Saturday, December 31, 2011

శుభాకాంక్షలు

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.
2012,మధురంగా,మధురమైన భావాలతో,మధురమైన భాషతో,మధురూహలతో,మిత్రులందరకూ నూతనసంవత్సరం హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ.............లక్ష్మి

Wednesday, December 28, 2011

యోగము

యోగమనగా ప్రత్యగాత్మకు పరమాత్మకు ఐక్య సంబంధము.అనగా మనస్సును అనేక రీతుల సంచరింపనీయక ,తన యందేమగ్నము చేసికొనుట ఇంద్రియములను వశపరచుకొని చిత్తము ఈశ్వరుని యందు లయింప చేయుటయే యోగమనబడును. యోగశాస్త్రములను చదివినంత మాత్రముననే యోగీశ్వరుడు కాజాలడు. సాధన చతుష్టయ సంపత్తి కలిగిన మీదట సమాధి స్థితి కలుగును. ఆ సమాధి వలన ముక్తి లభించ గలదు. యోగసిధ్ధి అనుదినము రెండు ఝాములు అలవాటు చేసిన నిశ్చల చిత్తవృత్తి గల నరునకు ఆరు మాసములందును, మంద్ర ప్రజ్ఞునకు పన్నెండు మాసములు మూడాత్మునకు పన్నెండు సంవత్సరముల యందును సిధ్ధించును.
మూలాధారం గుదస్థానం, స్వాధిష్టానం తు మేహనం
నాభిస్తు మణిపూర్వాఖ్యాం ,హృదయాబ్జ మనా హతం,
తారుమూలం విశుధ్ధాఖ్యాం, ఆజ్ఞాఖ్యాం విఠలాంబుజం,
సహస్రారం బ్రహ్మరంద్రంచ ,మిధ్యాఅగమ న విదోవిదుహు.
ఆజ్ఞాచక్రం ఓం ఈశ్వరుడు
విశుధము యం జీవుడు
అనాహతం వా రుద్రుడు
మణిపూరకము శి లక్ష్మి,విష్ణువు
స్వాధిష్టానం మ సరస్వ తి,బ్రహ్మ
మూలాధారం న వినాయకుడు
ఇది సహస్రారం. ఇందు దృష్టిని నిలిపిన శబ్దమంతయు అణగి ప్రణవనాద మనెడు ఓం కారము వినబడును. అటుల అభ్యాసము చేయగా చెయగా ప్రణవనాదము తగ్గి స్వ ప్రకాశము కనబడును. దానినే ఆత్మజ్యోతి అనియెరుంగుము.

Monday, December 26, 2011

మంచి మాట

ఆవేశం, ఆలోచనని అణచి వేస్తుంది.ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకే ఈకష్టం ఎందుకు వచ్చిందనో,సమస్యకు కారకులైన వారిని నిందిస్తూ ఉండటం వల్ల పరిష్కారం కాదు. వివేచనతో సమస్యను గట్టెక్కడానికి ప్రయత్నం చేయాలి.

Saturday, December 24, 2011

మంచి మాట

అర్థం లేని శ్రమ ,అలసట లేని విశ్రాంతి వ్యర్థం. ఎందుకు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో తెలియకుండా కష్టపడటం ,ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలనుకోవడం అవివేకం.

Thursday, December 22, 2011

మంచి మాట

మనిషికి వృధ్ధాప్యం రావచ్చు కానీ మనసుకి వృధ్ధాప్యం రాకూడదు. వయస్సును ఆపే శక్తి మనకు లేదు కాని మనస్సును శక్తి వంతం చేయటం మన చేతుల్లోనే ఉంటుంది.

Thursday, December 15, 2011

మంచి మాట

శ్రమించని మేధావి వర్షించని మేఘం వంటి వాడు.మేఘం లో ఎంత నీరున్నావర్షించక పోతే దాని వలన ప్రయోజనం లేదు. అలాగే పండితుడు కష్టపడక పోతే దానివలన తనకు ఇతరులకు కూడా ప్రయోజనం ఉండదు.

Saturday, December 10, 2011

మంచి మాట

అహంకారం ,అసూయ, ఆత్మస్తుతి ,అలసత్వం వదిలితె మనంత మంచి వాళ్ళు ఉండరు.

