Sunday, January 29, 2012

పిల్లలు-క్రమశిక్షణ

నేడు పిల్లల పెంపకము కత్తి మీదసాములాగా తయ్యారైనది. పూర్వం తాతలు,అమ్మమ్మలు,పెదనాన్నలు,పెద్దమ్మలుఇంత మంది పెద్దల మధ్య పెరిగేవారు.వారికి ప్రత్యేకించి మంచి చెడు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు.వారి ప్రవర్తన నుండి మాటలను బట్టి సహజంగా నేర్చుకొనేవారు.ఇప్పటి కాలంలో పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత కేవలం తల్లి,తండ్రుల మీద ఉంటున్నది. చిన్నప్పటి నుండి వారు తమ దృష్టిని పిల్లల మీద కేంద్రీక రించవలసి వస్తోంది.
తల్లి బిడ్డపై చెరగని ముద్ర వేస్తుంది.బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఆలోచనావిధానం ప్రవర్తన బిడ్డలో ఏ రకమైన భావాలు ఏర్పడతాయో నిర్ధేశిస్తాయని మన ప్రాచీన సాహిత్యంలోనేగాక ఆధునిక పరిశొధనలూ నిరూపిస్తున్నాయి. అనగా తల్లి గర్భమే బిడ్డ తొలి పాఠశాల.తరువాత కుటుంబం,సమాజం మలి పాఠాలను నేర్పుతాయి.తల్లిదండ్రులు తమ జీవితం ద్వారా ఙానాన్ని,నీతి,నిజాయతీ,సత్ప్రవర్తన వంటి అంశాలను ఆచరించి చూపటం ద్వారా పిల్లలకు మార్గదర్శులు అవుతారు. అంతేగాని అవి ఒకరు బోధిస్తే వచ్చేవికావు. మాతృత్వము,కలహశీలత్వము,అహంకృతి,నమ్రత,ఆకలి,దప్పికపలాయనము,సాంఘికముమొదలగు పద్నాలుగు సహజాతములు పిల్లలలో ఉంటాయని "మెక్డూగల్" అనే శాస్త్రజ్ఞుడు గుర్తించాడు.
తల్లిదండ్రులు తమ పిల్లలలోని సహజాతములను గుర్తించి తదనుగుణముగా జాగ్రత్తలు తిసుకోవాలి.మానసిక శాస్త్రజ్ఞులు 6-8సంవత్సరాల మధ్య పరావస్థ దశ ముఖ్యమైనదిగా భావిస్తారు. "బౌలీ" చేసిన ప్రయోగాలనుబట్టి నూటికి 50మంది నేరస్థులు చెడ్డ గృహపరిస్థితులు గల వారై ఉన్నారు. బాల్య దశ మంచి అలవాట్లను నేర్పుటకు అనువైనది.ఎంత చిన్నవాడైన అతని మనస్సు అంత గ్రహణశక్తి మృదుత్వము కలిగి ఉంటుంది. కుటుంబములోని తల్లిదండ్రులు పిల్లల మీద చూపు ప్రేమ,దయ,విసుగు,హేయముమొదలగునవి ప్రధమంగా వారి ప్రవర్తనకు మూలబీజములు. పిల్లల్ని చీటికీ మాటికి తిట్టటం వారిని గురించి చెడుగా ఇతరుల వద్ద చెప్పడం,కొట్టటం,వెక్కిరించడం,చులకన చేయడంవంటివి వారిని ఆత్మన్యూనతకు గురి చేయును.పిల్లలకు తల్లితండ్రులమీద ఇంటిమీద ప్రేమ కలిగేటట్లుగా పెద్దల ప్రవర్తన ఉండాలి. అప్పుడే వారు మంచి పిల్లలుగా పెరుగుతారు.వారు ఒక ప్రతిపత్తి,సమ్రక్షణ,ప్రేమ,స్వాతంత్ర్యంకోరుకుంటారు. అందుకు తగిన ప్రోత్సాహమివ్వాలి.అలాయిస్తూనే నిరంతరం గమనిస్తూ ఉండాలి.తల్లిదండ్రులు తమ ఆశయాలను,అభిలాషలను పిల్లలమీద రుద్దకూడదు. వారి ఆలోచనలను తెలుసుకొని గౌరవించాలి.పిల్లలు తమ ఆలోచనలు,కష్టనిష్టురాలను తల్లిదండ్రులతో స్వేచ్చగా నిర్భయంగా చెప్పుకొనే అవకాశం ఉండాలి.అప్పుడే ఉత్తమ వ్యక్తులుగా ఎదుగుతారు.

2 comments:

  1. చాలా బాగా.. చెప్పారు. మీ బ్లాగ్ బాగుంది లక్ష్మి గారు. అభినందనలు.

    ReplyDelete
  2. Valuable matter.Thank you.

    ReplyDelete