్వామినిపెండ్లాడ వచ్చుననీ గొల్లభామలను మేలుకొలుపుతుంది. తెలుగింటి ఆడపడచు అమాయకత్వం ఇందులో ప్రతిఫలిస్తుంది.
" స్నానమంటే యమునలో
చలిమునకలేస్తే చాలదంట " మనసులోని మలినమంతా కడిగి వెయ్యాలంట. లౌకికమైన భావన ఎంత చక్కగా చెప్పారు.
"- పూలు విరగబూయాలి చేలన్నీపండాలి
చేలలోని నీటిలోన మీలుతుళ్ళిఎగరాలి" నెలకు మూడు వానలు కురిసి రేపల్లె సిరిసంపదలతో తులతూగాలని కోరుతుంది.ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని సర్వేజనా సుఖినో భవంతు అనే భావంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. కాకితోనిదరోయికోడితోలేవాలీ --వంటి సూక్తులు ఇందులో కనిపిస్తాయి.
అహంకారమమకార వికారపు కుబుసాలను విడిచి
నీ పాదాల చెంత నిలిచీ--
కర్తా కర్మ క్రియా నీవేయగుచు
తల్లి తండ్రి యు దైవమ్ము నీవె యగుచు ---సర్వం వదిలి ఆత్మ నివేదన కావించుకున్న స్వచ్ఛమైన భక్తి పారవశ్యము ఆమెలో కనిపిస్తాయి. సహజమైన కన్నె కోరికలతోపాటు ప్రసాదపు రుచినీ తెలియ జేస్తుంది. అంతలోనీ మానవ జీవితానికి నిఝంగా కావలిసిన కోరికను ఇలాచెప్తుంది.
నీతోటి సఖ్యము కావాలని అదే నిత్యం అదే సత్యం అని భావిస్తుంది. ఎడేడు జన్మలకు మాకు కావలసింది నీవేసుమ్ము నీప్రేమే సుమ్మా -అని తన నిశ్చల భక్తిని చాటుతుంది.
చివరకు గోదాదేవి ఆముక్త మాల్యదగా రంగనాధుని చేరుకున్నది. ఇది చదివి పాడీ ,పాడించుకున్న వారు ధన్యులై ఆనందలోకాలను అందుకోగలరని ఫలశ్రుతిని చెప్పారు శ్రీరమణ గారు.తేట తెలుగు పదాలలోని తేనె రుచిని పాఠకులకు అందించిన రమణ గారికి కృత ఙ్ఞతలు తెలియజేయడం తెలుగువారిగామన బాధ్యత .ఇంతచక్కని ఆకర్షణీ యమైన పుస్తకాన్ని అందించిన ఎమెస్కో వారు అభినందనీయులు.

Monday, January 10, 2011

మంచి మాట

విజయాన్ని కోరే వ్యక్తులు రెండు విషయాలు మరచిపోరాదు. ఒకటిమౌనం,రెండు చిరునవ్వు.చిరునవ్వుసమస్యలను పరిష్కరిస్తీ మౌనం సమస్య రానీయదు.

మనసు

మసకబారిన మనసుకు
పెనుచీకట్లే తప్ప
వెన్నెల వెలుగులు కానరావు
అసూయతో అంటకాగే
మనసుకు
అనురాగపు రుచి తెలియదు
కుళ్ళుతో కుచించుకు పోయే
మనసుకు
కూరిమిలోని కలిమి అర్థం కాదు
జడత్వం పేరుకుపోయిన
మనసు
చలనత్వాన్ని చేరువకు రానీయదు
ఏచికిత్సకు అందని ఆ మనసుపై
గుప్పెడు సానుభూతిని గుమ్మరించడం తప్ప
గుబాళింపులు నేర్పలేము
భానుడి తేజంలా జీవించ గలిగే
ఘడియఒక్కటి చాలదా
పరిపూర్ణ జీవిత ఫలాన్ని పొందటానికి?