Tuesday, December 6, 2011

మంచి మాట

ఏ పనులు మాటల వలన మనము బాధ పడతామో ఆపనులు మాటలుమనము చేయ కుండా ఉండటమే అన్ని ధర్మముల కన్నా మనము అనుసరించ దగి గొప్ప ధర్మము

Monday, December 5, 2011

డాక్టర్ భోగరాజు పట్టాభిశీతారామయ్య

అపారమైన ఙాపకశక్తితో తిరుగులేనితర్కంతో అంకెలతో లెక్కలతోప్రతిదీ సిధాంతీకరిస్తూ ఆబాలగోపాలం చెవులు రిక్కించుకొని తదేక ధ్యానంతోఆలకిస్తుండగా అనర్గళంగా ఉపన్యసించడంలో ఆయనకు ఆయనే సాటి.ఒకవైపు ఉద్యమాగ్నిలో కాకలు తీరుతూనే మరొకవైపు భీమాసంస్థలు బ్యాంకుల నెన్నింటినోనెలకొల్పి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ను రూపుదిద్దడంలో అనుపమానమైన పాత్ర వహించినమహామనీషి అప్రతిమానమైన ఆంధ్రత్వానికి చిహ్నమై వెలసినధన్య జీవి పట్టాభిశీతారామయ్య గారు.
ఆయన పుట్టింది నేటి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో1880,నవంబర్24 న.ఉన్నతవిద్యాభ్యాసం ఏలూరు,మచిలీపట్టణాలలో.జరిగింది. బ్రహ్మర్షిగా పేరుపొందిన రఘుపతి వెంకటరత్నం నాయుడు,చెన్నాప్రగడ భానుమూర్తి వంటి మహనీయుల శిష్యులై విద్యాభ్యాసం చీశారు. ఆయనకు ముట్నూరి కృష్ణా రావు గారితోను,కోపల్లె హనుమంతరావుగారితోను స్నేహం ఏర్పడింది. వీరు త్రిమూర్తులుగా పిలవబడేవారు.మద్రాసులో బి.ఎ చదివేరోజులలో గాంధీ గారితో పరిచయం ఏర్పడింది. కాకినాడ వాస్తవ్యులు గంజాం వెంకట రత్నం గారి కుమార్తెతోవివాహం జరిగాక ఎం.బి.సి.ఎం. చదివారు. అనంతరం బందరులోవైద్య వృత్తిని ప్రారంభించి రోగనిధానం చేయడంలో ప్రఖ్యాతి గడించారు.
భారతదేశ సేవాచరిత్రలో మూడు విషయాలు ఆయన శాశ్వత ప్రతిష్ట్టకు కారణమైనాయి. భాషాప్రయుక్త రాష్ట్ర పునర్విభజనకు ఆయన అనుపమానమైన సమర్ధన మొదటిది. 1908 నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అవిరళ కృషి చేశారు. "రాష్ట్రాల పునర్విభజననుగురించిసర్వ విషయాలు నీకు తెలుసు కనుక భారత దేశాన్ని అభిమతానుసారం సక్రమంగా విభజించు" అని గాంధీజీ ఆదేశించారు.అర్ధశతాబ్ది కృషి ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది."ఆంధ్రరాష్ట్రోద్యమ జనకులు"గా జనం హర్షంతో గౌరవించారు.
కాంగ్రెస్ వారిలో ఎవ్వరికీ సంస్థాన ప్రజల యెడ సానుభూతి లేని సమయంలోవారికి తాను అండగా నిలిచి చేసిన అమూల్యసేవరెండవది.స్వదేశ సంస్థాన ప్రజల సంస్థనొక దానిని స్థాపించి ,పట్టభిగారు దానికి ఫౌండర్ ,ప్రెసిడెంటుగా,బల్వంతరాయ్ మెహతా సెక్రటరీగా వ్యవహరించారు. ఆసేతు హిమాచలపర్యంతం పర్యటించి ప్రజల్లో చైతన్యం కలిగించి సంస్థానాల విచ్చిత్తికి పునాదులు వేసిన ఘనత వీరిదే. 1936లో కరాచీలో జరిగిన దేశీయ సంస్థానాల ప్రజల పౌరసత్వములను గురించి వీరు చేసిన ఉపన్యాసం చిరస్మరణీయమైనది.
ప్రపంచం అనేక వాదాలతో చిన్నాభిన్నమై ఆందోళన పడుతున్న సమయంలో కూడా గాంధీ వాదం లోని ప్రధాన సూత్రాల యెడ ఆయన చూపిన అచంచల విశ్వాసం మూడవది. బార్డోలీ సత్యాగ్రహ సంధర్భంలోను,ఉప్పు సత్యాగ్రహ సంధర్భంలోను గాంధీజీని సపూర్ణంగా బలపరచి అనేకులను కార్యోన్ముఖులుగా చేసిన కీర్తి పట్టాభికే దక్కింది.
ఇవిమూడు ఒకేత్తు ఆయన స్థాపించిన విద్యాసంస్థ్స్లు,బ్యాంకులస్థాపన,హరిజనోధ్ధరణ, గ్రామాలలో చిన్న తరహా పరిశ్రమలు,చేతిపనుల అభివృధి ఒక ఎత్తు.1910లో బందరులో జాతీయ కళాశాల స్థాపించి హరిజన విద్యార్ధులను కూడా అగ్ర వర్ణాల సరసన కూర్చొని చదువు కోడానికి ఏర్పాటు చేశారు.1923లో ఆంధ్రాబ్యంకు స్థాపన బందరులో జరిపి దేశంలో ఒక విశిష్ట స్థానాన్ని ఆపురాతన పట్టణానికి కలిగించారు. 1929లో భారత లక్ష్మీ బ్యాంకు 1925లో ఆంధ్రా ఇన్సూరెన్సు కంపినీ 1935లో హిందూస్థాన్ ఇన్సూరెన్సు కంపినీ ప్రారంభించారు. కృష్ణా కోపరేటివ్ బ్యాంకు స్థాపించిన గౌరవం కూడా పట్టాభి గారిదే,ఆంధ్ర సహకార పత్రికను స్థాపించి సహకారోద్యమానికి ఎంతో దోహదపడ్డరు.
పట్టాభి బహు గ్రంధ కర్త కూడా. కాంగ్రెస్ చరిత్ర ,జాతియవిద్య .గాంధీ సిధ్ధాంతం- సామ్యవాదం.భాషాప్రయుక్థ, రాష్ట్ర విభజన,ఖద్దరుఫెదర్స్ అండ్ స్టోన్స్ ,హిందూహోమరీడిస్కవర్డ్,మొదలగు గ్రంధాలు రచించాడు.
రాజకీయ దక్షుడుగా పేరెన్నికగన్నప్పటికీ ఆయన పెద్ద పదవులను నిర్వహించలేదు. 1948లో కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. 1952లో మధ్యప్రదేశ్ గవర్నరుగా నియమింపబడ్డరు.1957 వరకు ఆపదవిని నిర్వహించారు.
1919లోజన్మ భూమి అనేఆంగ్ల పత్రికను స్థాపించి 1930 వరకు నిర్వహించారు. సమర్ధవంతమైన నిర్వహణ తీరును గమనించిన మోతీలాల్ నెహ్రు తన ది ఇండిపెండెన్స్ పత్రికను నడిపే బాధ్యతను అప్పగించారు.1938లో స్టేట్స్ పీపుల్ అనే మాస పత్రికను తన సంపాదకత్వం లో వెలువరించారు. మంచి వాదనాపటిమగల వ్యక్తి. 1917లో అనిబిసెంటు తో ఆంధ్రా కాంగ్రెస్ ను గూర్చి వాదించు సంధర్భమున 1921లో అహ్మదాబాద్లో పార్లమెంట్ సభ్యుడగు వెడ్జిఉడ్ తోచర్చించి నపుడు పట్టాభిని పెద్దలు ప్రశంశించారు. ఆయన ఉపన్యసాలు విలక్షణ వర్ణనలతోను, విఘ్ఙాన దాయకములై సామెతలతోనునిండి నిబిడీకృతములై ఉంటాయి. సంస్కృత ,హిందీ,ఉర్దూ భాషలలో కూడా ఉపన్యాసాలిచేవారు.
చిన్నతనంలో దరిద్ర్యం అనుభవించటం చేత డభ్భును.దుర్వినియోగం చేసేవారు కాదు. ఆయన చలోక్తిగా--ప్రకాసం గారికి రేపు అనేది లేదు .నాకు రేపు,ఎల్లుండి కూడా ఉన్నయి.
ప్రతి విషయాన్ని అతిసూక్ష్మం గా గ్రహిస్తాడు.విద్యుదుద్వేగంతో నిర్ణయాలు చేస్తాడు.మేధా సంపన్నులైన పట్టాభి గారు ఆరోగ్యం క్షీణించి 1959,డిసెంబర్ 17న కన్నుమూసారు.
బహు గ్రంధ కర్తగాను, మహావక్తగాను, ఆంధ్ర దేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకును స్థాపించినవాడు గాను.బహుముఖ ప్రఙాశాలిగాను,ఆంధ్రులహృదయాలలోనే కాక భరత ప్రజల అందరి హృదయాలలోను నిలిచిఉంటారు.
1994,నవంబర్న రేడియో ప్రసంగం చేయబడినది

Sunday, December 4, 2011

తొలి పొద్దు ఉషస్సులో
మలి పొద్దు హవిస్సులో
సగటు మానవుని తపస్సు
చెదరక అది కాగలదు యశస్సు
చెదిరిందా అది తమస్సు.

Friday, October 21, 2011

జీవనం

రాయాలని ఉన్నా
రాయలేని భావనైరాశ్యం
తనదికాని భావాన్ని ఎక్కడో వెతుక్కునే వెలితిని
సంధ్యారుణ కాంతులకై వెతికి చూచే విషాదాన్ని
భావదారిద్ర్యం పట్టి పీడించడం విచారమే
మనస్సే కందకం కాగా
పట్టు దొరక్క కాల్జారి పోతున్న పరాధీనతకు
పట్టు కావాల్సిన ఆవేశం,ఆలోచన
భరించలేని అవ్యక్తాలబరువుతో క్రుంగిపోతుంటే
కాలంతో పరిగెత్తలేను
పరుగెత్తి భీభత్స భయోత్పాతాలనుసృష్టించ లేను
చిక్కబట్టుకున్న మనస్సుతో
భావతాదాత్మ్యత చెందాలని
జీవనం జీవం ఉండేటట్లు చేయాలని భావించాను.

Thursday, October 20, 2011

నాయని subbaraau

అనుభవైకవేద్యము,హృదయరంజకము అయినకవితాకర్త నాయని సుబ్బారావు..నెల్లూరుజిల్లా పొదిలి గ్రామంలో20 అక్టొబర్1899 లోజన్మించారు. కుటుంబ వాతావరణం ఆయనకు కవితా సంస్కారం నేర్పింది.పినతండ్రి జానపదగాధలు బాగాతెలిసిన వాడు. గాంధీజీ పిలుపుతోచదువు మధ్యలోఆపిసహాయ నిరాకరణ వుధ్యమంలో పాల్గొన్నాడు. సౌభద్రుని ప్రణయ యాత్ర తోకవితారంభం కావించిన నాయని1925 నాటికి పూర్తిరూపాన్ని
ఇచ్చినారు,కులపాలికాప్రణయావిష్కారాన్ని భావ కవితా శాఖలో ప్రతిష్టించిన కవి.
యాత్ర అనే శబ్దాన్ని పలువురుకవులు వాడినప్పటికీ ప్రణయ యాత్ర అనినాయని తప్ప మరెవరు వ్రాసినట్లు కనబడదు.సుభద్రకుమారుడు సౌభద్రుడు.బలరాముడు తనకుమార్తెనుపాండవులు అఙాతవాసం లోఉండడంతో లక్ష్మన కుమారునికి ఇచ్చిచెయాలని అనుకుంటాడు.నాయనిప్రేమకధ దీనినిపోలిఉంటుంది.ప్రణయానికి వివాహమే సాఫల్యసిద్దిగాచెప్పబడుతుంది.అంతశ్రమపడి పావనమభ్రగంగ ధారుణికి తెచ్చినాడుభగీరధుడు. అన్ననాయని గీతంలో భావనాలోకవిహారీయిన ప్రణయం భౌతికలోకానికి తీసుకురావడం సూచితమైనది.ఫలస్రుతిలో మనముమేనత్తమేనమమలబలమ్ము అనితమది మేన సంబందమని భార్య వత్సల అనితెలియజేసినాడు. ఆమెను ఉపాసనాధిదే వతగా జీవనధాత్రిగా పరాత్పరంగావర్ణించినాడు.ప్రేయసికిప్రియునిహృదయం స్థానమని చెప్పి స్త్రీకి గల స్థానాన్ని ప్రాధాన్యాన్ని ధ్వనింపజేసినాడు.స్త్రీలేకుండా పురుషుడు యష్టి మాత్రుడు.ఆమెలేకుండాతడు యజ్ఙాదులు అతిధిదేవపూజలు చేయడానికి అనర్హుడని తెలియజేసినాడు .మల్లెపూవుగా,మలయ పవనంగా,గులాబిగా,పికముగా,సారసముగా, భ్రమరకాంతగా,వానచినుకుగా భావనచేశాడు. ప్రకృతి సౌందర్యమే తనప్రేయసి అని సూచన చేసినట్లుంది. అందుకే విశ్వనాధ ఒకలోకోత్తరమైన అనుభూతి వచ్చేటప్పటికి అతని గీతాశక్తి పండిన దానిమ్మ కాయవలె పగిలింది అంటారు.తల్లి మరణించిన దుః ఖంలో మాతృగీతాలు వ్రాసారు. ఎవ్వడాక్రూరకర్మట్టుడు ఎవడునీల జలద నిర్ముక్త శైశిర శర్వరీ ప్రశాంత మలవాటు పడిన నిశాంత మందు అకటనట్టింట దీపమ్ము నార్పినాడు.అని దఃఖించినాడు.కుమారుని మరణం విషాదమోహనంగా వెలువడినది.తన జన్మస్థలం పొదిలి చుట్టూ అల్లబడిన కావ్యం జన్మభూమిని1960లో వ్రాసారు. భారతీయసంస్కృతి జాతిజీవనవిధానం అభివ్యక్తం కావడం వలన ప్రతి భారతీయుదు తన జన్మభూమిని ఇందు దర్సించవచ్చు.నాయని మితభాషి. శాంతిప్రియుడు.మంచిహాస్యప్రియుడు. రేడియోలో పనిచేసినాఇదు సంవత్సరాలకాలంలో అనేక నాటికలు కథలు, పాటలువ్రశారు.వలపులో,విరహంలో, వేదనలోమాతృప్రేమలోఈయన కవిత్వానికిహృదయంగీటురాయి.ప్రతిపదంలోనుజీవిస్తారు.అందుకేనాయని గీతాలు ఉజ్జ్వలములు,ఉన్నతములు ఈరోజు నాయని జన్మదిన సందర్భంగా ఆయనను స్మరించుకోవడం తెలుగువారిగా మన కర్తవ్యం.

Sunday, October 2, 2011

వార్త

ఇరవైనాలుగు గంటల న్యూస్ చానల్స్ వచ్చినాక వార్తలకు కొదువ లేదు.అప్రస్తుతమైనది ,అనవసరమైనవిషయాలు ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి.ఈ రోజు ఆంధ్ర జ్యొతి చానల్ లో చూపిన వార్త మన ముఖ్యమంత్రి
గారు గాంధి సమాధికి నివాళులు అర్పించటానికి వెళ్ళి తూలిపడబోయారట అది వార్త అదే విషయాన్ని రివైండ్ చేసి పదేపదే ఆ క్లిప్పింగ్ చూపవలసిన అవసరము ఉన్నదా?అది అంత ముఖ్యమైన విషయమా?హైలెట్ చేసి చెప్ప టానికి.వ్యక్తుల జీవితాలలోకి తొంగి చూడటం అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటైపోయింది. అది ఎదుటివారికి ఎంత ఇబ్బందిని కలుగ చేస్తుందో అన్న ఆలోచన ఎంతమాత్రం ఉన్నట్లు కనిపించదు.కనీస విలువలను సంస్కారాన్ని కూడా పాటించటం లేదు .అన్ని చానల్సు ఇంచు మించు అలాగే ఉన్నాయి.

Wednesday, May 11, 2011

మంచి మాట

మంచి మాట
నీ పై నీకు నమ్మకం పోతే నీవు జీవన్మృతుడవే.ఎన్నిసమస్యలువచ్చినా పరిష్కారం ఆలోచించాలి కాని విచారిస్తూ వుంటే సమస్య తీరదు. నేను చేయగలను అనే నమ్మకం మనల్ని విజయ సోపానాల్ని ఎక్కిస్తే నేనే చేయగలను అనే అహంకారం మనల్ని అధోగతి పాలుచేస్తుంది.

మంచి మాట

మంచి మాట
నీ పై నీకు నమ్మకం పోతే నీవు జీవన్మృతుడవే.ఎన్నిసమస్యలువచ్చినా పరిష్కారం ఆలోచించాలి కాని విచారిస్తూ వుంటే సమస్య తీరదు. నేను చేయగలను అనే నమ్మకం మనల్ని విజయ సోపానాల్ని ఎక్కిస్తే నేనే చేయగలను అనే అహంకారం మనల్ని అధోగతి పాలుచేస్తుంది.

Sunday, May 8, 2011

అమ్మ

అనురాగ మమకారాలకలబోతే
అమ్మ,
గర్భస్థంగా ఊపిరిపోసి
ప్రాణధారనే పంచి పాలబువ్వతినిపించి
తన చిటికిన వేలుతో తొలి అడుగులు వేయించి
మనిషిగాఎదిగేందుకు
మంచిని పంచేందుకు
శతకాలెన్నో నేర్పి
వీరమాతల కధలెన్నో చెప్పి
నిన్ను వ్యక్తిగా తీర్చి
మాచిన్ని కుమారుడు అన్యమెరుగడన్న
యశోదమ్మ చందాన
నీ తప్పులను తన తప్పులుగా
చేసుకొని,
ఆకాశమంత ఎదిగిన నిను గాంచి
తనే ఎదిగినంత ఆనందపడే
అమ్మే ప్రధమ గణ్యం
జాతి,కుల,మత భేదాలు లేనిది
అమ్మతనం
యుగాలు మారినా, కాలాలు మారినా
అమ్మ అమ్మే
అమ్మ ప్రేమ
సముద్రమంత లోతైనది,విశాలమైనది
కడవరకు మనకంటిపాపలా వుండే
తల్లికి
ఒక దినోత్సవం
అది మన భాగ్యమా?దౌర్భాగ్యమా?

Saturday, January 15, 2011

మేలిపలుకుల మేలుకొలుపులు

మేలిపలుకుల మేలుకొలుపులు
తెలుగు పాఠకలోకానికి నిఝంగా మేలుకొలుపే.ముళ్ళపూడి వెంకట రమణగారి బహుమానం.ఎన్నో అద్భుత పుస్తకాలు అందించిన ఎమెస్కొ వారి ప్రచురణ. బాపు బొమ్మ ముఖచిత్రం గా మందపాటి అట్టతో ఆకర్షణీయంగా ఉంది .మద్యలో కూడ బాపు బొమ్మలు మనల్ని అలరిస్తాయి.పేజీలు కూడ మందంగా చాలా బాగున్నాయి.
ఇది తమిళ పాశురాలకు తెలుగు అనువాదము.యాభై,అరవై సంవత్సరాల క్రితమే అనువదించబడినప్పటికీ అవి వేదాంతసారానికే పరిమితమై భక్తి అనే చంద్రుడిని పాండిత్యమనే ఙ్ఞానమనే మేఘాలు కమ్మేసాయని తేట తెలుగు పాటలు రాలేదని ఆండాళమ్మ తల్లి అనుగ్రహంతో తనదైన రచనగా చేయాలని ప్రయత్నించిన ట్లుగా ముళ్ళపూడి వెంకట రమణ గారు ముందు మాటలో చెప్పారు.అది నూటికి నూరుపాళ్ళు నిజం.చిన్న చిన్న వాడుక పదాలతో పామరులు సహితము రసాస్వాదనము చేయగల కావ్యము. ముప్పది తమిళ పాశురాలు వాటికి తెలుగు అనువాదము ప్రతి అనువాదానికి బాపు బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా వెలువడినది.
సాధారణం గా భగవంతునికి భక్తులు మేలుకొలుపు పాడటం మనకు తెలుసు. కాని ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి తనను రేపల్లె గొల్లభామగా భావించి తన యీడు కన్నెపిల్లలందరికీ మేలుకొలుపు పాడుతూ తిరుప్పవై (సిరినోము) చేద్దాము రమ్మని ఆహ్వానిస్తుంది.
ఆనల్లానిస్వామి నడిగి పూలు పాలు పళ్ళూ ;కొబ్బరీబూరాలు తప్పెట్లు,తాళాలు ;తెచ్చుకోవాలమ్మ తెల్లారిపోకుండా
పల్లె పిల్లా మేలుకో
రే-పల్లెపిల్లా మేలుకో
ప్రతి పదమూ పల్లె పదమే. మార్గశిరనోము నోయడానికి కావలసిన సామగ్రిని బాలసింగం నడిగి తెచ్చుకోవాలని ఆనోము ఫలంగా స్వామినిపెండ్లాడ వచ్చుననీ గొల్లభామలను మేలుకొలుపుతుంది. తెలుగింటి ఆడపడచు అమాయకత్వం ఇందులో ప్రతిఫలిస్తుంది.
" స్నానమంటే యమునలో
చలిమునకలేస్తే చాలదంట " మనసులోని మలినమంతా కడిగి వెయ్యాలంట. లౌకికమైన భావన ఎంత చక్కగా చెప్పారు.
"- పూలు విరగబూయాలి చేలన్నీపండాలి
చేలలోని నీటిలోన మీలుతుళ్ళిఎగరాలి" నెలకు మూడు వానలు కురిసి రేపల్లె సిరిసంపదలతో తులతూగాలని కోరుతుంది.ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని సర్వేజనా సుఖినో భవంతు అనే భావంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. కాకితోనిదరోయికోడితోలేవాలీ --వంటి సూక్తులు ఇందులో కనిపిస్తాయి.
అహంకారమమకార వికారపు కుబుసాలను విడిచి
నీ పాదాల చెంత నిలిచీ--
కర్తా కర్మ క్రియా నీవేయగుచు
తల్లి తండ్రి యు దైవమ్ము నీవె యగుచు ---సర్వం వదిలి ఆత్మ నివేదన కావించుకున్న స్వచ్ఛమైన భక్తి పారవశ్యము ఆమెలో కనిపిస్తాయి. సహజమైన కన్నె కోరికలతోపాటు ప్రసాదపు రుచినీ తెలియ జేస్తుంది. అంతలోనీ మానవ జీవితానికి నిఝంగా కావలిసిన కోరికను ఇలాచెప్తుంది.
నీతోటి సఖ్యము కావాలని అదే నిత్యం అదే సత్యం అని భావిస్తుంది. ఎడేడు జన్మలకు మాకు కావలసింది నీవేసుమ్ము నీప్రేమే సుమ్మా -అని తన నిశ్చల భక్తిని చాటుతుంది.
చివరకు గోదాదేవి ఆముక్త మాల్యదగా రంగనాధుని చేరుకున్నది. ఇది చదివి పాడీ ,పాడించుకున్న వారు ధన్యులై ఆనందలోకాలను అందుకోగలరని ఫలశ్రుతిని చెప్పారు శ్రీరమణ గారు.తేట తెలుగు పదాలలోని తేనె రుచిని పాఠకులకు అందించిన రమణ గారికి కృత ఙ్ఞతలు తెలియజేయడం తెలుగువారిగామన బాధ్యత .ఇంతచక్కని ఆకర్షణీ యమైన పుస్తకాన్ని అందించిన ఎమెస్కో వారు అభినందనీయులు.

Monday, January 10, 2011

మంచి మాట

విజయాన్ని కోరే వ్యక్తులు రెండు విషయాలు మరచిపోరాదు. ఒకటిమౌనం,రెండు చిరునవ్వు.చిరునవ్వుసమస్యలను పరిష్కరిస్తీ మౌనం సమస్య రానీయదు.

మనసు

మసకబారిన మనసుకు
పెనుచీకట్లే తప్ప
వెన్నెల వెలుగులు కానరావు
అసూయతో అంటకాగే
మనసుకు
అనురాగపు రుచి తెలియదు
కుళ్ళుతో కుచించుకు పోయే
మనసుకు
కూరిమిలోని కలిమి అర్థం కాదు
జడత్వం పేరుకుపోయిన
మనసు
చలనత్వాన్ని చేరువకు రానీయదు
ఏచికిత్సకు అందని ఆ మనసుపై
గుప్పెడు సానుభూతిని గుమ్మరించడం తప్ప
గుబాళింపులు నేర్పలేము
భానుడి తేజంలా జీవించ గలిగే
ఘడియఒక్కటి చాలదా
పరిపూర్ణ జీవిత ఫలాన్ని పొందటానికి?